ఆమెకు పెళ్లి కుదిరింది.. పెళ్లి వేడుకకు ముందు కాబోయే భర్తకు కూడా తెలియకుండా ఆమె చేసిన పనిపై నెటిజన్ల ప్రశంసలు!

ABN , First Publish Date - 2022-01-05T21:19:58+05:30 IST

జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు.

ఆమెకు పెళ్లి కుదిరింది.. పెళ్లి వేడుకకు ముందు కాబోయే భర్తకు కూడా తెలియకుండా ఆమె చేసిన పనిపై నెటిజన్ల ప్రశంసలు!

జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు. బంధుమిత్రులను పిలిచి భారీగా విందు ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. అయితే భోపాల్‌కు చెందిన ఓ వధువు మాత్రం విభిన్నంగా ఆలోచించింది. వివాహితగా మారే ముందు తను ఎప్పట్నుంచో అనుకుంటున్న ఓ పని చేయాలనుకుంది. 150 మంది అనాథ పిల్లలకు ఓ ఖరీదైన రెస్టారెంట్‌లో విందు భోజనం పెట్టించింది. 150 మంది పేద పిల్లలతో రెస్టారెంట్‌లోకి వస్తున్న ఆమెను చూసి మొదట అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెపై ప్రశంసలు కురిపించారు. 


భోపాల్‌లోని రామలీలా మార్గ్‌కు చెందిన 23 ఏళ్ల ముబారికా సైఫీ అనే వైద్యురాలికి అబ్బాస్ అలీతో వివాహం కుదిరింది. గురువారం వీరి పెళ్లి కార్యక్రమం జరగబోతోంది. పెళ్లికి రెండ్రోజుల ముందు ముబారిక 150 మంది పేద పిల్లలను తీసుకుని నగరంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. పిల్లలు ఏమి అడిగితే అది ఇవ్వమని హోటల్ సిబ్బందికి చెప్పింది. మొదట అంత మందిని చూసిన సిబ్బంది, రెస్టారెంట్‌లోని ఇతర వినియోగదారులు ఆశ్చర్యపోయారు. అది పెళ్లి విందు అని తెలిసి ముబారికపై ప్రశంసలు కురిపించారు. 


`ఈ పని చేయడానికి ఇంత కంటే మంచి సందర్భం నాకు దొరకలేదు. ఈ విషయం గురించి నాక్కాబోయే భర్తతో కూడా చెప్పలేదు. ఇది నాకు మానసిక సంతోషం కలిగించే విషయం. అందుకే ఎవరికీ చెప్పలేదు. పెళ్లి విందు పేరుతో భారీగా ఖర్చు పెట్టే బదులు.. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందిస్తే మంచిదని నాకు అనిపించింది. మిగిలిన వారు కూడా ఇలా ఆలోచిస్తే కొందరి ఆకలైనా తీరుతుంద`ని ముబారిక చెప్పింది. ముబారిక అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచిందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-01-05T21:19:58+05:30 IST