సీఎం వద్ద భేటీకి.. ఈటలకు అందని ఆహ్వానం!

ABN , First Publish Date - 2021-03-01T08:33:31+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ సన్నద్ధతపై ఆదివారం సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు.

సీఎం వద్ద భేటీకి.. ఈటలకు అందని ఆహ్వానం!

  • వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో కొన్ని..
  • ఈటల నియోజకవర్గంలోని గ్రామాలు
  • ‘ఎమ్మెల్సీ పోరు’లో ప్రాధాన్యం కరువు
  • మంత్రి గంగులకు ‘హైదరాబాద్‌’ బాధ్యతలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ సన్నద్ధతపై ఆదివారం సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రి ఈటల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారు అయినప్పటికీ.. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోకి వస్తాయి. అంటే, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఈటల సొంత నియోజకవర్గం గ్రామాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయనను సీఎం వద్ద జరిగిన భేటీకి పిలవలేదు. దీంతో మఽధ్యాహ్నం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఈటల..  సాయంత్రం హుజూరాబాద్‌ వెళ్లారు. ఈటల వైఖరి మారిన కారణంగానే ఆయనను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కొంత దూరం పెడుతున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈటలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే చెందిన మరో మంత్రి గంగులకు ప్రత్యేకంగా హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన హరీశ్‌రావుకు రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రశాంత్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌ బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2021-03-01T08:33:31+05:30 IST