Bbmp Elections: వారంలోగా వార్డు రిజర్వేషన్ల జాబితా ప్రకటించాలి

ABN , First Publish Date - 2022-07-29T16:56:10+05:30 IST

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) వార్డుల రిజర్వేషన్‌ జాబితాను ప్రభుత్వం వారంలోగా ప్రకటించాలని తదుపరి వెంటనే ఎన్నికల

Bbmp Elections: వారంలోగా వార్డు రిజర్వేషన్ల జాబితా ప్రకటించాలి

- ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి 

- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) వార్డుల రిజర్వేషన్‌ జాబితాను ప్రభుత్వం వారంలోగా ప్రకటించాలని తదుపరి వెంటనే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీబీఎంపీ ఎన్నికలను తక్షణం నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఎం.కాన్హిల్కర్‌ నాయకత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. మొత్తం 243 వార్డుల రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే బీబీఎంపీ(Bbmp) ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉటుందని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసేందుకుగాను ప్రభుత్వానికి ఇప్పటికే 8 వారాల గడువును ఇవ్వడం జరిగిందని ఇప్పుడు తాజాగా మరో వారంకంటే అధికంగా గడువు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టంచేసింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పాలనా అవధి 2019 సెప్టెంబరు 10తో పూర్తయినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో అధికారుల రాజ్యమే సాగుతోంది. నిజానికి 2020 డిసెంబరు 4న కర్ణాటక హైకోర్టు ఈ అంశంపై దాఖలైన పిటీషన్‌(Petition)పై విచారణ జరిపి ఆరువారాల్లోగా ఎన్నికలను జరుపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)కు అప్పీలు చేసుకోగా స్టే విధించింది. సుప్రీంకోర్టు తాజాగా జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో బీబీఎంపీకి ఆగష్టు నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి శాసనసభ ఎన్నికల ముందే నగరంలో ఎన్నికల కోలాహలం తప్పేట్టు లేదు.



Updated Date - 2022-07-29T16:56:10+05:30 IST