Advertisement

ఈ అల్లుడి కుటుంబం అదుర్స్!

Jan 14 2021 @ 01:02AM

‘‘అల్లుడు శీను’ సినిమా సమయంలో ఫైట్స్‌ కోసం తాళ్లు కడితే ఒళ్లంతా ఎర్రగా అయిపోయింది..’’ అని అమ్మ పద్మావతి చెబుతుంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కళ్లలో నీళ్లు ఆపుకోలేక బయటకు వెళ్లిపోయారు. ‘‘మా అన్నయ్యను నేనే ఎక్కువ ఇరిటేట్‌ చేస్తా..’’ అని తమ్ముడు గణేశ్‌ అంటే ... ‘నేను వాడి వెల్‌విషర్‌ కదా.. ఏం చేసినా పర్వాలేదు..’’ అంటారు సాయి శ్రీనివాస్‌. బెల్లంకొండ సురేష్‌ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు నలుగురినీ కూర్చోబెడితే గంటల కొద్ది మాటలు దొర్లిపోతూ ఉంటాయి. ఆ మాటల్లో ఒకరంటే మరొకరికి ఉన్న ఆప్యాయత బయటపడుతూ ఉంటుంది. అలా నలుగురు కూర్చుని మాట్లాడుకోవటానికి సంక్రాంతి కన్నా మంచి సందర్భం ఏముంటుంది.. అందుకే ‘నవ్య’ ఈ కుటుంబాన్ని పలకరించింది.. 


మీ ఇంట్లో సంక్రాంతి ముందే వచ్చేసినట్లుంది.. 

సురేశ్‌: మా ఇంట్లో ఎప్పుడూ అంతా కలిసే ఉంటాం. ప్రతిరోజూ తప్పనిసరిగా మేం నలుగురం కూర్చొని కనీసం ఓ గంటైనా మాట్లాడుకొంటాం. ఇక సంక్రాంతి రోజైతే మేము, మా బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతాం. సొంతూరికి వెళ్లం. ఇక ఏదైనా సినిమా రిలీజ్‌ అయితే పండగే పండగ.. ఉదయాన్నే సినిమా చూసి.. హోటల్‌లో భోజనం చేసి .. అలా గడిచిపోతుంది. 

పద్మావతి: మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మా వాళ్లింటికి వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు ధనుర్మాసం పూజలు, రంగనాథుడి కల్యాణం.. ఇలా సంక్రాంతి ఇక్కడే గడిచిపోతుంది. 

సాయిశ్రీనివాస్‌: సంక్రాంతి అంటే పాత క్రికెట్‌ బ్యాట్లు.. ఫర్నిచర్‌ గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు వీటన్నింటిని కలెక్ట్‌ చేసి భోగి మంటలు వేసేవాళ్లం. పతంగులు ఎగరేయటం.. ఫ్రెండ్స్‌ ఇళ్లకు వెళ్లటం.. ఇలా చాలా ఉత్సాహంగా గడిచిపోయేది.. 

పద్మావతి: ఈ సారి పండగ మరింత స్పెషల్‌. సాయి సినిమా విడుదలవుతోంది. ఇక సినిమా ఫలితమంటారా.. ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఈ సినిమా తప్పనిసరిగా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. 


మీ అబ్బాయిలను హీరో చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? 

సురేశ్‌: సాయి ఐదోతరగతిలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి- ‘డాడీ... టీచర్స్‌, ఫ్రెండ్స్‌ అందరూ మీ నాన్న ప్రొడ్యూసర్‌ కదా... నువ్వు హీరో అవుతావు అంటున్నారు. అవ్వచ్చా డాడీ’ అని అడిగాడు. అప్పట్లో నాకు నా పిల్లలు హీరోలు కావటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అప్పటికే నేను కొన్ని సినిమాలు తీసా. ఒక నిర్మాతగా సినీ జీవితం ఎలా ఉంటుందో.. అందులోని ఎత్తుపల్లాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అందుకే పిల్లలను అమెరికా పంపి బాగా చదివించి సెటిల్‌ చేయాలనుకున్నా. అందుకే సాయి అడిగినప్పుడు- ‘సినిమా అనేది చాలా కష్టం. ఒకవేళ రావాలనుకొంటే చదువుకొంటూనే నటనలో శిక్షణ తీసుకోవాలి. ఆరోజుకారోజు వెళ్లి హీరో కావాలంటే అవ్వలేం.


