ఐపీఎల్ ముగింపు వేడుకలు నిర్వహించే యోచనలో బీసీసీఐ

ABN , First Publish Date - 2022-04-17T01:50:40+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. 2019 నుంచి ఆరంభ

ఐపీఎల్ ముగింపు వేడుకలు నిర్వహించే యోచనలో బీసీసీఐ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింపు వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. 2019 నుంచి ఆరంభ, ముగింపు వేడుకలు లేకుండా ఐపీఎల్ జరుగుతోంది. ఈ సీజన్ కూడా ఆరంభ వేడుకలు లేకుండానే లేకుండా ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలోనే ఉండడంతో ఈసారి ముగింపు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముగింపు వేడుకలు నిర్వహించాలన్న యోచన అయితే ఉందని, బీసీసీఐ పెద్దలు ఈ విషయంలో తుది నిర్ణయానికి రావాల్సి ఉందని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముగింపు వేడుకలకు సంబంధించి బీసీసీఐ ప్రతిపాదనలు కూడా కోరింది.


ఐపీఎల్ ముగింపు వేడుకలను టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహించేందుకు ప్రఖ్యాత సంస్థల నుంచి బిడ్‌లను ఆహ్వానించినట్టు బీసీసీఐ తెలిపింది. ప్రతిపాదన కోసం అభ్యర్థన పత్రం (ఆర్‌ఎఫ్‌పీ) రూ. లక్షకు అందుబాటులో ఉందని,  ఏప్రిల్ 25వ తేదీ వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. మే 29న జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 


2019లో తొలిసారి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ ప్రారంభమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నిధులను విరాళంగా ఇవ్వాలని బీసీసీఐ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఏ) నిర్ణయించడంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఆ సీజన్ ప్రారంభ వేడుకలు నిర్వహించలేదు. కరోనా కారణంగా 2020, 2021 సీజన్లు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించడంతో వేడుకలు సాధ్యం కాలేదు.  ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలోనే ఉండడంతో ఐపీఎల్ మ్యాచ్‌లకు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. 

Updated Date - 2022-04-17T01:50:40+05:30 IST