ముందు ‘మహానది–గోదావరి’ కానివ్వండి

ABN , First Publish Date - 2020-12-31T06:11:15+05:30 IST

సహజ వనరుల సంక్షోభాన్ని అధిగమిం చేందుకు భగీరథ కృషి అవసరం. సాగుజలాల లోటుతో అల్లల్లాడుతున్న తమిళ ప్రజలు పాలకుల...

ముందు ‘మహానది–గోదావరి’ కానివ్వండి

మహానది (మణిభద్ర) గోదావరి (ధవళేశ్వరం) అనుసంధానం జరిగితే 823 కిలోమీటర్ల కాలువ వస్తుంది. 430 టీఎంసీలు మహానది నుంచి తరలించి మార్గం మధ్యలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లకు 200 టీఎంసీలు సరఫరా చేస్తారు. 230 టీఎంసీలు ధవళేశ్వరం చేరుతాయి. ఈ పథకం అమలు జరిగితే గోదావరి–కావేరి అనుసంధానం సులభతరమౌతుంది. మరి మహానది–-గోదావరి అనుసంధానాన్ని వదలి పెట్టి గోదావరి కృష్ణ సోమశిల కావేరి అనుసంధానం వైపు కేంద్రం మొగ్గు చూపడంలో ఔచిత్యముందా?


సహజ వనరుల సంక్షోభాన్ని అధిగమిం చేందుకు భగీరథ కృషి అవసరం. సాగుజలాల లోటుతో అల్లల్లాడుతున్న తమిళ ప్రజలు పాలకుల నుంచి అటువంటి కృషినే కోరుకొంటున్నారు. ఇదిగో, మేము ఉన్నాం అంటూ గోదావరి–-కావేరి జీవనదుల అనుసంధానానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ హడావుడి చేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసన్నమయ్యాయి కదా గోదావరి-–కావేరి అనుసంధానం విషయమై ఇటీవల ‘జాతీయ జల అభివృద్ధి సంస్థ’ సమావేశంలో చర్చ జరిగింది. గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. శుభ పరిణామమేమంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ అనుసంధానాన్ని వ్యతిరేకించాయి. ఛత్తీస్‌గఢ్ వాటా నుంచి తమిళనాడుకు గోదావరి జలాలు తరలించాలని గతంలో నితిన్ గడ్కరీ ఆలోచన చేశారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ కూడా అందుకు నిరాకరించింది. మహానది–గోదావరి అనుసంధానం జరిగితే గోదావరి-–కావేరి అనుసంధానానికి అంగీకరిస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెగేసి చెప్పాయి. గోదావరి నదీ జలాల్లో తమ వాటా విషయమై తెలుగు రాష్ట్రాలు వివాదపడుతున్నాయి. గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1480 టీఎంసీలు కేటాయించారు. ఇందులో తమ వాటా 967 టీఎంసీలని, ఆంధ్రప్రదేశ్ వాటా 510 టీఎంసీలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ వాటా 650 టీఎంసీలూ, తమ వాటా 775 టీఎంసీలూ అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఇంతకూ గోదావరిలో నికర, మిగులు జలాల పరిమాణం నిర్థారణ కాలేదు. ఇప్పుడున్న గణాంకాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వున్నాయి. 


ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం తలపడుతోంది! ఏ మాత్రం మిగులు జలాలు ఉన్నా దిగువ రాష్ట్రానికి దక్కడం సహజన్యాయం. కనుకనే నవ్యాంధ్ర ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గడం లేదు. కృష్ణలో క్రమేణా నీటి లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో మున్ముందు రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలే గత్యంతరమన్న వాస్తవాన్ని ఆంధ్రులు విస్మరించకూడదు. 


