నగరంలో వారంలోగా గుంతలన్నీ పూడ్చేస్తాం

Published: Fri, 03 Jun 2022 11:07:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నగరంలో వారంలోగా గుంతలన్నీ పూడ్చేస్తాం

- హైకోర్టు ఆగ్రహంతో బీబీఎంపీ అప్రమత్తం

- డివిజన్ల ఉన్నతాధికారులకు బాధ్యతలు

- బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌


బెంగళూరు, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): దేశ ఐటీబీటీ రాజధానిగా విలసిల్లుతున్న బెంగళూరు నగరంలోని అనేక రహదారుల అధ్వాన్న స్థితిపై హైకోర్టు ధర్మాసనం మరోసారి తన తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. రహదారులపై తాజాగా చేపట్టిన మరమ్మతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేసింది. పలు మార్లు హెచ్చరిస్తున్నా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఇలా అయితే ఇక ఉపేక్షించేది లేదని, కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద పరిగణించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించడంతో బీబీఎంపీ అప్రమత్తమైంది. బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాధ్‌ నగరంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ధర్మాసనం సూచన మేరకు మర్మతుల విషయంలో మరింత జాగరూకత వహిస్తామని చెప్పారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు రహదారులపై 5,500కు పైగా గుంతలను పూడ్చివేశామని ఇంకా 50 శాతం గుంతలను పూడ్చాల్సి ఉందని అంగీకరించారు. వారం రోజుల అవధిలో ఈ గుంతలన్నింటిని పూడ్చివేస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకు ఆయా డివిజన్ల ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన రహదారులపై గుంతల పూడ్చివేతను చేపట్టాలని సంబంధిత విభాగాలను ఆదేశించామన్నారు. ఇప్పటికే పూడ్చివేసిన గుంతల తీరును తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. మే నెలలో నగరంలో వర్షాలు పడినందునే గుంతల పూడ్చివేతలో జాప్యం జరిగిందని ఆయన వెల్లడించారు. రహదారులపై ఒక చదరపు కిలోమీటర్‌ పరిధిలో గుంత పూడ్చేందుకు కనీసం 60 లోడ్ల తారు అవసరమన్నారు. రహదారుల పూడ్చివేతలో పైథాన్‌ యంత్రాలను వినియోగిస్తున్నామని, రహదారుల గుంతల పూడ్చివేతకు సంబంధించి అమెరిక్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థకు కాంట్రాక్టు అప్పగించామని తెలిపారు. మైసూరు రోడ్డులో రహదారుల తవ్వకానికి జలమండలి తమ అనుమతి కోరిందని అయితే మూడు నెలల వరకు అనుమతి ఇవ్వడం సాధ్యంకాదని చెప్పేశామన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.