సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-21T06:52:53+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల కార్మికులు స్పష్టం చేశారు. శుక్రవారం వారు ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం
ధర్నా చేస్తున్న హాస్టల్‌ కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న శంకరరావు


ఐటీడీఏ వద్ద ధర్నాలో హాస్టల్‌ కార్మికుల హెచ్చరిక

పాడేరురూరల్‌, మే 20: తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల కార్మికులు స్పష్టం చేశారు. శుక్రవారం వారు ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల్లో దినసరి, అవుట్‌సోర్సింగ్‌, తాత్కాలిక కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారన్నారు.  వారికి స్కూల్‌, కాలేజీ ఉన్న సమయాల్లో వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. సెలవుల సమయంలో కొద్దిమందిని మాత్రమే పనిలో పెట్టుకొని, మిగిలిన వారిని తీసుకోవడం లేదని, దీంతో ఆ కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. గిరిజన సంక్షేమ కాంట్రాక్టు, రెసిడెన్షియల్‌ టీచర్స్‌కు, కేజీబీవీ, గురుకులాల్లో పనిచేస్తున్న వారికి 12 నెలల వేతనం అమలు చేస్తున్న అధికారులు 25 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి కార్మికులకు, 15 ఏళ్లుగా పనిచేస్తున్న పొరుగుసేవల కార్మికులకు 12 నెలల జీతాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అధికారులు స్పందించి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేకుంటే సమ్మెబాట తప్పదని శంకరరావు హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బోనంగి చిన్నయ్యపడాల్‌, టీడబ్ల్యూ హాస్టల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పి.బాలన్న, వెంకటరమణ, రాంప్రసాద్‌, పద్మనాభం, మోహన్‌, రామలింగం పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T06:52:53+05:30 IST