మోదీ మొదటి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గోదావరి- కావేరి అనుసంధానానికి పలు విధాల ప్రయత్నించారు. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ అనుసంధాన ప్రతిపాదనకు ససేమిరా అన్నారు. మహానది–-గోదావరి అనుసంధానం జరిగితే తప్ప ఇచ్చంపల్లి- సాగర్ అనుసంధానానికి అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2019లో సార్వత్రక ఎన్నికలు ముగియగానే గోదావరి–కావేరి అనుసంధానం డిపిఆర్ రెడీగా ఉందని మీడియా వార్తలు వెలువడ్డాయి. జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశాలు జరిగిన ప్రతిసారీ నదుల అనుసంధానంపై కేంద్రం గోదావరి బేసిన్ రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.


2020 డిసెంబర్ 8న జరిగిన ‘జాతీయ జల అభివృద్ధి సంస్థ’ సమావేశం గోదావరి–-కావేరి అనుసంధానానికి మూడు ప్రతి పాదనలు చేసింది. అవి: (1) ఇచ్చంపల్లి–సాగర్–సోమశిల–కావేరి; (2) అఖినేపల్లి-–సాగర్–సోమశిల–కావేరి; (3) జానంపేట–సాగర్–సోమశిల–కావేరి. ఈ అనుసంధానాల్లో ఏది అమలు జరిగినా గోదావరి నుంచి 247 టీఎంసీలు తరలించుతారు. ఇచ్చంపల్లి -అఖినేపల్లి నుంచి తరలించితే ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 81 టీఎంసీలు మాత్రమే లభ్యమవుతాయి. తెలంగాణకు 66 టీఎంసీలు, తమిళనాడుకు 83 టీఎంసీలు దక్కుతాయి. జానంపేట పథకం అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు 108 టీఎంసీలు, తెలంగాణకు 39 టీఎంసీలు, తమిళ నాడుకు యథావిధిగా 83 టీఎంసీలు తరలించాలని కేంద్రం ప్రతిపాదన చేసింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ మరో ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు. గోదావరి- (పోలవరం) కృష్ణ -బనకచర్ల క్రాస్ పథకం నుండి తమిళ నాడుకు గోదావరి జలాలు తరలించాలని కోరినట్లు చెబుతున్నారు. గోదావరి- పెన్నా అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసలు లేవు. కాబట్టి తమిళ నాడుకు గోదావరి జలాలు తరలించడాన్ని అంగీకరించి పనిలో పనిగా రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఈ ప్రతిపాదన కేంద్రప్రభుత్వానికి ఎంత వరకు ఆమోదయోగ్యమో? నిజానికి తెలంగాణతో కలసి ప్రతిపాదించిన నదుల అనుసంధాన పథకానికీ, దీనికి పెద్ద తేడా లేదు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కవలసిన మిగులు జలాలు తెలంగాణకు బదులు తమిళనాడుకు ఇచ్చినట్లవుతుంది.


గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన తెర మీదకు వచ్చినపుడల్లా మహానది–గోదావరి- అనుసంధాన ఆవశ్యకత ముందుకు వస్తోంది. 


1989లో జాతీయ జల అభివృద్ధి సంస్థ మహానది–కావేరి అనుసంధానానికి తొమ్మిది పథకాలను ప్రతిపాదించినది. 1901–-02 నుండి 1981–-82 వరకు ప్రవాహ గణాంకాల మేరకు గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద శ్రీరాం సాగర్ నుంచి దిగువ భాగంలో 2337.59 టీఎంసీల నీటి లభ్యత వుందని అంచనా వేసింది. తదనుగుణంగా ఇచ్చంపల్లి వద్ద 717.84 టీఎంసీల మిగులు జలాలు వుంటాయని కూడా తేల్చారు. ఈ సర్వే ప్రకారం దక్షిణ భారత దేశంలో తొమ్మిది అనుసంధానాలను జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతి పాదించింది. అవి: (1) మహానది- (మణిభద్ర) గోదావరి (ధవళేశ్వరం); (2)గోదావరి (పోలవరం)- కృష్ణ (ప్రకాశం బ్యారేజీ) 3)గోదావరి (ఇచ్చంపల్లి) కృష్ణ (సాగర్) -4) గోదావరి (ఇచ్చంపల్లి) కృష్ణ (పులిచింతల)- 5)కృష్ణ (ఆల్మట్టి) పెన్నా- 6) శ్రీశైలం సోమశిల -7) సాగర్ సోమశిల- 8) సోమశిల కావేరి-9) కావేరి వైగయ్ గుండర్. అయితే ఈ అనుసంధానాలకు తగినన్ని నీళ్లు లేవని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషా అడ్డు చెప్పడంతో ఈ పథకం మూలన పడింది. 


