భళా ‘బెండపూడి’.. అసలు కథ ఇదండీ!

ABN , First Publish Date - 2022-05-20T17:56:21+05:30 IST

2015లో టీడీపీ ప్రభుత్వం ‘సక్సెస్‌ స్కూల్స్‌’ విధానం తీసుకొచ్చింది. బెండపూడి హైస్కూలును అప్పుడే సక్సెస్‌ స్కూలుగా గుర్తించింది. తెలుగు మీడియంతోపాటు సమాంతరంగా ఇక్కడ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టింది. కాలక్రమేణా ఇక్కడ ఇంగ్లిషు బోధనలో బెండపూడి స్కూలు ‘బెస్ట్‌’ అనిపించుకుంది....

భళా ‘బెండపూడి’.. అసలు కథ ఇదండీ!

ఏడేళ్ల కిందటే ‘సక్సెస్‌’ స్కూల్‌గా గుర్తింపు

నాటి నుంచే ఆంగ్ల మాధ్యమంలో దిట్ట

స్థానిక ఎన్‌ఆర్‌ఐ ద్వారా మరింత మెరుగు

అమెరికా విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ముచ్చట

సీఎం వద్దకు బెండపూడి బడి పిల్లలు

ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ప్రశంసలు


(కాకినాడ - ఆంధ్రజ్యోతి): 

‘హై... దిస్‌ ఈజ్‌ రిష్మ ఫ్రం టెన్త్‌ క్లాస్‌ జడ్పీహెచ్‌ఎస్‌, బెండపూడి’... 

చక్కటి ఇంగ్లిష్‌, అచ్చం అమెరికన్‌ ఇంగ్లిష్‌(American English) తరహా ఉచ్ఛారణ (యాక్సెంట్‌)! అందులోనూ... ఒక ప్రభుత్వ పాఠశాల(Public school) విద్యార్థుల నోట! ఈ ఆంగ్లం అద్భుతమే కదా! కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి హైస్కూల్‌ విద్యార్థులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. గురువారం ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇంగ్లిషులో దడదడా మాట్లాడేసి... శభాష్‌ అనిపించుకున్నారు. ఇక్కటిదాకా అంతా బాగుంది! కానీ... ప్రభుత్వ పాఠశాలల్లో జగన్‌ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన తర్వాతే బెండపూడి బడి పిల్లలు  ఇలా ఇంగ్లిషులో మాట్లాడటం మొదలుపెట్టారని వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకోవడంపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.


ఏడేళ్ల కిందటే నాంది... 

2015లో టీడీపీ ప్రభుత్వం ‘సక్సెస్‌ స్కూల్స్‌’ విధానం తీసుకొచ్చింది. బెండపూడి హైస్కూలును అప్పుడే సక్సెస్‌ స్కూలుగా గుర్తించింది. తెలుగు మీడియంతోపాటు సమాంతరంగా ఇక్కడ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టింది. కాలక్రమేణా ఇక్కడ ఇంగ్లిషు బోధనలో బెండపూడి స్కూలు ‘బెస్ట్‌’ అనిపించుకుంది. ఇక... ఈ బడి పిల్లలు అమెరికన్‌ యాక్సెంట్‌లో శభాష్‌ అనిపించుకోవడానికి మరో ప్రత్యేక కారణముంది. తొండంగి మండలానికి చెందిన ఒక వ్యక్తి కొన్నేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు.


ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతంపై మక్కువతో... మండలంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు తన ట్రస్ట్‌ పేరుతో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. బెండపూడి ఉన్నత పాఠశాలకు ట్రస్టు నిర్వాహకులు పలుసార్లు వచ్చారు. ఈ హైస్కూల్లోని కొందరు చురుకైన విద్యార్థులతో అమెరికాలో ఉన్న ట్రస్టు నిర్వాహకులు ఎంపిక చేసిన వారితో అమెరికన్‌ ఇంగ్లిషులో ఆన్‌లైన్‌లో తరచూ మాట్లాడించేవారు. ఇలా అచ్చెరువొందించే ఉచ్ఛారణను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈ విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యం టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇంకేముంది... ‘ఇదంతా జగనన్న ఇంగ్లిష్‌ మీడియం చదువుల పుణ్యమే’ అంటూ వైసీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. 


ఆ ఐదుగురు విద్యార్థులు...

ఇంగ్లిషు చదువులతో బాగా పేరు తెచ్చుకున్న బెండపూడి బడిలోకి ప్రైవేటు స్కూలు పిల్లలు చేరడం ఐదేళ్ల కిందటే మొదలైంది. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను కలిసిన ఐదుగురు విద్యార్థులూ అంతకుముందు ప్రైవేటు కాన్వెంట్లలో చదువుకున్న వారే. ఇద్దరు అమ్మాయిలు ఐదో తరగతి వరకు కాన్వెంట్‌లో చదువుకుని... ఐదేళ్ల కిందట బెండపూడి బడిలో చేరారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇంకో విద్యార్థి నాలుగేళ్ల కిందట ప్రైవేటు స్కూలు నుంచి బెండపూడి హైస్కూల్‌లో చేరాడు. మరొకరు గత ఏడాదే ఈ స్కూలులో చేరారు. ఒక విద్యార్థిని ఈ సంవత్సరం బెండపూడి బడిలో ఎనిమిదో తరగతిలో చేరింది.


బెండపూడి విద్యార్థులకు సీఎం అభినందన

అమరావతి, (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు బెండపూడి బడి పిల్లలను తీసుకొచ్చారు. చక్కటి ఇంగ్లిషులో వారు తమను తాము పరిచయం చేసుకుని... జగన్‌తో ముచ్చటించారు. వారిని  సీఎం అభినందించారు. బెండపూడి పాఠశాల ఇంగ్లిష్‌ టీచర్‌ ప్రసాద్‌ బోధనా విధానాన్ని ‘ఎస్‌వోపీ’గా రూపొందించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా విధానం ప్రవేశపెట్టాలని జగన్‌ సూచించారు. ఈనెల 20న గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ను ఆవిష్కరిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఇది ఇంగ్లిష్‌ బోధనకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి టీచర్‌ మొబైల్‌లో ఈ యాప్‌ ఉండాలని సీఎం పేర్కొన్నారు.


నెలరోజుల్లో రెండో దశ ‘నాడు నేడు’

నెలరోజుల్లో రెండో దశ ‘నాడు నేడు’ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 23,975 పాఠశాలల్లో రెండో దశ పనులు జరుగుతాయన్నారు. టీఎంఎఫ్‌, ఎస్‌ఎంఎఫ్‌, గోరుముద్ద పథకాలపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్‌ కాలేజీలు ఉండేవని, ఇప్పుడు ఏకంగా 1200 జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ లేదా కేజీబీవీ లేదా హైస్కూల్‌ ఏర్పాటుచేస్తున్నామన్నారు. విద్యా కానుక కిట్‌ నాణ్యతలో రాజీపడొద్దని స్పష్టంచేశారు. జూలై 4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 8.21 లక్షల మంది విద్యార్థులు అమ్మఒడికి బదులుగా ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ ఎంచుకున్నారని తెలిపారు. ఈ సమీక్షలో విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, అధికారులు రాజశేఖర్‌, సురేష్‌కుమార్‌, వెట్రిసెల్వి పాల్గొన్నారు.



Updated Date - 2022-05-20T17:56:21+05:30 IST