కనుక మీరు కష్టపడితే మీకు భవిష్యత్‌ ఉంటుంది’ అని చెప్పాను. ‘నేను కష్టపడతాను డాడీ’ అన్నాడు. మంచి రోజు చూసి గేయ రచయిత చంద్రబోస్‌ గారి భార్య సుచిత్రా చంద్రబోస్‌ గారి దగ్గరకు తీసుకువెళ్లి డ్యాన్స్‌ నేర్చుకోమన్నాను. అన్నయ్య ఒక్కడే ఎందుకు... నువ్వు కూడా వెళ్లని గణేశ్‌ను కూడా చేర్పించా. ఆ తర్వాత డ్యాన్స్‌లో, నటనలో శిక్షణలో ఇప్పించాం. ఇద్దరూ కష్టంగా కాకుండా ఇష్టంగా... ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఇద్దరూ హీరోలు అయినందుకు చాలా గర్వంగా ఉంది. 


హీరో అంటే డ్యాన్సులు, ఫైట్లు చేయాలి.. మీ అబ్బాయి ఫైట్లు చేస్తుంటే భయమేయదా?

పద్మావతి: రోప్‌లు శరీరానికి కట్టేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వళ్లంతా ఎర్రగా అయిపోతుంది. సాయిని అలా చూస్తుంటే ఏడుపోస్తుంది. ‘అల్లుడు శ్రీను’ సినిమాలో ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. అది చూసి ఏడ్చేసా.. ఆ తర్వాత అలాంటి సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు ఇంట్లో చెప్పడు..


మీ ఇద్దరిలో ఎవరు అమ్మ బాబు.. ఎవరు నాన్న బాబు..

పద్మావతి: మాకిద్దరూ ఒకటే.. అయితే గణేష్‌ మాత్రం నా వెనకే తిరుగుతూ ఉంటాడు. కబుర్లు చెబుతూ ఉంటాడు. సాయి వాళ్ల నాన్న పోలిక. 

సురేశ్‌: ఇద్దరూ నాకు దగ్గరే.. కానీ సాయితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటా. మాకు వీళ్లిద్దరు తప్ప వేరే ప్రపంచమే లేదు..

పద్మావతి: సాయి అన్నీ మనసులో పెట్టుకుంటాడు. పైకి కనిపించనివ్వడు. గణేష్‌ నాకు అమ్మాయిలేని లోటు తీరుస్తాడు. నాకు చీరలు కూడా సెలక్ట్‌ చేస్తాడు. కానీ పెద్దవాడిని వదిలి ఉండలేను. మొదట్లో వాడు అమెరికాకు వెళ్లినప్పుడు మూడు రోజుల కన్నా ఉండలేకపోయాడు. వాడి ఏడుపు చూసి నేను భరించలేకపోయా! నేను అమెరికా వెళ్లా! 


సాయి.. మీరు హీరో కాకపోతే ఏమయి ఉండేవారు?

సాయి: నేను ఊహించలేను. యాక్టింగ్‌ నాకు మంచి కిక్‌ ఇస్తుంది. ఇలాంటి అనుభూతి మరే రంగంలోని వారికీ దొరకదనుకొంటా. మా స్నేహితులను చాలామందిని చూశా. గత ఇరవై ఏళ్లుగా వాళ్లు ఒకటే ఆఫీ్‌సకు వెళుతున్నారు. అదే స్టాఫ్‌... అదే కార్యాలయం. కానీ సినిమాలో అలా కాదు కదా! ఎప్పటికప్పుడు కొత్త మనుషులు... కొత్త ప్రదేశాలు! నాకు ఎప్పుడూ జనంతో ఉండడమన్నా, వారితో కలిసి ప్రయాణించడమన్నా ఎంతో ఇష్టం. 


అన్నదమ్ముల మధ్య గొడవలు మాములే కదా.. మీ ఇద్దరూ కొట్టుకుంటారా?

సాయి: ఎప్పుడూ కొట్టుకొంటూనే ఉంటాం. నాకు అన్నీ కొత్తవి ఇష్టం. వాడు కొత్తగా ఏ డ్రెస్‌ తెచ్చుకున్నా ఫస్ట్‌ అది నేను వేసేసుకోవాలి! నాకు కొత్తగా ఉండడమంటే ఇష్టం. దాంతో గొడవ మొదలవుతుంది. 

