మామిడికుదురు మండలం ఆదుర్రు బౌద్ధస్తూపం సమీపంలో వైనతేయ గోదావరి చెంతన నిర్మించిన పర్యాటక భవనం దుస్థితి
రూ.6 కోట్లతో ఆదుర్రులో పర్యాటక భవన నిర్మాణాలు
ఆరేళ్లు గడుస్తున్నా వినియోగంలోకి రాని వైనం
శిథిలస్థితికి చేరిన భవనాలు, వంతెనలు
పట్టించుకోని పర్యాటకశాఖ తీరుపై ప్రజల ఆగ్రహం
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో నిర్మి స్తున్న పర్యాటక భవనాలు ప్రారంభం కాకుండానే శిథిలమవు తున్నాయి. సర్వాంగ సుందరంగా నిర్మాణాలు పూర్తి చేసినా, భవనాలను పర్యాటకుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకు రావడంలో పర్యాటకశాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఇందుకు నిదర్శనమే మామిడికుదురు మండలం ఆదుర్రు బౌద్ధ స్తూపం సమీపంలో నిర్మించిన పర్యాటక భవనాల దుస్థితి. పర్యాటకశాఖ అధికారుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా ఈ భవన సముదాయాలు సాక్షాత్కరిస్తున్నాయి. మామాడికు దురు మండలంలోని వైనతేయ నదీ తీరాన ఆదుర్రు బౌద్ధ స్తూ పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో సుమారు ఆరు సంవత్సరాల కిందట రూ.6 కోట్ల వ్యయంతో పర్యాటకులు విడిది చేసేందుకు అనువైన భవనాలను నిర్మించారు. మడ అడవుల చెంతన ఓవైపు, గోదావరి మరోవైపు.. ఆదుర్రు బౌద్ధ స్తూపాలున్న ఈ ప్రాంతంలో వీటిని పర్యాటకశాఖ నిర్మించింది. వైనతేయ నదీ తీరాన పాశర్లపూడి నుంచి ఆదుర్రు బౌద్ధ స్తూపానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాశర్లపూడి వైపు వైనతేయ వంతెన కింద మరో పర్యాటక భవ నాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి ఆదుర్రుకు వైనతేయ నదిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు రూ.కోటి పైబడిన వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక బోటును కొనుగోలు చేశారు. అలాగే గోదావరి నది చెంత నుంచి పర్యాటక భవనాలకు చేరుకునేందుకు వీలుగా అందరినీ అలరించే రీతిన చెక్కలతో నిర్మించిన వంతెన ఇప్పుడు శిథిల స్థితికి చేరుకుంది. ఎక్కడికక్కడే చెక్కలు విరిగిపోయి నడిస్తే ఏ ప్రమాదం సంభవిస్తుందోన్న భయం పర్యాటకుల్లో నెలకొంది. భవన సముదాయం చుట్టూ అందమైన గార్డెన్, ఇతర సౌకర్యా లతో భవనాలు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసు కురావడంలో మాత్రం పర్యాటకశాఖ పూర్తిగా వైఫల్యం చెందిం దని పర్యాటకులు ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు. శిథిలస్థితికి చేరుకున్న భవనాలు, కూలుతున్న చెక్కలవంతెన, తుప్పు పట్టి పోతున్న పర్యాటక బోట్లు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి. అక్కడ చూసిన వారెవరైనా సరే ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలను గాలికి వదిలేయడం పట్ల పర్యాటకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండాల్సిన ఆదుర్రు పర్యాటక భవనాలు ఇప్పుడు రాత్రి అయితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. మందుబాబులు చిందులేస్తున్నారు. రాత్రి వేళల్లో విందులు చేసుకుంటున్నారు. అసభ్య కార్యకలాపాలకు పర్యాటక భవన సముదాయం వేదికగా మారింది. రాష్ట్ర పర్యా టకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇక్కడనున్న పర్యాటక భవ నాల దుస్థితిని పరిశీలించి త్వరలో జిల్లా కాబోతున్న కోనసీమ వాసులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.