ఈవీలతో జాగ్రత్త

ABN , First Publish Date - 2022-05-05T10:06:58+05:30 IST

ఎలక్ట్రిక్ వాహనాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏదో గొప్పగా చెప్పారని కాక, ఇటీవల అవి నిలువునా తగులబడుతున్న ఘటనలతో వాటిపై విస్తృత చర్చ జరుగుతోంది. కరెంటు స్కూటర్ల బ్యాటరీలు చార్జింగులో...

ఈవీలతో జాగ్రత్త

ఎలక్ట్రిక్ వాహనాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏదో గొప్పగా చెప్పారని కాక, ఇటీవల అవి నిలువునా తగులబడుతున్న ఘటనలతో వాటిపై విస్తృత చర్చ జరుగుతోంది. కరెంటు స్కూటర్ల బ్యాటరీలు చార్జింగులో ఉండగా పేలిపోయి, గాఢనిద్రలో ఉన్నవారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు బాధకలిగిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఖర్చు కలిసొస్తుందన్న లెక్కల మధ్యన మిగతా వాహనాలతో పోల్చితే కాస్తంత ఎక్కువ రేటు పెట్టి కరెంటు బండీ కొనుక్కున్నవారు సైతం ఆ తరువాత బ్యాటరీతో ఇబ్బందులు పడలేకపోతున్నారు. తమిళనాడులో ఒక వ్యక్తి నడిరోడ్డుమీద తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని పెట్రోలు పోసి తగులబెట్టేసిన వీడియో ఒకటి ఇటీవల ప్రచారమైంది. పెట్రోలు వాహనాలకంటే, ఈవీలే కారుచవుకగా లభించే రోజులు ఎంతో దూరంలో లేవని చెబుతున్న నితిన్ గడ్కరీ తక్షణమే ఈవీ విధానాన్ని మరమ్మత్తు చేసి, ప్రజల్లో సానుకూలత పెంచాల్సిన అవసరం ఉన్నది.


ఈవీల భద్రత, నాణ్యతలను పరిశీలించేందుకంటూ ప్రభుత్వం ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల విద్యుత్ స్కూటర్లు తగులబడిపోవడమో, బ్యాటరీలు పేలిపోవడమో వరుసపెట్టి జరుగుతున్న నేపథ్యంలో ఈవీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. కొన్ని వాహన తయారీ సంస్థలు మార్కెట్ నుంచి వాహనాలను ఉపసంహరించుకున్నాయి. ఈ చర్యలు ఉపశమనాన్నిచ్చేవే కానీ, పరిష్కారం కాదు. ప్రజల్లో ఈవీల పట్ల భయం హెచ్చితే వాటివైపు కన్నెత్తిచూడడానికి కూడా ఇష్టపడరు. చమురుధరలు ఆకాశాన్నంటుతున్నందున కూడా ప్రజలు ఈవీలపై దృష్టిపెట్టారు. దేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పత్తిచేసే మొత్తం వాహనాలతో పోల్చితే రోడ్లమీద తిరుగుతున్న ఈవీల సంఖ్య అతిస్వల్పమే. కానీ, బ్యాటరీ ఖరీదు పడిపోవడం, ప్రభుత్వాలు ఈవీలకు రాయితీలు, మినహాయింపులూ ఇస్తుండటంతో వాటిపై మోజు పెరుగుతున్నది. ఏడాదికాలంలో విద్యుత్ స్కూటర్ల కొనుగోలు నాలుగురెట్లు హెచ్చడానికి పెట్రోమంటలతోపాటు, ఈ రంగంలో స్టార్టప్ లు పెరగడం కూడా ఓ కారణం. కోట్లరూపాయల ప్రోత్సాహకాల ఫలితంగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన కంపెనీల్లో అనేకం నాణ్యతలేని బ్యాటరీలు ఉపయోగిస్తున్నందునే ఈ పేలుళ్ళు సంభవిస్తున్నాయన్న విమర్శ కాదనలేనిది. వాహన నాణ్యత సంగతి అటుంచితే, ఈవీల్లో అత్యంత ముఖ్యమైనది బ్యాటరీయే. దానిని మనదేశంలోనే పూర్తిగా తయారుచేసుకొనే అవకాశాలూ, వ్యవస్థలూ ఇంకా ఏర్పడలేదు. పేరొందిన కార్ల తయారీ సంస్థలు కూడా విదేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే, నాణ్యత అధికంగా ఉండే ఖరీదైన బ్యాటరీల్లో ఉష్ణోగ్రతను సమర్థంగా నిర్వహించగలిగే థర్మల్ వ్యవస్థ పటిష్ఠమైనది ఉంటుంది కనుక సమస్యలూ ప్రమాదాలూ తక్కువ. కానీ, పోటీకారణంగా తక్కువ ఖరీదుకు వాహనాలను సమకూర్చే చిన్నచిన్న కంపెనీలు బ్యాటరీ దగ్గరే ఖర్చుకు రాజీపడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణుల వాదన. తీవ్రమైన ఎండలు, బ్యాటరీ చార్జి చేస్తున్నప్పుడు కంపెనీ సూచనలు పాటించకపోవడం వంటివి కూడా కొన్ని ఘటనలకు కారణమై ఉండవచ్చు. కానీ, ఉత్పత్తి, దిగుమతి దశల్లోనే వాహనాల నాణ్యతను పరీక్షించి, పరిరక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నదో తెలియదు. భారత్ లో వేడివాతావరణానికి ఏమాత్రం సరిపడని, త్వరితంగా పేలిపోయే స్వభావం ఉన్న చౌకరకం బ్యాటరీల వాడకాన్ని ముందుగానే నియంత్రించి ఉంటే బాగుండేది. హైపవర్  కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవడం, భారీ జరిమానాలతో కంపెనీలను శిక్షించడం కంటే, ఒక శాశ్వత వ్యవస్థతో ఈవీ కంపెనీల సమస్త కార్యకలాపాలను నియంత్రించడం అవసరం. అలాగే, ప్రయోజనాలతో పాటు ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు కూడా ఉన్నాయని వినియోగదారులకు తెలియచెప్పడమూ అవసరమే. ఈవీల వాడకం పెరగాలంటే ఉత్పత్తినుంచి చార్జింగ్, పార్కింగ్ వరకూ ప్రతీదశా ప్రమాదరహితంగా ఉండాల్సిందే. చమురు వాహనాల వాడకాన్ని వీలైనంత తగ్గించి, వాటి స్థానంలో ఎలక్ట్రికల్, బయో ఇథనాల్ , సీఎన్ జీ, ఎల్ ఎన్జీ వంటి కాలుష్యరహిత వాహనాలను పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విదేశీ బ్యాటరీలపై ఎక్కువకాలం ఆధారపడకుండా చూసుకోవడటంతో పాటు, ప్రత్యామ్నాయ ఇంధనాలతో స్వచ్ఛరవాణాని పెంపొందించడంపై మరింత దృష్టిపెట్టడం అవసరం.

Read more