కొలువు పేరుతో.. వ్యభిచార కూపంలోకి.. అమ్మాయిలూ జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-03-26T13:21:33+05:30 IST

ఉద్యోగం ఇవ్వాలంటే ఎవరైనా విద్యార్హత, నైపుణ్యాలు, అనుభవం చూస్తారు.

కొలువు పేరుతో.. వ్యభిచార కూపంలోకి.. అమ్మాయిలూ జాగ్రత్త!

  • ఇతర రాష్ర్టాల యువతులకు వల
  • ఇంటర్వ్యూ అంటే వారి ఫొటోలే.. బాగుంటే సెలెక్ట్‌
  • ఉద్యోగం ఆశతో రాగానే బెదిరించి దారుణాలు
  • ఇటీవల ఢిల్లీ యువతికి చేదు అనుభవం
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ : ఉద్యోగం ఇవ్వాలంటే ఎవరైనా విద్యార్హత, నైపుణ్యాలు, అనుభవం చూస్తారు. వారు అలాకాదు. మంచి కొలువు ఇస్తామని ఫేస్‌బుక్‌లో అమ్మాయిలను నమ్మిస్తారు. ఇంటర్వ్యూలో నిలువెత్తు ఫొటోలు, క్లోజప్‌లో దిగిన ఫొటోలు పంపమని అడుగుతారు. అమ్మాయిలు బాగుంటే ప్రత్యక్ష ఇంటర్వ్యూకని పిలిపించుకొని, ఉద్యోగం పేరుతో కస్టమర్ల దగ్గరకు పంపుతారు. వారు అక్కడికి చేరుకొని విషయం తెలుసుకునేలోపే బెదిరింపులకు దిగి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతారు. ఎదురుతిరిగితే దాడులకు పాల్పడతారు. ఒక్కసారి బాధితులు వాళ్ల వలలో పడితే ఇక అంతే. వాళ్లు చెప్పినట్లు చేయాల్సిందే. వెళ్లమన్న చోటుకు వెళ్లాల్సిందే! ఇలా ఉద్యోగం పేరుతో బయట రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను నగరానికి పిలిపించుకొని వ్యభిచార కూపంలోకి దించుతున్నారని, ఈ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


ఇటీవల ఓ ఘటన

ఇటీవల గోపాలపురం పీఎస్‌ పరిధిలో వెలుగు చూసిన ఘటన ఆడపిల్లల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి(19) తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. అక్కడ ఉద్యోగం లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెకు హైదరాబాద్‌లో ఉం టున్న ఓ మహిళతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. ఉద్యోగమిస్తామని ఆ మహిళ నమ్మించడంతో ఆ యువతి, ఢిల్లీ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. రిసీవ్‌ చేసుకున్న మహిళ, ఆమెను తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ అయిన సతీశ్‌కు పరిచయం చేసింది. ఆ యువతికి సతీశ్‌ మాయమాట లు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన యువతి ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకొని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు పారిపోయింది. ఆమెను వెంబడిస్తూ సతీశ్‌, అతడి ముఠా స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆమెను వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె అదృష్టం కొద్దీ అదే సమయం లో అటుగా వచ్చిన గోపాలపురం పోలీసులను చూసి నిందితులు పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో ఎట్టకేలకు పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.


సంపాదన లేకపోవంతో ముఠా కట్టి.. 

నిందితులను విచారించగా యువతులను ట్రాప్‌ చేసి వ్యభిచార కూపంలోకి దించే ప్రయత్నాల గురించి వివరించారు. ఈ గ్యాంగులో ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీశ్‌, వరంగల్‌కు చెందిన సురేశ్‌, తూర్పు గోదావరికి చెందిన పవన్‌లతో పాటు గ్యాంగ్‌లో అఖిల్‌, తేజ, చరణ్‌లు కలిసి ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఈ గ్యాంగ్‌ సభ్యులు బేగంపేటలో నివాసం ఉంటూ ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పనిచేశారు. సంపాదన సరిపోకపోవడంతో అడ్డదారులు ఎంచుకున్నారు. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చే మహిళలను టార్గెట్‌ చేసేవారు. వారికి ఉద్యోగం కల్పిస్తామని మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించేవారని ఒప్పుకొన్నారు.


అమ్మాయిలూ జాగ్రత్త 

ఉద్యోగమిస్తామని ఆన్‌లైన్‌లో ఎవరైనా ఆఫర్‌ ఇస్తే వివరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అక్కడికి వెళ్లాలని యువతులకు పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా షీ టీమ్‌ల సాయం తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. 

Updated Date - 2021-03-26T13:21:33+05:30 IST