ఆత్మవిమర్శ చేసుకోండి

Dec 5 2021 @ 01:07AM
పెనుకొండ నగరపంచాయతీ ఎన్నికలపై సమీక్షిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

నిజాయతీగా కష్టపడేవారికే పార్టీలో సముచిత స్థానం

అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు

అక్రమ కేసులు.. వైసీపీకి తాత్కాలిక ఆనందమే

అనంత తమ్ముళ్లతో మాజీ సీఎం చంద్రబాబునాయుడు

అనంతపురం, డిసెంబరు4(ఆంరఽధజ్యోతి):  పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఆ పార్టీ జిల్లా నేతలకు సూ చించారు. నిజాయతీగా కష్టపడి పనిచేసే వారికే పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న భరోసా ఇచ్చారు. పార్టీలో సముచిత పదవుల్లో ఉంటూ అలసత్వం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే దిలేదని హెచ్చరించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వీడియోకాన్ఫరెన ద్వారా జిల్లా నాయకులతో సమీక్షించారు. పార్టీ ఆవిర్భావం నుంచే టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుకొండలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో చంద్రబాబు జిల్లానేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకుల మధ్య సమన్వయలోపం, అలసత్వంతోనే పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. నాయకులంతా కలిసికట్టుగా పార్టీకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎంతటి నేతలనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నాయకులుగా ముందుకు సాగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార వైసీపీ దుర్మార్గాలను ఎండగడుతూ బాధితుల పక్షాన నిలవాలని చంద్రబాబు జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. పార్టీనేతలపై అక్రమ కేసులు బనాయించడం వైసీపీకి తాత్కాలిక ఆనందమేన న్నారు. వైసీపీ అరాచకాలకు అదరక, బెదరక ధైరంగా ఎదుర్కొని పోరాడాలని దిశానిర్ధేశం చేశారు. ఇదే సందర్భంలో.. పెనుకొండ నగర పంచాయతీలో టీడీపీ తరపున పోటీచేసిన అభ్యర్థులతో చంద్రబాబు చర్చించారు. వలంటీర్ల దౌర్జన్యాలు, వైసీపీ నేతల బెదిరింపులు, ప్రలోభాలు, అధికారుల వత్తాసు తదితర అంశాలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ పాలనలో ఉన్మాదం పెరిగిందని చంద్రబాబు వారితో అన్నారు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు హద్దుమీరిపోయాయనీ, ఆ ఉన్మాదులను ధైర్యంగా ఎదుర్కొంటేనే రాష్ర్టానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆ దిశగా పనిచేయాలని హితబోధ చేశారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు సమీక్షలో అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, హిందూపురం అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, ధర్మవరం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ఇనచార్జ్‌లు పరిటాల శ్రీరామ్‌, ఉమామహేశ్వరనాయుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు రామ్మోహనచౌదరి, సవిత, రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, వెంకటశివుడు యాదవ్‌, జేఎల్‌ మురళీధర్‌, ఆదినారాయణ, అనంత, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల ప్రధానకార్యదర్శులు శ్రీధర్‌చౌదరి, అంబికా లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌ మోద్దీన, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి, సీనియర్‌ నాయకులు కమతం కాటమయ్య, రామ్మూర్తినాయుడు, కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

హాజరైన జిల్లా నాయకులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.