రాజుకు గుణపాఠం

ABN , First Publish Date - 2021-04-23T05:30:00+05:30 IST

ఒక బౌద్ధారామంలో కోపిష్టి అయిన బిక్షువు ఉండేవాడు. ఆ ఆరామానికి సమీపంలోని గ్రామంలో ఇలాంటి స్వభావమే ఉన్న మరో భిక్షువు ఉన్నాడు. ఆరామంలో ఉన్న భిక్షువుకు తగిన శాస్తి చెయ్యాలని స్థానికులు కొందరు భావించారు. గ్రామంలోని భిక్షువును ఆరామానికి ఆహ్వానించారు...

రాజుకు గుణపాఠం

ఒక బౌద్ధారామంలో కోపిష్టి అయిన బిక్షువు ఉండేవాడు. ఆ ఆరామానికి సమీపంలోని గ్రామంలో ఇలాంటి స్వభావమే ఉన్న మరో భిక్షువు ఉన్నాడు. ఆరామంలో ఉన్న భిక్షువుకు తగిన శాస్తి చెయ్యాలని స్థానికులు కొందరు భావించారు. గ్రామంలోని భిక్షువును ఆరామానికి ఆహ్వానించారు. ఆ భిక్షువు రాగానే ఆరామంలోని కోపిష్టి గదిలోకి పంపారు. ‘వీళ్ళిద్దరూ తగవు పడి తన్నుకుంటారు. ఇద్దరికీ బుద్ధి వస్తుంది’ అనుకున్నారు. కానీ వారిద్దరూ చక్కగా కలిసిపోయారు. ఒకరికి ఒకరు సేవలు చేసుకోసాగారు. అవాక్కయిన స్థానికులు పరుగుపరుగున బుద్ధుని దగ్గరకు వెళ్ళి, విషయం చెప్పారు. అప్పుడు బుద్ధుడు వారికి ఒక కథ చెప్పాడు.


వారణాసి రాజు బ్రహ్మదత్తుడు పరమ పిసినారి. ఆయన దగ్గర దుష్ట స్వభావం కలిగిన మహాశోణం అనే గుర్రం ఉంది. ఒక రోజు ఉత్తరాపథం నుంచి ఒక గుర్రాల వ్యాపారి 500 గుర్రాలను తోలుకొని వచ్చి, రాజుగారికి కబురు పంపాడు. మహా మంత్రికి రాజు ఈ విషయం చెప్పకుండా, ఉప మంత్రిని పిలిచి, గుర్రాల కొనుగోలు గురించి ఆదేశాలు ఇచ్చాడు. ‘‘నువ్వు ఈ కొనుగోలు వ్యవహారం చూడు. రహస్యంగా మన పొగరుబోతు గుర్రాన్ని ఆ గుర్రపు మందలోకి పంపు’’ అని చెప్పాడు రాజు. ఆ ఉప మంత్రి అలాగే చేశాడు. వ్యాపారి గుర్రాల మందలోకి మహాశోణం వెళ్ళింది, ఇతర గుర్రాలను తన్నింది, కొరికింది. గుర్రాలన్నీ కలహించుకున్నాయి. వాటి కాళ్ళు బెణికాయి. శరీరంపై గాయాలయ్యాయి. 

అప్పుడు వచ్చి, వాటిని చూసిన రాజు-  ‘‘ఇవి క్రమశిక్షణతో లేవు. పైగా దెబ్బలతో ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పిన ధర ఇవ్వలేను. సగం ధర ఇస్తాను’’ అన్నాడు. 

వ్యాపారి చేసేదిలేక, రాజుకు ఎదురు మాట్లాడలేక ఇచ్చినంత తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ మహా మంత్రిని కలిసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

‘‘నీ దగ్గర దుష్ట స్వభావం ఉన్న అశ్వం లేదా?’’ అని అడిగాడు మహా మంత్రి. 

‘‘ఉంది మహాశయా!’’ అన్నాడు వ్యాపారి. 

‘‘ఈసారి వచ్చినప్పుడు... రాజు తన చెడ్డ గుర్రాన్ని నీ మందలోకి పంపగానే, నువ్వు కూడా నీ చెడ్డ గుర్రాన్ని పంపు’’ అని చెప్పాడు మహా మంత్రి. 

ఆ వ్యావారి మళ్ళీ వచ్చినప్పుడు మహా మంత్రి చెప్పినట్టే చేశాడు. ఈ సారి ఆ రెండు దుష్ట గుర్రాలూ కలిసిపోయాయి. అల్లరి పనులు మానేశాయి. రాజు చేసేది లేక, లోలోపల ఉసూరుమంటూనే వ్యాపారి కోరిన ధనాన్ని ఇచ్చాడు. ఈ విధంగా మహా మంత్రి తన ఉపాయ కౌశలంతో పిసినారి రాజుకు తగిన శాస్తి చేసి,  గుణపాఠం నేర్పాడు.

- బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2021-04-23T05:30:00+05:30 IST