లబ్ధిదారుల ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-09-19T04:28:40+05:30 IST

పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఒకింత ఆర్థిక సహాయం అందించే ఆశయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పడం లేదు.

లబ్ధిదారుల ఎదురుచూపు
లోగో

 ‘కల్యాణలక్ష్మి’, షాదీముబారక్‌’లకు నిధుల గండం
- జిల్లాలో 2,053 మంది నిరీక్షణ

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 18: పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఒకింత ఆర్థిక సహాయం అందించే ఆశయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పడం లేదు. ఈ సహాయం అందితే పెళ్లికి చేసిన అప్పులను చెల్లిస్తామని ఆశతో ఎదురుచూస్తున్న కుటుంబాలకు సకాలంలో అందక నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. కల్యాణలక్ష్మి సహాయం పొందడానికి నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలను జతపరిచి గడువులోపే దరఖాస్తు చేసినప్పటికీ సకాలంలో అందడం లేదు. పేదింటి అమ్మాయిల పెళ్లికి   ఆ కుటుంబాలు పడుతున్న అవస్థల నుంచి దూరం చేసేందుకు వధువు కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థికసాయంగా రూ. 1,01,116 అంద జేస్తున్నారు. అయితే ఈ పథకం అమల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. పెళ్లి సమయానికి అందాల్సిన సొమ్ము పెళ్లయిన తర్వాత నెలలు గడుస్తున్నా అందడంలేదు.


దరఖాస్తులు 2,792..
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద 2,792 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 739మందికి ఆర్థిక సహాయం అందింది. ఇంకా 2,053మందికి చెక్కులు రావాల్సి ఉంది. ఆసి ఫాబాద్‌ డివిజన్‌లో 1,428మందికి గాను 337మందికి, కాగజ్‌నగర్‌ డివిజ న్‌లో 1,364మందికి గాను 402మందికి ఆర్థిక సహాయం అందింది.

వివాహం జరిగిన రోజే..
వివాహం జరిగిన రోజే ఆర్థిక సహాయం చెక్కును పెళ్లికూతురు కుటుంబానికి అందజేయాలని కల్యాణలక్ష్మి పథకం ప్రారంభం వేళ ప్రభుత్వం ప్రకటించింది. తొలి ఏడాది ఆ దిశగా కొంతమేరకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు సకాలంలో జరగకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

నిధుల విడుదలలో జాప్యం..
- సిడాం దత్తు, ఆసిఫాబాద్‌ ఆర్డీవో

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ నిధుల విడుదలలో జాప్యం జరుగు తోంది. మా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ఆయాశాఖలకు నిధులను విడుదల చేస్తాం.

Updated Date - 2021-09-19T04:28:40+05:30 IST