HYD : రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్నారా.. 24/7 వాటి కన్ను మీ పైనే.. ఒక్కరోజే ఇన్ని కేసులు, జరిమానాలా..!?

ABN , First Publish Date - 2021-10-26T14:34:37+05:30 IST

చందు ప్రైవేట్‌ ఉద్యోగి. రాత్రిపూట విధులు నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి 3 తర్వాత ...

HYD : రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్నారా.. 24/7 వాటి కన్ను మీ పైనే.. ఒక్కరోజే ఇన్ని కేసులు, జరిమానాలా..!?

  • ఈ - చలాన్‌లో సాంకేతిక దన్ను
  • పగలు, రాత్రి కూడా ఫొటోలు..
  • ఏడాదిలో ఒక్క సైబరాబాద్‌లోనే..
  • 4.97 లక్షల కేసులు నమోదు
  • వాహనదారులూ తస్మాత్‌ జాగ్రత్త

చందు ప్రైవేట్‌ ఉద్యోగి. రాత్రిపూట విధులు నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి 3 తర్వాత ఇంటికి వెళ్తుంటాడు. ఓ రోజు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో ఫోన్‌ మాట్లాడుకుంటూ, ఓవర్‌ స్పీడ్‌తో సిగ్నల్‌ను కూడా పట్టించుకోకుండా వాహనం నడిపాడు. రెండు రోజుల తర్వాత చందు ఇంటికి తెలంగాణ పోలీసుల లెటర్‌ వచ్చింది. తెరిచి చూస్తే ఈ చలాన్‌ నోటీస్‌. అందులో డేంజరస్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, వితవుట్‌ హెల్మెట్‌, వితవుట్‌ మిర్రర్‌ తదితర కేసుల కింద రూ. 2,535 జరిమానా విధించినట్లు ఉంది. సంబంధిత చిత్రాలను ఈ - చలాన్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కరోజే ఇన్ని కేసులు, జరిమానాలు చూసి చందు షాకయ్యాడు.


హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరంలోని అన్ని సిగ్నల్స్‌ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన ఏఎన్‌పీఆర్‌ (ఆటోమాటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజింగ్‌) సిస్టం కెమెరాలు ఉల్లంఘనులను వెంబడిస్తున్నాయి. పోలీసులు ఉన్నా లేకపోయినా, స్థానికులు ఫొటోలు తీసినా తీయకపోయినా 24/7 వాహనాల ఫొటోలు తీస్తున్నాయి. ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసులు తీసిన ఫొటోల ఆధారంగా వాహనదారులకు జరిమానాలు విధించడం తెలిసిందే. ఇప్పుడు ఆధునిక కెమెరాలే ఆ పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు సీసీటీవీ కెమెరాల ఆధారంగా కమాండ్‌ కంట్రోల్‌లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్‌ వీడియోలను చూసి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నంబర్‌ప్లేట్స్‌ గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు.


తాజాగా ఏఎన్‌పీఆర్‌ టెక్నాలజీలో అన్ని రకాల ట్రాఫిక్‌ వయేలేషన్స్‌ను కెమెరాలు గుర్తించే విధంగా సెట్టింగ్స్‌ చేశారు. ఎప్పుడైతే ఒక వాహనం ట్రాఫిక్‌ వయిలేషన్‌ చేస్తుందో కెమెరా ఆ వాహనం నంబర్‌ ప్లేట్‌తో సహా ఆటోమాటిక్‌గా ఫొటోను క్యాప్చర్‌ చేస్తోంది. అలా 24/7 తీసిన ఫొటోలను కమిషనరేట్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌కు పంపుతుంది. అక్కడి సిబ్బంది ఆయా నెంబర్ల ఆధారంగా వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు.


జనవరిలో అందుబాటులోకి..

ఏఎన్‌పీఆర్‌ టెక్నాలజీ ఈ ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చింది. మొదట మూడు సిగ్నల్స్‌ వద్ద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సైబరాబాద్‌లో సుమారు 20 సిగ్నల్స్‌ వద్ద అమర్చినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ టెక్నాలజీతో తక్కువ సిబ్బందితో ఎక్కువ జరిమానాలు విధించే అవకాశం ఉంది. నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ దాని ప్రత్యేకత కావడంతో కచ్చితమైన ఫొటోలు తీస్తోంది. పది నెలల్లో ఏఎన్‌పీఆర్‌ సిస్టం ద్వారా 4,96,214 వయేలేషన్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు తీస్తున్న ఫొటోల్లో ఎక్కువగా డేంజరస్‌ డ్రైవింగ్‌/ ఓవర్‌ స్పీడ్‌, హెల్మెట్‌ లేకపోవడం, రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. 





Updated Date - 2021-10-26T14:34:37+05:30 IST