బే ఏరియాలో ఘ‌నంగా భార‌త స్వాతంత్య్ర దినోత్సవం..‘స్వదేశ్‌’

ABN , First Publish Date - 2022-08-16T14:31:38+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని బే ఏరియాలోనూ భార‌త స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల‌ను ``స్వదేశ్`` పేరుతో ఘ‌నంగా నిర్వహించారు.

బే ఏరియాలో ఘ‌నంగా భార‌త స్వాతంత్య్ర దినోత్సవం..‘స్వదేశ్‌’

ప్రత్యేక అతిథిగా విశ్వన‌టుడు, ప‌ద్మ విభూష‌ణ్ గర్రహీత క‌మ‌ల్ హాసన్

భార‌త దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు.. ఒక్క భార‌త్‌లోనే కాకుండా.. ఖండాంత‌రాల్లో ఉన్న భార‌తీయులు సైతం ఘ‌నంగా నిర్వహించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించ‌డంతోపాటు స్వాతంత్య్ర సంగ్రామ ఘ‌ట్టాల‌ను మ‌న‌నం చేసుకుని, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు ఘ‌న‌నివాళుల‌ర్పించారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలోని బే ఏరియాలోనూ భార‌త స్వాతంత్య్ర  దినోత్సవ వేడుక‌ల‌ను ‘స్వదేశ్’ పేరుతో ఘ‌నంగా నిర్వహించారు.


అసోసియేష‌న్ ఆఫ్ ఇండో అమెరిక‌న్స్‌(ఏఐఏ), బారీ 92.3 ఆధ్వర్యంలో `ఆజాదీకా అమృత్ మ‌హోత్సవ్‌` లో భాగంగా జ‌రిగిన ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని 39 భారతీయ సంస్థలు స‌హ‌కారం అందించాయి. విశ్వన‌టుడు, ప‌ద్మ విభూష‌ణ్ గ్రహీత క‌మ‌ల్ హాసన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. అదేస‌య‌మంలో 63 ఏళ్ల ‘క‌మ‌లిజం’తో పాటు.. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం `విక్రమ్` విజ‌యోత్సవాన్ని కూడా ఇదే వేదిక‌పై ఘ‌నంగా నిర్వహించారు. 


ఈ సందర్భంగా క‌మ‌ల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆజాదీ కా అమృతోత్సవాలను మీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం మరపురానిది. అమెరికాలో ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరూ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేందుకు మీ వంతు కృషిచేస్తున్నారు’’  అని అన్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (SFO) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ సహా ప‌లువురు ప్రముఖులు భార‌త జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించారు. ఇతర ప్రముఖులలో మేయర్ రిచ్ ట్రాన్ (మిల్పిటాస్), మేయర్ సామ్ లిక్కార్డో (శాన్ జోస్), స్టేట్ సెనేటర్ బాబ్ వికోవ్స్కీ, శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్ సిండి చావెజ్, కౌంటీ సూపర్‌వైజర్ ఒట్టో లీ, శాంటా క్లారా డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్, రో ఖన్నా కార్యాలయం నుంచి కాంగ్రెస్ ప్రతినిధి, సెనేటర్ డేవ్ కోర్టేస్,  అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్‌లీ తోపాటు అనేక ఇతర నగరాలకు చెందిన మేయర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. 


కాలిఫోర్నియా అటార్నీ జనరల్ బొంటా, ఓక్లాండ్ మేయర్ లిబ్బి షాఫ్ & కాంగ్రెస్ మహిళలు అన్నా ఎషూ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జెండా వంద‌నం అనంతరం సభను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగిస్తూ, 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశభక్తిని చూసి సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మార్చినందుకు AIA బృందానికి డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ అభినంద‌న‌లు తెలిపారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించడం, మన వారసత్వం. సంస్కృతిని పరిరక్షించడంలో AIA ముందుంద‌ని కొనియాడారు.‘స్వదేశ్‌‘ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అయిన భార‌త సంస్కృతి, సంప్రదాయాల‌ను ప్రచారం చేయ‌డ‌మేన‌ని.. ప‌లువురు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మిలే సుర్ మేరా ప‌ర్యవేక్షించారు.   


వివిధ రాష్ట్రాల నుండి వ‌చ్చిన 200 మందికిపైగా చిన్నారులు సంగీత, నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు అంద‌రినీ అల‌రించాయి. క్యారమ్స్ , చెస్ పోటీలు నిర్వహించారు. "జన గణ మన" అతిపెద్ద సింక్రొనైజ్డ్ కోరస్ గానం ఆహూతుల‌ను అల‌రించింది. 100 అడుగుల భారతీయ జెండా పరేడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అనంత‌రం ప్రముఖ సింగ‌ర్ విద్యా వోక్స్ నిర్వహించిన సంగీత విభావ‌రి వీనుల విందు చేసింది. ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో సహకారం అందించిన వ‌లంటీర్‌లకు, స‌హ‌కారం అందించిన ప్రతి ఒక్కరికీ  AIA బృందం ధన్యవాదాలు తెలిపింది. సంజయ్ గుప్త CPA, రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాగరాజ్ అన్నయ్య, ఐసీసీ బ్యాంకు, ఆజాద్ ఫైనాన్సియల్స్, సంపూర్ణ ఆయుర్వేద, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తదితరులు  స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. 


ఏఐఏ గురించి క్లుప్తంగా..

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) అనేది యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీ  వైవిధ్యమైన. వారసత్వాన్ని మ‌రింత పెంపొందించేందుకు కృషి చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ. AIA లక్ష్యం దాని సభ్యుల మధ్య సాంస్కృతిక‌, సామాజిక పరస్పర చర్యలను ప్రోత్సహించడం. భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలను సులభతరం చేయడం, భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం. ఈ గొప్ప సంస్కృతిని సంఘంతో పంచుకోవడం.

Updated Date - 2022-08-16T14:31:38+05:30 IST