వసతిగృహాల్లో మెరుగైన వసతులు

ABN , First Publish Date - 2022-01-24T03:59:13+05:30 IST

జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వై.వెంకటయ్య పేర్కొన్నారు.

వసతిగృహాల్లో మెరుగైన వసతులు
విద్యార్థులతో మాట్లాడుతున్న వెంకటయ్య

జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటయ్య 

ఉదయగిరి రూరల్‌, జనవరి 23: జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వై.వెంకటయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీసీ వసతిగృహాన్ని ఆయన తనిఖీ చేసి వసతిగృహంలో వసతులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 99 బీసీ వసతిగృహాలు ఉండగా కరోనా దృష్ట్యా ఇప్పటి వరకు 77 వసతిగృహాలు తెరుచుకొన్నాయన్నారు. మిగిలిన వసతి గృహాలు సైతం తెరుచుకొనేలా సంక్షేమాధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులకు కాస్మొటిక్‌, మెస్‌ చార్జీలు డిసెంబరు వరకు చెల్లించామన్నారు. దోమల బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక నిధుల ద్వారా వసతి గృహాల కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు సంబంధించి నగదు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోనే జమ చేస్తుండడంతో ఫీజులు సకాలంలో చెల్లించాలన్నారు. అనంతరం సంబంఽధిత రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్‌ భాషుసాహెబ్‌, సిబ్బంది మీనిగ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T03:59:13+05:30 IST