ఆరోగ్యశ్రీలో అందని బిల్లులు

ABN , First Publish Date - 2021-11-24T05:45:37+05:30 IST

ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం అందాలన్న ప్రభుత్వ లక్ష్యం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నీరుగారుతోంది.

ఆరోగ్యశ్రీలో అందని బిల్లులు
ఏఈడీని కలిసేందుకు వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులు, వారి సహాయకులు

జీజీహెచ్‌లో 20 రోజులుగా అవస్థలు
ఆసుపత్రి ఏడీకి ఫిర్యాదు చేసిన రోగులు


కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 23: ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం అందాలన్న ప్రభుత్వ లక్ష్యం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నీరుగారుతోంది. జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ రోగులు చికిత్స కోసం ఖర్చు పెట్టిన బిల్లులకు 20 రోజులుగా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో వారు ఆరోగ్యశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆసుపత్రికి రోజూ 2 వేల మందికి పైగా రోగులు వస్తుంటారు. దాదాపు 1500 మంది అడ్మిషన్‌ రోగులు ఉంటారు. అడ్మిషన్‌ అయిన వారిలో 80 శాతం మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతుంటారు. ముఖ్యంగా ఏఎంసీ, క్యాజువాల్టీ, మెడికల్‌ సర్జరీ, గైనకాలజి, ఆర్థో, చిన్నపిల్లలు, ఈఎన్‌టీ రోగులు మందులు, పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ కింద రోగులకు అన్ని మందులు, పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించాలి. అయితే వైద్యులు ఆపరేషన్‌, చికిత్స చేసే సమయంలో మందులు, నిర్ధారణ పరీక్షలను బయటకి రాస్తున్నారు. ఇలా బయట కొనుగోలు చేసిన రోగులు డిశ్చార్జి సమయంలో ఆరోగ్యశ్రీ కార్యాలయంలో క్లెయిమ్‌ చేసుకుంటే బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. రోజూ 60 నుంచి 80మంది ఆరోగ్యశ్రీ రోగులు డిశ్చార్జి అవుతుంటారు. అయితే ఆరోగ్యశ్రీ కార్యాలయంలో నిధుల కొరత వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు.

ఆసుపత్రి ఏడీకి ఫిర్యాదు

తాము 20 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని డిశ్చార్జి అయిన రోగులు, వారి బంధువులు ఆసుపత్రి ఏడీ రమేష్‌బాబుకు మంగళవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఏడీ గది ఎదుట నిరసన తెలిపారు. బిల్లుల కోసం ఆరోగ్యశ్రీ కార్యాలయానికి వెళితే డబ్బులు లేవంటున్నారన్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు తిరిగినట్లు ఏడీకి వివరించారు. దీనిపై స్పందించిన ఏడీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి బిల్లులు చెల్లిస్తామన్నారు.

రూ.8 వేలు ఖర్చు అయింది..

మా అమ్మ లచ్చమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రిలో చేర్పించాం. 20 రోజుల క్రితం వైద్యులు డిశ్చార్జి చేశారు. చికిత్స కోసం రూ.8వేలు కాగా.. రూ.4వేలు మాత్రమే ఇస్తామన్నారు. సరే అని ఒప్పుకున్నా. 20 రోజులు నుంచి తిరుగుతున్నా డబ్బులు ఇవ్వడం లేదు.

 రామాంజినేయులు, వెల్దుర్తి

Updated Date - 2021-11-24T05:45:37+05:30 IST