కొవిడ్‌పై పోరుకు సిద్ధం కండి

ABN , First Publish Date - 2021-04-18T05:17:15+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్‌ వీర పాండియన్‌ ఆదేశించారు.

కొవిడ్‌పై పోరుకు సిద్ధం కండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వీరపాండియన్‌

  1. వందశాతం వ్యాక్సినేషన్‌ సాధించాలి
  2. టిడ్కో గృహాల్లో పడకలు ఏర్పాటు చేయండి
  3. అధికారులకు కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశం

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 17:  కరోనా సెకండ్‌ వేవ్‌ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్‌ వీర పాండియన్‌ ఆదేశించారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌లపై జిల్లా నోడల్‌ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, శనివారం 700 కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. మూడు నెలలుగా ఒక్క మరణం కూడా సంభవించలేదని, తాజాగా రోజుకు ఒకరిద్దరు మరణిస్తున్నారని అన్నారు. వైరస్‌ కట్టడికి అప్పజెప్పిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రైమరీ కాంటాక్టు, లక్షణాలు ఉన్న వారికి, 104 కాల్‌ చేసిన వారికి కొవిడ్‌ టెస్టులు చేయాలన్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యాధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని కోరారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ మెడికల్‌ కిట్‌ అందించాలని సూచించారు. ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లు వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను మూడు గంటల్లోగా పరిష్కరించాలని, టెస్టింగ్‌, హోం ఐసొలేషన్‌, బెడ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సోమవారం ఉదయం 7 గంటలకే మొదలు పెట్టాలని, వెంటనే డేటా అప్‌లోడ్‌ చేసి మధ్యాహ్నం లోపు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేస్తారని, వారికి ఖచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించాలని ఆదేశించారు.  


కొవిడ్‌ కేర్‌ సెంటర్లను సిద్ధం చేయండి..

కర్నూలు నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌, నంద్యాల, ఆదోని టిడ్కో హౌసింగ్‌ గదుల్లో కరోనా బాధితులకు వసతి కల్పిస్తామని, అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో ఏర్పాట్ల గురించి అధికారులతో శనివారం సమీక్షించారు. కర్నూలు టిడ్కో హౌసింగ్‌ కాలనీల్లో 400 గదులు, నంద్యాల టిడ్కో హౌసింగ్‌ కాలనీలో 300 గదులు, ఆదోని టిడ్కో హౌసింగ్‌ కాలనీలో 300 గదులలో పడకలను ఆదివారం సాయంత్రంలోపు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, నీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బాధితులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయాలని అన్నారు. శానిటేషన్‌ కోసం ఏజెన్సీని నియమించాలని, వారికి తగిన శిక్షణ ఇవ్వాలని, పీపీఈలు, మాస్కులతో విధులు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్స్‌ ఆక్సీమీటర్‌, మాస్కులు, శానిటైజర్‌, పీపీఈ కిట్‌, మెడిసిన్స్‌, గ్లౌజ్‌లు తదితర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో జేసీ రాంసుందర్‌ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, డీఆర్వో పుల్లయ్య, జిల్లా కొవిడ్‌ కో ఆర్డినేషన్‌ ఆఫీసర్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివా సులు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య, జడ్పీ సీఈవో వెంకట సుబ్బ య్య, డీఐవో డాక్టర్‌ విశ్వేశ్వరరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చంద్రశేఖర్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ రమాదేవి, డిస్ర్టిక్ట్‌ బీసీ వెల్ఫేర్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.


బాధితులు రాగానే అడ్మిట్‌ చేసుకోవాలి

  1. సూపరింటెండెంట్లతో కలెక్టర్‌ సమీక్ష

కొవిడ్‌ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. బాధితులు హాస్పిటల్‌కు వచ్చిన వెంటనే అడ్మిట్‌ చేసుకోవాలని బెడ్స్‌ కేటాయించాలన్నారు. కర్నూలు టౌన్‌ కొవిడ్‌ హాస్పిటల్స్‌పై కర్నూలు కమిషనర్‌, నంద్యాల కొవిడ్‌ హాస్పిటల్స్‌పై నంద్యాల సబ్‌ కలెక్టర్‌ రివ్యూ చేస్తారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


కరోనాతో ఇద్దరి మృతి

  1. జిల్లాలో 507 మందికి పాజిటివ్‌ 
  2. కర్నూలులో 171, నంద్యాలలో 66, మంత్రాలయంలో 22  

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 17: జిల్లాలో కరోనా విలయం సృష్టిస్తోంది. శనివారం ఒక్కరోజే 507 మందికి  పాజిటివ్‌ రాగా, ఇరువురు మృతి చెందారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 65,396కు చేరింది. 2,890 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలు నగరంలో 171, నంద్యాల మున్సిపాలిటీలో 66, ఆదోని మున్సిపాలిటీలో 76, మంత్రాలయంలో 22, కోడుమూరులో 16, ఆలూరులో 16, సిరివెళ్ల-11, బండి ఆత్మకూరు-11, ఎమ్మిగనూరు మున్సిపాలి టీలో 17, గోనెగండ్ల-9, చాగలమర్రి-8, చాపిరేవుల-7, ప్యాపిలి-7, మహానంది-4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 61,997 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు.


ఎయిర్‌పోర్టులో ఆరుగురికి పాజిటివ్‌

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 17: ఓర్వకల్లు విమానాశ్రయంలో పని చేస్తున్న ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యాధికారి శనివారం తెలిపారు.  రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో వైద్య సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. వీరు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.్చ

Updated Date - 2021-04-18T05:17:15+05:30 IST