గణేశ్‌: అన్నదమ్ములన్నాక ప్రతి ఇంట్లో అది సాధారణమే కదా! ఫస్ట్‌ నేనే బాగా ఇరిటేట్‌ చేస్తా. అన్నయ్యనే కాదు... ఇంట్లో అందరికీ బాగా చికాకు పుట్టిస్తా. అంటే వాళ్లు చెప్పింది నేను చెయ్యనంతే. నాకు నచ్చింది నేను చేసుకుపోతుంటా. దానికి సాధారణంగానే ఎవరికైనా ఇరిటేషన్‌ వస్తుంది కదా! అన్నయ్య నా బట్టలన్నీ వేసేసుకుంటాడు.. అదే నా కంప్లైంట్‌.. 


అన్నయ్యగా తమ్ముడిపై బాసిజమ్‌ చేస్తూ ఉంటారా?

సాయి: అలా ఏమీ ఉండదు. వాడు హ్యాపీగా ఉన్నాడనుకోండి... నేను ఇంకా హ్యాపీగా ఉంటా. ఏదిఏమైనా చివరకు అంతా ఒకటే కుటుంబం కదా! 


సినిమా అనుకున్న ఫలితం రాకపోతే ఎలా అనిపిస్తుంది? 

సాయి: ఆ ఒక్క రోజు బాగా బాధగా ఉంటుంది. ఆ తరువాత రోజు నుంచి నార్మల్‌ అయిపోతాను. 

సురేశ్‌: కొన్ని సినిమాలు-  కథ వినేటప్పుడు బాగుంటాయి. కానీ ఎగ్జిక్యూషన్‌ బాగుండదు. దెబ్బతింటాం. అప్పుడు నిరాశగా అనిపిస్తుంది.  


‘‘మా అమ్మ ఎక్కువగా పూజలు చేస్తుంది. మా ఫ్రెండ్స్‌ అందరూ మీ అమ్మ అదృష్టమే మీకు వచ్చింది అంటూ ఉంటారు. మా ఇంట్లో పూజలు చేయటానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండాల్సిన అవసరమే లేదు. మా అమ్మకే అన్నీ వచ్చు..’’

సాయిశ్రీనివాస్‌


‘‘మా అమ్మ వంట ఎంత గొప్పగా చేస్తుందంటే- ఇప్పటి దాకా అలాంటి వంట ఎక్కడా తినలేదు. ఎక్కడికి వెళ్లినా- అమ్మ వంటే తినాలనిపిస్తుంది’’

గణేశ్‌


సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి.. . సామాన్యుడు, సంపన్నుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూస్తారు. తెలుగునాట టీవీ లేని ఇల్లు... అందులో సినిమా చూడనివారు ఉండదు. అన్ని హంగులతో మల్టీప్లక్స్‌లు వచ్చాక థియేటర్స్‌కు వచ్చేవారూ పెరిగారు. ఈ కొత్త సంవత్సరంలో అన్ని సినిమాలు హిట్‌ అవుతున్నాయి.. సినీ రంగానికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే!

సురేశ్‌


1988లో ఉద్యోగం చేయటానికి అమెరికా వెళ్లా. అక్కడే స్థిరపడాలనేది నా కోరిక. వారంలో తిరిగి వచ్చేసా. రెండో సారి ప్రయత్నించా. కానీ ‘‘అక్కడ ఉండలేక వచ్చేసా. అప్పటి నుంచి సినిమానే నా జీవితం. 

సురేశ్‌


మంచి కంటెంట్‌ ఉంటే ఎలాంటి సినిమా చేయడానికైనా నేను సిద్ధం. నేను చాలా డిసిప్లేన్‌తో ఉంటా. ఉదయం 7.30కి షూటింగ్‌కి వెళ్లిపోతా. సాయంత్రం ఇంటికి వస్తా. ఇల్లు.. షూటింగ్‌ తప్ప నాకు వేరే ప్రపంచమే తెలియదు.

సాయి

 

2021 చాలా మంచి సంవత్సరం. సాయిది ‘అల్లుడు అదుర్స్‌’ సూపర్‌హిట్‌ కావాలి. వాడు హిందీలో చేస్తున్న ‘ఛత్రపతి’ కూడా పెద్ద సంచలనం కావాలి. గణేష్‌ హీరోగా చేస్తున్న చిత్రం కూడా విడుదలవబోతోంది. అది కూడా పెద్ద హిట్‌ కావాలి.. ఒక తల్లిగా అంత కన్నా పెద్ద కోరికలేమి లేవు.

పద్మావతి


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.