భారత్‌లో మాత్రం జరగదు

ABN , First Publish Date - 2021-05-11T09:15:46+05:30 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వాయిదా పడిన తర్వాత ఇక మిగిలిన సీజన్‌ను ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అ

భారత్‌లో మాత్రం జరగదు

ఐపీఎల్‌పై గంగూలీ



న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వాయిదా పడిన తర్వాత ఇక మిగిలిన సీజన్‌ను ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఓ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్‌-14వ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లు మాత్రం భారత్‌లో జరగవని తేల్చాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడ మిగిలిన లీగ్‌ను నిర్వహించాలంటే చాలా అడ్డంకులు ఉంటాయని తెలిపాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌ క్యాలెండర్‌ బిజీగా ఉందని, లీగ్‌ ఎప్పుడు జరుగుతుందనే విషయం కూడా చెప్పలేమని స్పష్టం చేశాడు.


‘ఐపీఎల్‌ కోసం మళ్లీ జట్లన్నంటికీ 14 రోజుల క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అది సాధ్యం కాదు. అందుకే మిగతా సీజన్‌ ఇక్కడ జరగదు. మరెప్పుడు నిర్వహిస్తామనేది చెప్పడం కూడా తొందరపాటే అవుతుంది. అలాగే ఐపీఎల్‌ కోసం స్లాట్‌ను వెతకడంపైనా ఇప్పటికైతే స్పష్టత లేదు’ అని దాదా తెలిపాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ ముగిశాక.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు కూడా లీగ్‌ను నిర్వహించే అవకాశం లేదన్నాడు. ఆ సమయంలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళుతుందని గుర్తుచేశాడు. మరోవైపు ఇప్పటికే ఇంగ్లండ్‌, శ్రీలంక, యూఏఈ దేశాలు లీగ్‌ నిర్వహణకు ముందుకు వచ్చాయి.


ఆ ముగ్గురిపై ఒత్తిడి చేయం: ఈసీబీ

ఐపీఎల్‌ వాయిదా పడడంతో ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బట్లర్‌, వోక్స్‌, సామ్‌ కర్రాన్‌ స్వదేశంలోనే క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే వచ్చే నెల 2 నుంచి కివీ్‌సతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ కోసం వీరిపై ఎలాంటి ఒత్తిడి చేయమని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్‌ అష్లే గైల్స్‌ తెలిపాడు. క్వారంటైన్‌, బబుల్స్‌లో ఉండడం వారికి అలవాటైందని, అలాగే మున్ముందు చాలా క్రికెట్‌ ఉందని చెప్పాడు. అందుకే వారిపై ఒత్తిడి తేకుండా కొత్త ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉందన్నాడు. 

Updated Date - 2021-05-11T09:15:46+05:30 IST