సంతోషమే గొప్ప ఔషధం!

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

ఆధునిక కాలంలో వైద్య సదుపాయాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ఔషధాలు వస్తున్నాయి. అంతే స్థాయిలో వాటి అవసరం కూడా పెరుగుతోంది. వైద్యులు, వైద్య కళాశాలలూ పెరుగుతున్నా వ్యాధులు అదే స్థాయిలో...

సంతోషమే గొప్ప ఔషధం!

ఆధునిక కాలంలో వైద్య సదుపాయాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ఔషధాలు వస్తున్నాయి. అంతే స్థాయిలో వాటి అవసరం కూడా పెరుగుతోంది. వైద్యులు, వైద్య కళాశాలలూ పెరుగుతున్నా వ్యాధులు అదే స్థాయిలో అధికం ఎందుకు అవుతున్నాయనేది వైద్య విజ్ఞానం కూడా అర్థం చేసుకోలేకపోతోంది. నేడు మనం మన వివేకశక్తిని కోల్పోయి సాధనాలపై ఆధారపడుతున్నాం. ప్రపంచంలోని అన్ని శక్తుల కన్నా  సంకల్ప శక్తి గొప్పదని గ్రహిస్తే... అనేక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఆ శక్తిని మనం సరైన మార్గంలో ఉపయోగించకపోవడం వల్లనే వ్యాధుల సమస్య పెరుగుతోంది. మన ఆలోచనలు సంతోషభరితంగా ఉంటే ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉండగలం. ఎంతటి పేద వ్యక్తయినా... మందులకు లొంగని అసాధ్యమైన రోగాలను సరి చేసుకొనే తేలికైన పద్ధతి ఇది. 


మన శరీరానికి ఆత్మతో చాలా సూక్ష్మమైన సంబంధం ఉంది. ఆత్మ తాలూకు ఆలోచనా శక్తితో మనసు, మనోశక్తితో శరీరం నడుస్తాయి. మనసు ఎలా ఉంటుందో తనువు అలాగే ఉంటుంది. మనసు శ్రేష్ఠంగా ఉంటే శరీరం కూడా శ్రేష్టంగా ఉంటుంది. 95 శాతం వ్యాధులకు మూలం మనిషి మనసే అని వైద్య విజ్ఞానం కూడా అంగీకరిస్తుంది. బలహీనమైన, వ్యర్థమైన ఆలోచనల కారణంగానే నేడు రోగాల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువగా ఆలోచించే అలవాటు వల్ల శరీరంలోని ప్రతి భాగం మీదా ఒత్తిడి పడుతోంది. దీనివల్ల అవి సరిగ్గా పని చెయ్యలేవు. క్రమంగా అవయవాలు బలహీనపడి, అనారోగ్యం పాలవుతాయి. సంతోషకరమైన ఆలోచనలు మానసిక పరివర్తనకు దోహదం చేస్తాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. 

మన శరీరం స్వతహాగానే ఒక ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా లాంటివి ప్రవేశించినప్పుడు, శరీరంలోని వ్యాధి నిరోధక కణాలు వాటితో పోరాడతాయి. శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. తమ చికిత్సను తామే స్వయంగా చేసుకోడానికి ఈ వ్యాధి నిరోధక కణాలు తయారై ఉంటాయి. మందుల కన్నా ప్రకృతి ఎక్కువ శక్తిమంతమైనది. ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలన్న పూర్తి ధ్యాసతో ప్రయత్నిస్తే... దాని ఆధారంగా శరీరం పూర్తి స్థాయిలో పని చెయ్యడం మొదలుపెడుతుంది. శరీరంలోని నాడుల సమూహాన్ని మెదడు మళ్ళీ జాగృతం చేస్తుంది. ప్రకృతి మనకు సంతోషంతో పాటు మంచి ఆలోచనా శక్తిని కూడా ఇచ్చింది. వీటిద్వారా మనం అసాధ్యమైన రోగాలను నయం చేసుకోగలం. ప్రతి పనిలో భగవంతుడు నాకు సహాయం చేస్తున్నాడని భావిస్తే దానికన్నా సంతోషకరమైన విషయం మరేముంటుంది? భగవంతుడు మనకు సాయం చేస్తున్నప్పుడు ఆ ప్రేమలో మనం మునిగిపోవాలి. దీనివల్ల ఆంతరంగికంగా సంతోషం పెరుగుతుంది. మన శరీరంలోని హార్మోన్లు స్పందిస్తాయి. మనకు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. 

కాబట్టి సదా ప్రసన్నంగా ఉండే అభ్యాసం చేసుకోవాలి. ప్రసన్నతను మించిన మందు లేదు. అది మనసులోని ముడులను విప్పుతుంది. ప్రసన్నత అంటే ఆంతరంగికంగా ప్రశాంతంగా ఉండడం. అలా ఉన్నప్పుడు ఇండోర్భిన్‌ అనే గ్రంధి మంచి బాధా నివారిణిగా పని చేస్తుంది. మనం సహజంగా, మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు... శరీరంలో ఆక్సిజన్‌ ప్రవాహం పెరిగి... ముఖ్యమైన అవయవాలన్నీ పరిపూర్ణ శక్తితో పని చెయ్యడం మొదలుపెడతాయి. ‘ఇరవై క్షణాల నవ్వు పది నిమిషాల నౌకా విహారంతో సమానం’ అని ఒక పరిశోధన చెబుతోంది. పసిబిడ్డ రోజుకు 400 సార్లు నవ్వితే, పెద్దలు కేవలం 17 సార్లు మాత్రమే నవ్వుతారట! 


మనం నవ్వినప్పుడు ధ్యాన పూర్వకమైన స్థితిలో ఉంటాం. ఆ సమయంలో ఆలోచనల ప్రక్రియ ఆగిపోతుంది. మనసారా నవ్వే సమయంలో మనసులో మిగతా ఆలోచనల్ని పక్కన పెట్టేస్తాం. నవ్వు సంతోషాన్ని ఆకర్షిస్తుంది. చెడును వెళ్ళగొడుతుంది. అది ఒక అద్భుతమైన చికిత్సగా పని చేస్తుంది. మన మనసులో సర్వ గుణసాగరుడు, నిరాకార జ్యోతిర్బిందువైన పరమాత్ముడి చింతన ఉన్నప్పుడు... ఆ తీయనైన స్మృతి మనల్ని శాంతిగా... సంతోషంగా ఉంచుతుంది. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతునితో మానసిక సహవాసం చేసేవారికి చింతలు, బాధలు దూరంగా వెళ్ళిపోతాయి.

- బ్రహ్మ కుమారీస్‌

9010599266


Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST