BCCI: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన బీసీసీఐ.. వాళ్లకు పండగే.. డబ్బులొచ్చి పడ్డాయిగా..

ABN , First Publish Date - 2022-05-31T22:47:58+05:30 IST

ఐపీఎల్ విజయవంతంగా ముగిసింది. మార్చి 26న మొదలైన 2022 ఐపీఎల్ సీజన్ మే 29తో ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను మినహాయిస్తే..

BCCI: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన బీసీసీఐ.. వాళ్లకు పండగే.. డబ్బులొచ్చి పడ్డాయిగా..

ఐపీఎల్ విజయవంతంగా ముగిసింది. మార్చి 26న మొదలైన 2022 ఐపీఎల్ సీజన్ మే 29తో ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను మినహాయిస్తే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఐపీఎల్ సజావుగా జరిగింది. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక క్వాలిఫైయర్ మ్యాచుల సమయానికి వరుణుడు కాస్త ఇబ్బంది పెట్టినా గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లు పిచ్‌లను మ్యాచ్‌లకు అనుకూలంగా మార్చి ఐపీఎల్‌ సాఫీగా జరిగేలా చూశారు. దీంతో.. ఇంత కష్టపడిన గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు బీసీసీఐ తాజాగా నజరానా ప్రకటించింది. ‘Unsung Heroes’ అయిన క్యూరేటర్లకు, గ్రౌండ్స్‌మెన్‌కు కోటీ పాతిక లక్షల ప్రైజ్ మనీని ప్రకటించింది.



అహ్మదాబాద్, పుణె మినహాయిస్తే మిగిలిన నాలుగు స్టేడియమ్స్‌లో 130 మంది గ్రౌండ్స్‌మెన్ పనిచేశారని బీసీసీఐ తెలిపింది. ఈ నజరానాకు సంబంధించి ప్రకటన చేస్తూ బీసీసీఐ సెక్రటరీ జయ్‌షా ట్వీట్ చేశారు. TATAIPL 2022ను విజయవంతంగా ముగించేందుకు కారణమైన ఆరు ఐపీఎల్ వేదికల్లో సేవలందించిన క్యూరేటర్లకు, గ్రౌండ్స్‌మెన్‌కు 1.25 Crores ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని జయ్‌షా ట్వీట్ చేశారు. పిచ్‌లను సిద్ధం చేసేందుకు ఎంతో శ్రమించిన ప్రతీ ఒక్కరికీ బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. CCI, Wankhede, DY Patil, MCA.. ఈ ఒక్కో స్టేడియంకు (క్యూరేటర్లకు, గ్రౌండ్స్‌మెన్‌కు) రూ.25 లక్షల చొప్పున బీసీసీఐ ప్రైజ్ మనీ ప్రకటించింది.



కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి రూ.12.5 లక్షల చొప్పున ప్రకటించింది. గ్రౌండ్స్‌మెన్‌కు ఇంత పెద్ద మొత్తంలో బీసీసీఐ ప్రైజ్ మనీ ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. DY Patil Stadiumలో 30 మంది, వాంఖడే స్టేడియంలో 17 మంది, CCIలో 25 మంది గ్రౌండ్స్‌మెన్ పనిచేసినట్లు తెలిసింది. ఈడెన్ గార్డెన్స్ చీఫ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండు ప్లే-ఆఫ్ మ్యాచుల కోసం 70 మంది గ్రౌండ్స్‌మెన్ పనిచేసినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ బీసీసీఐ ప్రైజ్ మనీపై స్పందిస్తూ మరో ప్రతిపాదన కూడా బోర్డ్ ముందు పెట్టారు. ఐపీఎల్ గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.20 కోట్ల బోనస్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ట్వీట్ చేసిన సర్దేశాయ్ మరో ప్రతిపాదన కూడా చేశారు. మాజీ టెస్ట్ క్రికెటర్లకు, అంపైర్లకు, విధవలకు పెన్షన్‌ను కూడా పెంచుతామని బోర్డ్ హామీ ఇస్తుందా అని జయ్‌షాను, గంగూలీని ట్యాగ్ చేసి రాజ్‌దీప్ అడిగారు. బోర్డ్ ఖజానా పుష్కలంగానే ఉందని ఆయన గుర్తుచేశారు.

Updated Date - 2022-05-31T22:47:58+05:30 IST