Ben Stokes Vs Harsha Bhogle: హర్షా భోగ్లేకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బెన్‌స్టోక్స్!

ABN , First Publish Date - 2022-10-01T23:20:28+05:30 IST

టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తిశర్మ-ఇంగ్లండ్ క్రికెటర్ షార్లెట్ డీన్ రనౌట్ వివాదంపై ఇంగ్లిష్ మీడియాను ఉద్దేశించి

Ben Stokes Vs Harsha Bhogle: హర్షా భోగ్లేకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బెన్‌స్టోక్స్!

లండన్: టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తిశర్మ-ఇంగ్లండ్ క్రికెటర్ షార్లెట్ డీన్ రనౌట్ వివాదంపై ఇంగ్లిష్ మీడియాను ఉద్దేశించి కామెంటేటర్ హర్షాభోగ్లే(Harsha Bhogle) చేసిన ట్వీట్లపై ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇటీవల లార్డ్స్‌లో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్ షార్లెట్ డీన్‌ను దీప్తి మన్కడింగ్ ద్వారా అవుట్ చేసింది. ఈ అవుట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఇంగ్లిష్ మీడియాతోపాటు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కూడా దీప్తిపై విమర్శల వర్షం కురిపించారు. ఆమె అలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. 


మన్కడింగ్‌పై కథనాలు ప్రచురిస్తూ దీప్తిశర్మను విలన్‌లా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ కథనాలపై తీవ్రంగా విరుచుకుపడుతూ హర్షాభోగ్లే(Harsha Bhogle) వరుస ట్వీట్లు చేశాడు. బ్రిటిష్ మీడియా అత్యుత్సాహాన్ని, దీప్తిని విలన్‌గా చూపించాలన్న సంకుచిత సంస్కృతిని హర్ష(Harsha Bhogle) తూర్పారబట్టాడు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ మీడియాలో ఓ సెక్షన్ క్రికెట్ చట్టాలకు అనుగుణంగా ఆడిన అమ్మాయిని ప్రశ్నించడం తనను కలవరపాటుకు గురిచేసిందని హర్ష(Harsha Bhogle) తన ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశాడు. చట్టవిరుద్ధమైన ప్రయోజనాలు పొందిన వారిని మాత్రం ఎవరూ ప్రశ్నించలేకపోయారని విరుచుకుపడ్డాడు. మీడియాలో సహేతుకమైన వ్యక్తులు ఉన్నారని భావిస్తున్నానన్న భోగ్లే(Harsha Bhogle).. ఇంగ్లండ్‌కు ఏది తప్పుగా అనిపిస్తే మిగతా క్రికెట్ ప్రపంచానికి కూడా అది తప్పుగా అనిపించాలని కోరుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వలస ఆధిపత్యం చాలా శక్తిమంతమైనదని,  కొంతమంది దానిని ప్రశ్నించారని అన్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ తప్పుగా భావించే దానిని క్రికెట్ ప్రపంచం మొత్తం తప్పుగా భావించాలనే మనస్తత్వం ఇప్పటికీ దీనికి ఉందని విమర్శించాడు. ఇంగ్లండ్ ఆలోచించినట్టుగా అందరూ ఆలోచించాల్సిన పనిలేదని తేల్చిచెప్పాడు. ఈ ధోరణి మారాలంటూ కడిగిపారేశాడు.


నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్లను రనౌట్ చేయడాన్ని ప్రపంచం ఇష్టపడకూడదని ఇంగ్లండ్ కోరుకుంటోందని హర్షాభోగ్లే(Harsha Bhogle) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బౌలర్ చేయి ఎత్తులో ఉండే వరకు నాన్ స్ట్రైకర్ తప్పనిసరిగా క్రీజులో వెనక ఉండాలని క్రికెట్ చట్టం చెబుతోందని అన్నాడు. దానిని పాటిస్తే ఆట సాఫీగా సాగుతుందని పేర్కొన్నాడు. దేశంలోని చట్టాన్ని న్యాయమూర్తులు అమలు చేసినట్టే క్రికెట్‌లోనూ ఉంటుందన్నాడు. ఇంగ్లండ్ మీడియా దీప్తిని విలన్‌లా చూడడం తనను కలవరపెడుతూనే ఉందని విచారం వ్యక్తం చేశాడు. ఆమె క్రికెట్ చట్టాల ప్రకారమే ఆడిందని, కాబట్టి ఈ విమర్శలకు చెక్ పెట్టాలని సూచించాడు. 


హర్షా భోగ్లే ట్వీట్ల(Harsha Bhogle)పై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) అంతే ఘాటుగా స్పందించాడు. మన్కడింగ్‌పై ప్రజల అభిప్రాయంలోకి సంస్కృతిని తీసుకురావడం ఎందుకని ప్రశ్నించాడు. 2019 ప్రపంచకప్ ఫైనల్ ముగిసి రెండేళ్లు అయిందని, తనను తిడుతూ ఇండియా ఫ్యాన్స్ ఇప్పటికీ లెక్కలేనని మెసేజ్‌లు చేస్తున్నారని, దీనిపై నువ్వేమంటావని హర్ష(Harsha Bhogle)ను ప్రశ్నించాడు. దీనికి హర్ష(Harsha Bhogle) రిప్లై ఇస్తూ అక్కడ ఓవర్‌త్రోలో నీ తప్పు ఏమీ లేదని, ఆ విషయంలో నీకు మద్దతుగానే ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే, దీప్తిశర్మపై ఇంగ్లండ్‌లో వచ్చిన వార్తలపైనే తాను స్పందించానని చెప్పాడు. క్రికెట్ గురించి నీకు ఏం నేర్పించారో అదే కల్చర్ అని, అందుకే అలా అన్నానని హర్ష వివరణ ఇచ్చాడు. 

Updated Date - 2022-10-01T23:20:28+05:30 IST