కరోనాపై కదనం

ABN , First Publish Date - 2022-01-20T05:29:19+05:30 IST

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న వేళ వైరస్‌పై దండయాత్ర చేసేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వైద్య విధాన పరిషత్‌, వైద్య ఆరోగ్య శాఖలు సిద్ధమయ్యాయి.

కరోనాపై కదనం
మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలోని 150 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వార్డు

కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు

కొవిడ్‌ సెంటర్లు, మందులు సిద్ధం

అన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

సిబ్బంది కొరత లేదంటున్న వైద్యులు


కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న వేళ వైరస్‌పై దండయాత్ర చేసేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వైద్య విధాన పరిషత్‌, వైద్య ఆరోగ్య శాఖలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కొవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్లను, వెంటిలేటర్లను రెడీ చేశాయి. పరీక్షలు చేసేందుకు కిట్లు, వైరస్‌ సోకిన వారికి ఇచ్చేందుకు టీకాలు, మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కమ్యూనిటీ ఆస్పత్రులు, పీహెచ్‌సీలలో కూడా అవసరమైన మేరకు ఏర్పాట్లు చేశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాయి.

- మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం)/వనపర్తి వైద్యవిభాగం/నారాయణపేట క్రైం/గద్వాల క్రైం


కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రెండేళ్ల కిందటే 150 పడకలతో ఆక్సీజన్‌ పడకలతో ప్రత్యే కంగా వార్డును ఏర్పాటు చేయించారు. దీంతో పాటు రోగులు ఎక్కువైతే ఆస్పత్రిని మొత్తం గా కొవిడ్‌ వార్డుగా ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ట్రయాజ్‌ ఏరియా ద్వారా కొవిడ్‌ రోగులకు ఓపీ, నిరం తర వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో కూడా కొవిడ్‌ రోగుల కోసం పడకలను ఏర్పాటు చేయించారు. 


నిరంతర వైద్యసేవలు

జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో నిరంతరం వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. జనరల్‌ ఆస్పత్రిలో కూడా రెగ్యులర్‌ డాక్టర్లతో పాటు హౌజ్‌ సర్జన్ల సేవలను కూడా వినియోగిం చుకుంటున్నారు. ప్రస్తుతం జనరల్‌ ఆస్ప త్రిలో 115 మంది రెగ్యులర్‌ డాక్టర్లతో పాటు 150 మంది హౌస్‌ సర్జన్లు, 370 మంది స్టాఫ్‌ నర్సులు, మరో 80 మంది పారా మెడికల్‌ సిబ్బంది ఉన్నారు. ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వకుండా సేవలను వినియోగించు కుంటున్నారు.


ఆక్సిజన్‌ కొరత లేదు

జనరల్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదు. రెండేళ్ల కిందటే 13 కేఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును ఏర్పాటు చేశారు. దీని ద్వారా 250 పడకలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తు న్నారు. అంతేకాకుండా ఇటీవల గాలి నుంచి ఆక్సిజన్‌ను తయారు చేసే ఆక్సిజన్‌ వ్యవ స్థను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కొవిడ్‌ వార్డులో సెంట్రల్‌ ఆక్సిజన్‌ పద్ధతిని ఏర్పాటు చేశారు.


మందులు, వైద్య సామగ్రి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కొవిడ్‌కు సంబంధించి సరిపోను మందులు, వైద్య సామగ్రి అందుబాటులో ఉన్నాయి. ఇటీవల రాష్ట్రం నుంచి అన్ని రకాల మందులు, సామగ్రి జిల్లాకు వచ్చాయి. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి ఒక్కో ప్రభుత్వ ఆస్పత్రికి 20 వేల ఐసోలేషన్‌ కిట్లు, 35 వేల టెస్టింగ్‌ కిట్లు, 10 వేలు త్రీ లేయర్‌ మాస్కులు, ఐదు వేలు ఎన్‌95 మా స్కులు, ఇతర మందులు సరఫరా చేశారు. అంతేకా కుండా జన రల్‌ ఆస్పత్రికి రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఐదు వేలు ఇచ్చారు. ప్రస్తు తం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో 23,500 ఐసోలేషన్‌ కిట్లు, 2,35,000 టెస్టింగ్‌ కిట్లు, 20 లక్షల త్రీలే యర్‌ మాస్కులు, 5 లక్షల ఎన్‌95 మాస్కులు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఐదు వేల చొప్పున నిల్వ ఉంచారు.


