వారసత్వం, కుంభకోణాలతో దేశం కుదేలైంది: మోదీ

ABN , First Publish Date - 2022-05-30T18:30:08+05:30 IST

ఈరోజు మా ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. దేశ విశ్వాసం, దేశ ప్రజల విశ్వాసం ఎంతగానో పెరిగింది. కానీ 2014 ముందు పరిస్థితి వేరేలా ఉండేది. ఎక్కడ చూసినా అవినీతి, వేల కోట్ల కుంభకోణాలే కనిపించేవి. వారసత్వం రాజ్యమేలేది..

వారసత్వం, కుంభకోణాలతో దేశం కుదేలైంది: మోదీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా కరోనా మహమ్మారితో అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్ట్రన్‌’ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్స‌లో ప్రధాని నరేంద్ర మోదీ  పథక ప్రయోజనాలను వెల్లడించారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014కి ముందు దేశంలో వారసత్వం రాజ్యమేలేదని, ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపించేవని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవని, దేశం కొత్త శిఖరాలను చేరుకుంటోందని మోదీ అన్నారు.


‘‘ఈరోజు మా ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. దేశ విశ్వాసం, దేశ ప్రజల విశ్వాసం ఎంతగానో పెరిగింది. కానీ 2014 ముందు పరిస్థితి వేరేలా ఉండేది. ఎక్కడ చూసినా అవినీతి, వేల కోట్ల కుంభకోణాలే కనిపించేవి. వారసత్వం రాజ్యమేలేది. దేశమంతా ఉగ్రవాదం వ్యాప్తి చెంది ఉండేది. వీటన్నిటితో దేశం అతలాకుతలమైంది. కానీ గడిచిన ఎనిమిదేళ్లుగా దేశం పురోగతి సాధిస్తోంది. బహుశా దీన్ని ముందుగా ఎవరూ ఊహించి ఉండరు. ఈరోజు దేశఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ వేదికలపై భారత్ శక్తివంతంగా కనిపిస్తోంది’’ అని మోదీ అన్నారు.

Updated Date - 2022-05-30T18:30:08+05:30 IST