గోకులాలకు అందని బిల్లులు

ABN , First Publish Date - 2021-11-07T04:46:52+05:30 IST

రైతు సంక్షేమం కోసం గత ప్రభుత్వం మినీ గోకులాల పథకాన్ని ప్రవేశ పెట్టింది.

గోకులాలకు అందని బిల్లులు
మల్లేవేములలో నిర్మించుకున్న మినీ గోకులం

  1. ఆందోళనలో రైతులు 


చాగలమర్రి, నవంబరు 6: రైతు సంక్షేమం కోసం గత ప్రభుత్వం మినీ గోకులాల పథకాన్ని ప్రవేశ పెట్టింది. పశువుల సంఖ్యను బట్టీ రూ.90 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు కేటాయించింది. దీంతో రైతులు ముందుకు వచ్చి గోకుల షెడ్లను నిర్మించుకున్నారు. అయితే మూడేళ్లు పూర్తయిన బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌లోని ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో మినీ గోకుల షెడ్లు 605 మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 365 వివిధ దశల్లో ఉన్నాయి. వీటి కోసం రూ.96.41 లక్షల బిల్లులు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. మినీ గోకుల షెడ్డుల్లో రెండు పశువులకు రూ.90 వేలు, నాలుగు పశువులకు రూ.1.20 లక్షలు, ఆరు పశువులకు రూ.1.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో రైతు వాటా 10 శాతం మాత్రమే ఉండేది. దీన్ని 30 శాతానికి పెంచింది. జిల్లాలో మంజూరైన 5,638 యూనిట్లలో 3,483 షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన బిల్లులు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల లబ్ధిదారులు నిర్మించుకున్న మినీ గోకులాలను పరిశీలించి పూర్తయిన గోకులాలకు బిల్లుల కోసం సంబంధిత శాఖ అధికారులు నివేదికలు పంపించారు. కేవలం కొంతమందికి మాత్రమే బిల్లులు వేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారుల తప్పిదం వల్ల బిల్లులు మంజూరుకాలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 



Updated Date - 2021-11-07T04:46:52+05:30 IST