నాటి ఒక్క రోజు సీఎం.. నేడు రాష్ట్రానికే పెద్ద దిక్కు... కాబోయే సీఎం కూడా?

ABN , First Publish Date - 2022-03-10T12:48:00+05:30 IST

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి.

నాటి ఒక్క రోజు సీఎం.. నేడు రాష్ట్రానికే పెద్ద దిక్కు... కాబోయే సీఎం కూడా?

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. దీంతో అందరి చూపు నేడు జరిగే ఓట్ల లెక్కింపు పైనే ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ముఖ్యమంత్రి పదవికి హరీష్ రావత్ ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో హరీశ్‌ రావత్‌ ఆ పార్టీకి పెద్దదిక్కు అని కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పష్టంగా చెబుతున్నారు. కానీ ఆయనను నేరుగా సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీలో వర్గపోరు వస్తుందనే భావనతో పార్టీ అధిష్టానం ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో హరీష్‌ రావత్‌ పేరు ఎప్పుడూ మారుమోగుతుంటుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హరీశ్ రావత్ ఉన్నత అధికార పీఠాన్ని అధిరోహించారు. ఈ నేపధ్యంలో అతని ప్రయాణం అంత సులభం కాలేదు. 


విపక్షాలు సైతం.. కాంగ్రెస్ కంటే హరీష్ రావత్‌నే టార్గెట్‌గా చేసుకున్నాయి. దీనిని చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావత్ స్థాయి ఏపాటిదో అంచనా వేయవచ్చు. 1973లో కాంగ్రెస్ జిల్లా యువజన విభాగానికి అతి పిన్న వయసులోనే అధ్యక్షుడిగా ఎన్నికైన హరీశ్ రావత్.. అనంతర కాలంలో బలమైన నేతగా ఎదిగారు. 2012లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.  ఆయనకు ఉత్తరాఖండ్, గర్వాల్, కుమాన్‌లోని ప్రధాన ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. అదే సమయంలో ఉత్తరాఖండ్‌లో  ప్రజాదరణ పొందిన నాయకునిగానూ పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి అత్యంత నమ్మకమైన నేతగా ఉన్న హరీశ్ రావత్ ఇతర రాష్ట్రాల్లోనూ ట్రబుల్ షూటర్ పాత్ర పోషించారు. హరీష్ సింగ్ రావత్ 1948 ఏప్రిల్ 27న అల్మోరాలోని మోహన్రి గ్రామంలో జన్మించారు. లక్నో విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేశారు. హరీష్ రావత్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా కూడా రికార్డు నెలకొల్పారు. 2016లో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. 25 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత రావత్ 2016 ఏప్రిల్ 21న ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేత హరీష్ రావత్ 15వ లోక్‌సభలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఉత్తరాఖండ్‌లో హరీష్ రావత్‌ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం ఆయనకే దక్కుతుందనే అంచనాలున్నాయి.



Updated Date - 2022-03-10T12:48:00+05:30 IST