హైదరాబాద్‌లో ఇలాంటోళ్లతో జాగ్రత్త...!

ABN , First Publish Date - 2021-05-09T17:32:35+05:30 IST

బీఎస్సీ పూర్తి చేసి తన గ్రామంలోనే వ్యవసాయం చేసుకునేవాడు. రెండేళ్ల పాటు

హైదరాబాద్‌లో ఇలాంటోళ్లతో జాగ్రత్త...!

  • వ్యవసాయశాఖలో ఉద్యోగాల పేరుతో వల
  • నిందితుడిని అరెస్ట్‌ చేసిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌  

హైదరాబాద్‌ సిటీ : వ్యవసాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నగరవాసి నుంచి రూ. 6.5 లక్షలు కొల్లగొట్టిన   నిందితుడిని వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా ఘన్‌పూర్‌ హరిజనవాడకు చెందిన గుర్రం రాజేంద్రప్రసాద్‌ అలియాస్‌ ప్రసాద్‌ అలియాస్‌ కృష్ణారెడ్డి(33) బీఎస్సీ పూర్తి చేసి తన గ్రామంలోనే వ్యవసాయం చేసుకునేవాడు. రెండేళ్ల పాటు రేషన్‌డీలర్‌గా పనిచేశాడు. లాభాలు రాకపోవడంతో తిరిగి వ్యవసాయం ప్రారంభించాడు. మద్యం, పేకాట వంటి అలవాట్లు కావడంతో మోసాలు చేయడం ప్రారంభించాడు. తాను సెక్రటేరియట్‌లో వ్యవసాయశాఖ కార్యదర్శినని చెప్పుకుంటూ, వ్యవసాయశాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు.


ఇలా తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొందరి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. దీంతో పరకాల, బేగంపేట, ఉప్పల్‌, వనపర్తి పోలీస్‌ స్టేషన్లలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. వనపర్తి పోలీసులు జనవరి 2021లో ఇతడిని అరెస్ట్‌ చేసి మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇతడు అదే విధంగా మోసాలకు పాల్పడ్డాడు. ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతంలో ఉండే ఓ నిరుద్యోగికి వ్యవసాయశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 6.5 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం విషయం గురించి అడిగితే రేపు.. మాపు అంటూ కాలయాపన చేశాడు. దాంతో అనుమానం వచ్చిన బాధితుడు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా నిందితుడిని గుర్తించి శనివారం అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-05-09T17:32:35+05:30 IST