ఆసిఫాబాద్‌లో కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారుల నిరీక్షణ

ABN , First Publish Date - 2022-05-14T04:34:08+05:30 IST

ఆసరా పెన్షన్‌ మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్తగా పెన్షన్‌ మంజూరు చేయలేదు.

ఆసిఫాబాద్‌లో కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారుల నిరీక్షణ

- జిల్లాలో 9415మంది కొత్తగా దరఖాస్తులు 

- ఏళ్లు గడుస్తున్నా మంజూరు కాని వైనం

ఆసిఫాబాద్‌, మే 11: ఆసరా పెన్షన్‌ మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్తగా పెన్షన్‌ మంజూరు చేయలేదు. అంతేగాక 57 సంవత్సరాలు నిండిన అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం హామీని నేటికీ అమలు చేయలేదు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం అసరా పెన్షన్‌లను ఏప్రిల్‌ నుంచి చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ నేటికి అమలుకు నోచుకోలేదు. జిల్లాలో 57సంవత్సరాలు నిండిన 9415మంది పెన్షన్‌ల కోసం దరఖాస్తులు చేసుకు న్నారు. కానీ పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆసరా పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గత ఆగస్టు 31 వరకు 57ఏళ్లు పైబడిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు గడువు పెట్టింది. దీంతో జిల్లాలోని 15 మండలాలకు చెందిన అర్హులందరూ పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ జరిగి సుమారు పది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. నిత్యం కార్యాలయాల చుట్టూ పెన్షన్‌ కోసం తిరుగుతున్నా అధికారులు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడం లేదు. కాగా కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోనే అధికంగా దరఖాస్తులు నమోదు అయ్యాయి.

మండలాల వారిగా దరఖాస్తులు

ఆసరా పథకం కింద జిల్లాలో 57 సంవత్సరాలు పైబడిన  మొత్తం 9415 మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.  వీరిలో ఆసిఫాబాద్‌లో1100, కాగజ్‌నగర్‌లో 2688, సిర్పూర్‌(టి)లో 839, కౌటాలలో 679, చింతలమానేపల్లిలో 439, బెజ్జూరులో 518, పెంచికలపేటలో 92, దహెగాంలో 455 రెబ్బెనలో 646, తిర్యాణిలో 247, కెరమెరిలో 349, వాంకిడిలో 677, సిర్పూర్‌(యూ)లో 163, లింగాపూర్‌లో 90, జైనూరులో 433 మందికి పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం కింద పెన్షన్‌ పొందుతున్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, బీడీ కార్మి కులు, ఒంటరి మహిళలు మొత్తం 46,708మంది ఉన్నారు. కాగా కొత్తపెన్షన్‌ దరఖాస్తుల సంఖ్యతో 56123 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయని అధికారులు పేర్కొంటు న్నారు. 

దరఖాస్తు చేసి ఎనిమిది నెలలు దాటింది

- నాంపెల్లి వేణుగోపాల్‌, సిర్పూరు(టి)

కొత్త పెన్షన్‌ కోసం మీ సేవా ద్వారా దరఖాస్తు చేసి ఎనిమిది నెలలు దాటింది. అయినా పెన్షన్‌ మంజూరు కాలేదు. అధికారులను అడిగితే రేపు, మాపు అంటున్నారు తప్పా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కూలి పని చేసుకొని ప్రస్తుతం కాలం గడుపుతున్నాను. పెన్షన్‌ మంజూరైతే ఆర్థికంగా బాగుంటుంది.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇంకా జారీ కాలేదు

-సీవీఎన్‌ రాజు, కమిషనర్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీ 

ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ల కోసం ఇంకా ఆదేశాలు జారీ కాలేదు. ప్రభుత్వం నుంచి పెన్షన్‌ మంజూరు ఉత్తర్వులు వెలువడగానే లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త పెన్షన్‌దారుల సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి కూడా తీసుకుపోయాం.

Read more