పలుకుబడి ఉంటేనే బెడ్డు!?

ABN , First Publish Date - 2021-05-15T05:07:36+05:30 IST

గ్రామీణ జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న అనకాపల్లిలో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఎన్టీఆర్‌ వైద్యాలయంలో సౌకర్యాలు, సేవలపై పేద, మధ్య తరగతి వర్గాలు పెదవివిరుస్తున్నాయి.

పలుకుబడి ఉంటేనే బెడ్డు!?
ఎన్టీఆర్‌ వైద్యాలయం కరోనా వార్డులో చికిత్స పొందుతున్న రోగులు

కరోనా వేళ అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో వింత పరిస్థితి

పేద, మధ్య తరగతికి అందని వైద్య సేవలు

బెడ్లు పెంచాలన్న డిమాండ్‌ను పట్టించుకోని పాలకులు


అనకాపల్లి, మే 14: గ్రామీణ జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న అనకాపల్లిలో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఎన్టీఆర్‌ వైద్యాలయంలో సౌకర్యాలు, సేవలపై పేద, మధ్య తరగతి వర్గాలు పెదవివిరుస్తున్నాయి. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇటు పాలకులు గానీ, అటు అధికారులు గానీ ఆస్పత్రిపై దృష్టిసారించడం లేదని వాపోతున్నాయి. 


మైదానంతో పాటు ఏజెన్సీ ప్రాంత మండలాల నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. కొవిడ్‌ రాకముందు రోజుకు 1200 నుంచి 1300 వరకు ఓపీ ఉండేది. ప్రస్తుతం దీనిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడంతో ఆయా మండలాల్లో వైరస్‌ సోకినవారంతా ఇక్కడకు సేవల నిమిత్తం వస్తున్నారు. తీరా ఇక్కడ బెడ్లు లేవని చెబుతుండడంతో ఆర్థిక స్థోమత కలిగినవారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతుండగా, పేదలు పడరాని పాట్లు పడుతున్నారు. 


వేధిస్తున్న పడకల కొరత


అనకాపల్లి జోన్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉంది. ఇప్పటివరకు సుమారు 670 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 18 మంది మృతిచెందారు. స్థానికంగా వున్న ఎన్టీఆర్‌ వైద్యాలయంలో మొత్తం 250 పడకలు వుండగా 85 కొవిడ్‌ బాధితుల కోసం కేటాయించారు. ఇందులో 50 పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా జరుగుతోంది. బెడ్ల కొరత కారణంగా ఆక్సిజన్‌ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితిలో వున్నవారిని కూడా ఇక్కడ చేర్చుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


అధికారులకు పట్టని ఆక్సిజన్‌ పడకల స్థాయి పెంపు


ఆస్పత్రిలో ఆక్సిజన్‌ పడకలు పెంచాలని ప్రజా సంఘాలు నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇటు అధికారుల్లో గానీ, అటు ప్రజాప్రతినిధుల్లో గానీ స్పందన లేదు. పలుకుబడి, పరపతి వున్న వారికి మాత్రమే ఇక్కడ చికిత్సలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అనామకులను అనాథల్లా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదోరకంగా ఆక్సిజన్‌ బెడ్లు సంపాదించినవారు వైరస్‌ పూర్తిగా తగ్గేంత వరకు ఆస్పత్రిలోనే వుంటుండడంతో అత్యవసరంగా ఆక్సిజన్‌ బెడ్ల కోసం వచ్చేవారిని సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారని అంటున్నారు.


అసలే వైద్యుల కొరత..ఆపై కొవిడ్‌ బారిన కొందరు..!


ఇదిలావుంటే, ఈ ఆస్పత్రి స్థాయి పెరిగినప్పటికీ వైద్యులు, సిబ్బంది సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటికీ 20 మందికి మించి వైద్యులు లేరని అంటున్నారు. వీరిలో కూడా కేవలం ఆరుగురు మాత్రమే కొవిడ్‌ రోగులకు సేవలందిస్తున్నారు. సగానికి పైగా వైద్యులు, సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. ఇక అంబులెన్సుల కొరత కూడా ఇక్కడ తీవ్రంగానే ఉంది. 104 వాహనాలు మొక్కుబడి అయ్యాయి. బాధితులు ఫోన్‌ చేస్తే..ఉలుకు పలుకు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తుంటే వారు దోచేస్తున్నారు. సమయానికి అంబులెన్స్‌ లేక పలువురు మృత్యువాత పడుతున్నారు.


ఇక్కడి నుంచి 36 వెంటిలేటర్లు విశాఖకు తరలింపు


ఇక్కడున్న వనరులను సైతం వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి వచ్చిన వెంటిలేటర్లను ఇన్‌స్టాల్‌ చేసేందుకు టెక్నీషియన్‌ లేకపోవడం వల్ల వాటిని మూలన పెట్టి వదిలేశారు. దీంతో ఇక్కడ వెంటిలేటర్లు వృథాగా పడి వున్నాయని తెలుసుకున్న జిల్లా అధికారులు 36 వెంటిలేటర్లను విశాఖకు తీసుకుపోయారు. ఈ విషయమై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణకుమార్‌ను వివరణ కోరగా, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెంటిలేటర్లను విశాఖ పంపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే వైద్యుల నియామకం కోసం అనేక పర్యాయాలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-05-15T05:07:36+05:30 IST