బంగాళాఖాతంలో వాయుగుండం

ABN , First Publish Date - 2022-05-08T01:56:17+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పయనించి

బంగాళాఖాతంలో వాయుగుండం

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 1,270 కి.మీ. ఆగ్నేయంగా, పూరీకి 1,300 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం శనివారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ‘తుఫాన్‌’కు శ్రీలంకకు చెందిన ‘అసాని’ అని నామకరణం చేయనున్నారు. తుఫాన్‌ ఈ నెల పదో తేదీ వరకు వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 10, 11 తేదీల్లో ఉత్తరకోస్తాలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Read more