నిందితులపై చర్యలకు వెనుకంజ!

ABN , First Publish Date - 2022-06-25T05:38:38+05:30 IST

నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన కత్తిపోట్ల ఘటనలో నిందితులు ఎవరన్నది పోలీసులకు బాహాటంగా తెలిసినా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనకంజ వేస్తున్నారు.

నిందితులపై చర్యలకు వెనుకంజ!

రాజకీయ ఒత్తిళ్లతో జాప్యం చేస్తున్న పోలీసులు

పరారీలో ప్రధాన నిందితులు

ఖిల్లా, జూన్‌ 24: నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన కత్తిపోట్ల ఘటనలో నిందితులు ఎవరన్నది పోలీసులకు బాహాటంగా తెలిసినా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనకంజ వేస్తున్నారు. కత్తిపోట్ల ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారినా నిందితులపై తక్షణ చర్యలకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. నగరానికి చెందిన ప్రధాన అనుచరుడి పాత్ర కీలకంగా ఉన్నా సదరు వ్యక్తిని అరెస్టు చేసే సాహసానికి పోలీసులు పూనుకోకపోవడంతో ఈ పరిణామం విమర్శలకు దారి తీస్తోంది. సామాన్యులు చిన్న పాటి తప్పు చేస్తే ఆగమేఘాల మీద వారిపై చర్యలు తీసుకునే ఖాకీలు కత్తిపోట్లకు పాల్పడి నగరంలో వాతావరణాన్ని చిన్నాభిన్నం చేసినా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారు. నగరంలోని వర్ని రోడ్డులో కత్తిపోట్ల ఘటనలో ప్రధాన నిందితుడిని వదిలి ఆయనతో పాటు ఉన్న వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా నిందితుడిని ఆ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

నలుగురి అరెస్టు 

ఖిల్లా: నగరంలో బుధవారం రాత్రి జరిగిన కత్తిపోట్లతో సంబంధం ఉన్న నలుగురిని ఐదవ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో సౌత్‌ రూరల్‌ ఇన్స్‌పెక్టర్‌, ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. ఆటోకు సైడ్‌ ఇవ్వాలని డ్రైవర్‌ భాను హారన్‌ కొట్టగా ఆటో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు ఆటోను ఆపి ఘర్షణకు దిగారన్నారు. రెండు బైకులు అడ్డం పెట్టి అడ్డగించి గొడవ పెట్టుకున్నారన్నారు. ఖాజా అనే యువకుడు తన వద్ద ఉన్న కత్తి తీసి సాయికృష్ణ, విశ్వనాథ్‌లను వెనుక నుంచి పొడిచాడని చెప్పారు. గొడవ పడ్డ వారిలో పేయింటర్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ ఖాజా, అజ్జు, అబ్దుల్‌ జుబేర్‌, సలాం, మహ్మద్‌ షాదాబ్‌, షేఖ్‌ ఫెరోజ్‌లు ఉన్నారన్నారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. మిగతా ఇద్దరు అజ్జు, సలాంలు పరారీలో ఉన్నారన్నారు. వీరిని సైతం త్వరలో పట్టుకుంటామన్నారు. అజ్జుపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్‌లో ఆరు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయనపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. నగరంలో ముఖ్యంగా 3,4,6,1 టౌన్లలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నిఘా పటిష్టం చేసి నేరాలను నియంత్రిస్తామన్నారు. ఇప్పటికి 08 మందిపై పీడీయాక్ట్‌ పెట్టడం జరిగిందన్నారు. నేరాలు జరుగకుండా రాత్రి వేళ వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-06-25T05:38:38+05:30 IST