ఇదిలా ఉండగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జాతీయ జల అభివృద్ధి సంస్థ మరో మారు సర్వే నిర్వహించింది. 1901-–02 నుంచి 2010–-11 సంవత్సరాల మధ్య ప్రవాహ గణాంకాలు తీసుకొని శ్రీరాం సాగర్ దిగువ భాగంలో 75 శాతం నీటి లభ్యత కింద గోదావరిలో నీటి లభ్యత 2106.5 టీఎంసీలుగా తేల్చింది. గత సర్వేతో పోల్చుకుంటే 231 టియంసిలు తగ్గి పోయాయి. పైగా ఇచ్చంపల్లి వద్ద మిగులు లేక పోగా కిందకు 140 టియంసిలు వదితేనే రెండు రాష్ట్రాల అవసరాలు తీరుతాయని నిర్థారింప బడింది. ఇలా గోదావరిలో నీటి లభ్యత గురించి భిన్నమైన గణాంకాలు వుండగా ఉభయ తెలుగు రాష్ట్రాల వాటా తేల్చేందుకు ఒక వేపు కొత్త ట్రిబ్యునల్ నియమించుతూ మరో వేపు తమిళ నాడుకు గోదావరి జలాలు తరలించేందుకు కేంద్రం సిద్ధమౌతోంది! 


మహానది-–గోదావరి అనుసంధానానికి ఒడిషా ఏ మాత్రం అంగీకరించడం లేదు. మహానదిలో నీటి లభ్యత లేదని పైగా అనుసంధానం అమలు జరిగితే తమ భూభాగం ఎక్కువ ముంపునకు గురౌతుందని ఒడిషా చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మహానది ప్రస్తావన పక్కన బెట్టి గోదావరి కావేరి అనుసంధానం గురించే ఆలోచన చేస్తోంది. మహానది (మణిభద్ర) గోదావరి (ధవళేశ్వరం) అనుసంధానం జరిగితే 823 కిలోమీటర్ల కాలువ తవ్వ బడుతుంది. 430 టీఎంసీలు మహానది నుంచి తరలించి మార్గం మధ్యలో ఒడిషా ఆంధ్రప్రదేశ్‌లకు 200 టీఎంసీలు సరఫరా చేస్తారు. 230 టీఎంసీలు ధవళేశ్వరం చేరుతాయి. ఈ పథకం అమలు జరిగితే గోదావరి కావేరి అనుసంధానం సులభతరమౌతుంది. ఇప్పుడు కేంద్రప్రభుత్వం మహానది -గోదావరి అనుసంధానం వదలి పెట్టి గోదావరి కృష్ణ సోమశిల కావేరి అనుసంధానం వేపు మొగ్గు చూపుతోంది!


గోదావరి పెన్నా అనుసంధాన పథకానికి చంద్రబాబు ప్రభుత్వం రూప కల్పన చేసింది. 


ఆ కారణంగా ఆ పథకాన్ని పక్కన పెట్టడం వివేకం కాబోదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు గనుక కేంద్ర నిధులకు ఆశపడి, తమిళ నాడుకు గోదావరి నీళ్ళు ఇవ్వాలన్న కేంద్రం ప్రతి పాదనకు తలొగ్గితే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇదే సంభవిస్తే గోదావరి- పెన్నా అనుసంధానంతో దక్కే దాదాపు 300 టీఎంసీల స్థానంలో రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకు 100 టీఎంసీలకు మించవు. ఇక గోదావరి- పెన్నా అనుసంధానం గురించి మాట్లాడనవసరం లేదు. 

వి. శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2020-12-31T06:11:15+05:30 IST