బ్యూటీ జుట్టుకు రంగేస్తున్నారా?

ABN , First Publish Date - 2021-06-23T09:01:23+05:30 IST

బ్లాండ్‌ మొదలు ప్లాటినం వరకూ వెంట్రుకలకు ఆకర్షణీయమైన రంగులతో డై చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌.

బ్యూటీ  జుట్టుకు రంగేస్తున్నారా?

బ్లాండ్‌ మొదలు ప్లాటినం వరకూ వెంట్రుకలకు ఆకర్షణీయమైన రంగులతో డై చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌. అయితే ఈ రంగులతో జుట్టుకు  మెరుపు, నునుపు దక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


 తలస్నానం: డై చేసే ముందు షాంపూతో తలస్నానం చేయకూడదు. వెంట్రుకల కుదుళ్లలో ఉండే సహజసిద్ధమైన నూనె డైలోని రసాయనాల నుంచి వెంట్రుకలకు రక్షణ కల్పిస్తుంది. దాంతో డై వేసుకోవడం వల్ల దురద, మంట లాంటి దుష్ప్రభావాలు తలెత్తవు. కాబట్టి డై వేసుకుని, ఆరిన తర్వాతే తలస్నానం చేయాలి.


 ప్యాచ్‌ టెస్ట్‌: కొన్ని జుట్టు రంగులు చర్మానికి సరిపడవు. దాంతో విపరీతమైన రియాక్షన్స్‌ తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డై వేసుకునే ముందు తప్పనిసరిగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి. ఇందుకోసం వెంట్రుకల చివర్లకు కొంత డై పట్టించి, వదిలేయాలి. ఆ వెంట్రుకలు మరీ ముదురు రంగుకు మారినా, రంగు తగ్గినా, బూడిద రంగులోకి మారినా ఆ హెయిర్‌ డై వాడకం ఆపేయాలి.


తెల్లవెంట్రుకలు: తెల్లవెంట్రుకలకు సెమీ పర్మనెంట్‌ కలర్‌ ఎంచుకోవాలి. దీని వల్ల వెంట్రుకల రంగులో డై తేలికగా కలుస్తుంది. ఒకవేళ అక్కడక్కడా రంగు వెలిస్తే, ఇలాంటి డై తో టచప్స్‌ కూడా చేసుకునే వీలుంటుంది. 


 స్కిన్‌ సెన్సిటివిటీ: డై వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే డైలో హైడ్రోజన్‌ పెరాక్పైడ్‌ పలుచన చేయాలి. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ డైలోని అమ్మెనియా పిహెచ్‌ లెవల్‌ను న్యూట్రలైజ్‌ చేసి, స్కిన్‌ ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది. 


అతి పలుచన అనర్థం: డైను నీళ్లతో పలుచన చేస్తే, వెంట్రుకలకు సరిపడా రంగు అంటదు. థర్మల్‌ ఆయిల్‌ లేదా మరేదైనా హెయిర్‌ ట్రీట్మెంట్‌ ఉత్పత్తితో డైను పలుచన చేయడం వల్ల వెంట్రుకలు జిడ్డుగా మారతాయి తప్ప అదనపు ప్రయోజనం ఉండదు.


పెట్రోలియం జెల్లీ: హెయిర్‌ లైన్‌ దగ్గర పెట్రోలియం జెల్లీ పూసుకుని, ఆ తర్వాత రంగు వేసుకుంటే ఆ ప్రదేశంలోని చర్మానికి రంగు అంటకుండా ఉంటుంది. 

Updated Date - 2021-06-23T09:01:23+05:30 IST