జనరల్‌ ఆస్పత్రికే రెఫర్‌

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లాల్లో గతంలో కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి, అక్కడే వైద్య సేవ లు అందించారు. కానీ ప్రస్తుతం అన్ని జిల్లా ల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా, జనరల్‌ ఆస్పత్రికే రెఫర్‌ చేస్తు న్నారు. నాగర్‌కర్నూల్‌లో ఐసో లేషన్‌ వార్డు రిన్నోవేషన్‌ చేస్తుండగా, గద్వాల్‌, వనపర్తిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నారాయణపేట జిల్లాలో ఐసోలేషన్‌ వార్డు లేదు. దీంతో పాజిటివ్‌ రోగులతో పాటు లక్షణాలున్న ప్రతీ ఒక్కరిని జనరల్‌ ఆస్పత్రికే పంపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వైద్యులు వైరస్‌ బారిన పడుతుండగా, పనిభారం కూడా పెరుగుతోంది.


భయాందోళన అవసరం లేదు

కొవిడ్‌ వైరస్‌పై భయాందోళన చెందొద్దని, మందులు అందు బాటులో ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. అంతే కాకుండా అవసరం అనుకుంటే తప్ప బయటకు రావొద్దని, వచ్చినా మాస్కులు వాడాలని చెబుతున్నారు.


నారాయణపేటలో సిబ్బంది కొరత

ఒమైక్రాన్‌ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకొని నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో రెండు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఈ రెండు వార్డుల్లో ఆరు బెడ్స్‌ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్‌ నిధులతో జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఆక్సిజన్‌ సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. కానీ ప్లాంట్‌ను అధికారికంగా ఇప్పటివరకు ప్రారంభించ లేదు. కొవిడ్‌ రోగులకు ఎలాంటి మందుల కొరత లేదు. 10 వెంటిలేటర్ల సదుపాయం ఉంది. మక్తల్‌ సివిల్‌ ఆస్పత్రిలో 10 కొవిడ్‌ బెడ్స్‌తో పాటు 10 ఆక్సిజన్‌ బెడ్స్‌, కోస్గి మండలం గుండుమాల్‌ సీహెచ్‌సీలో ఆరు కొవిడ్‌ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏరియా ఆస్పత్రి స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ అయినా, పోస్టులు పూర్తి స్థాయిలో మంజూరు కాలేదు. తాజాగా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు మంగళవారం జిల్లా ఆస్పత్రిలో 15 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 


వైద్యులు, మందులు సిద్ధం

జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 140 బెడ్స్‌ కొవిడ్‌ బాధితులకు అందుబాటులో ఉంచారు. వీటికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. జిల్లా ఆస్పత్రిలో ఉన్న రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లలో ఒకటి అందుబాటులో ఉందని, దాంతో ఆక్సిజన్‌ సమస్య లేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చందూనాయక్‌ చెబుతున్నారు. చిన్నపిల్లల వార్డులో 20 బెడ్స్‌కు ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. అలంపూర్‌లో 12 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. గద్వాల మండలంలోని గొనుపాడులో 100 బెడ్స్‌తో, ఇటిక్యాల వద్ద మరో 100 బెడ్స్‌తో ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీలో మూడు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ఉన్నాయి. జిల్లాలో 26,000 ర్యాపిడ్‌ కిట్స్‌, 900 ఆర్‌టిపీసియర్‌(వీఏటీ) కిట్స్‌, 34,000 హోం ఐసోలేషన్‌ కిట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వైద్య సిబ్బంది కొరత లేదని, అందుబాటులో ఉన్నారని చందూనాయక్‌ చెప్పారు.


వనపర్తిలో 160 బెడ్స్‌ రెడీ

వనపర్తి జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. అందులో 60 ఆక్సీజన్‌ బెడ్స్‌ను రెడీగా ఉంచారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించ నున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ సిలిండర్‌లను, 29 వెంటిలేటర్లు అందుబాటలో ఉంచారు. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో మరో 160 బెడ్స్‌ ఏర్పాటు చేశారు. అవి జిల్లా కేంద్ర సమీపంలోని వైటీసీ భవనంలో ఏర్పాటు  చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 100 పడకలు ఏర్పాటు చేసి, ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. ఆత్మకూర్‌, రేవల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఒక్కో చోట 10 చొప్పున ప్రత్యేక పడకలు, వీపనగండ్ల, ఘనపూర్‌ పీహెచ్‌సీల్లో 20 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు.









Updated Date - 2022-01-20T05:29:19+05:30 IST