‘మహమ్మదియ ప్రభుత్వమువలన నిండియాకు గలిగిన లాభము’

ABN , First Publish Date - 2022-03-11T09:26:35+05:30 IST

హిందూ మహమ్మదీయ తగాదాలెట్టివో మేమెరుగము. ఏ కారణముల చేతనయిన నేమి ఇప్పుడు భేదములు మాత్రము బుట్టినవి. ఈ రెండు సంఘముల యెక్కయు దేశము యెక్కయు క్షేమము...

‘మహమ్మదియ ప్రభుత్వమువలన నిండియాకు గలిగిన లాభము’

జాతీయ వాద ప్రవక్త బిపిన్ చంద్రపాల్ (1858–1932). 1907లో దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా మద్రాసులో ముస్లింల పాలనలో భారతదేశానికి సమకూరిన ప్రయోజనాల గురించి వివరిస్తూ స్వాతంత్ర్య సాధనకు హిందూ ముస్లింల ఐకమత్య ఆవశ్యకతను ఉద్ఘోషిస్తూ ఆయన వెలువరించిన ఉపన్యాసంలోని కొన్ని భాగాలివి. పాల్ ఉపన్యాసాలను ఆంధ్రీకరించిన వారు సంఘ సంస్కర్త, ‘మాలపల్లి’ నవలా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ.




హిందూ మహమ్మదీయ తగాదాలెట్టివో మేమెరుగము. ఏ కారణముల చేతనయిన నేమి ఇప్పుడు భేదములు మాత్రము బుట్టినవి. ఈ రెండు సంఘముల యెక్కయు దేశము యెక్కయు క్షేమము గోరువారు బాగుగా నాలోచించి యీ భేదభావమును బోగొట్టు సాధనముల యోచించవలసియుండును. మహమ్మదీయులొకప్పుడు పరదేశముల నుండి దండెత్తి వచ్చి మన దేశమును జయించిన వారే యయినను వారిక్కడ వేయి సంవత్సరముల నుండి కాపురముండుట చేత నీ దేశస్తులే అయిరి. హిందువులును మొదట నీదేశము వారు కారు. దూరదేశముల నుండి యిక్కడి యాదిమ జాతులను జయించి తమ నాగరికతను విద్యను దేశమంతటను వ్యాపింపజేసిరి. అటులనే మహమ్మదీయులును ఇతర దేశముల నుండి వచ్చి కొన్ని శతాబ్దములలో దేశము నంతను జయించి యిచ్చట కాపురమున్నారు. యిండియనులనగా నొక్క హిందువులే గారు ఒక్క మహమ్మదీయులును గారు. ఈ దేశములో నున్న అన్ని జాతుల వారును అన్ని మతముల వారున్ను ఇండియనులే. స్వరాజ్యము గూర్చియు ఇండియనుల గూర్చియు నేనుపన్యశించినప్పుడు ప్రత్యేముగా నొక్క జాతిని గూర్చి చెప్పియుండలేదు. ఈ దేశమునకు సంబంధించినట్టియు ఎక్కడ జీవించినను అంత్యమున నీదేశపు సరిహద్దులలొనె యుసురుల విడువ గోరు నట్టియు ఇతర దేశములలో జ్ఞానమును సంగ్రహించి యీ దేశ జ్ఞానమును వృద్ధిచేయనెంచునట్టియు ప్రతి మనుజుని గూర్చి నేజెప్పి యుంటిని. దేశములన్నిటిలోను ఈ దేశమే వారి ప్రేమకాస్పదమయినది. ఈ దేశమే వారి తాతతండ్రులను తన యెడిలో బెంచినది. ఈ దేశములోనే వారి బిడ్డలును మనుమలును వృద్ధి జెంది సుఖ జీవులై పిల్ల పిల్ల తరములుగా జ్ఞానాభివృద్ధిని బొందునది. ఏది యెట్లున్నను హిందూ మహమ్మదీయుల విషయమునే మనము బాగుగ నాలోచించవలసియున్నది. హిందూ మహమ్మదీయు లొండురుల యొక్క సుగుణములును జ్ఞానమును నాగరికతయును జూచి గౌరవించుకొనుట వలననే మనస్పర్థలన్నియు నశింపగలవు. ఈ స్పర్థలును ఇరు సంఘముల యొక్కయు తక్కువ జాతులలో లేవు. గొప్పవారిలో మాత్రమే గన్పట్టుచున్నవి. అదియును కొన్ని చోట్లనే. ఇరు జాతులలోని ప్రముఖులును ఒండొరుల యొక్క జ్ఞానమును నాగరికతయును దెలిసికొనునట్టయితే ఒకరితో నొకరు కలహింపరని నా నమ్మకము. పెద్ద వారికన్యోన్యము కలిగినచో నిదివరకే స్నేహముగా నున్న తక్కిన వారు స్నేహముగా నుందురు. యీ కారణము చేతనే దేశములో మహమ్మదీయులు ప్రభుత్వము చేయనారంభించినది మొదలు ఇండియాకెంత లాభము చేసినదియు మనము తెలిసికొందుము. హిందూ సోదరులారా, మీరు మీ మతమును గూర్చి గర్వపడుచున్నారు గదా. మీ మతములో రెండు ముఖ్యమయిన విషయములున్నది. అవి యోగమును వైరాగ్యమునైయున్నవి. మీ గ్రంథములోను మీ పైగంబరుల యుపదేశములోను మీ మతాచార్యులలోను మీ ఋషులలోను యోగ వైరాగ్యము లెంతవరకు వృద్ధి జెందెనో అంత అభివృద్ధియు మహమ్మదీయులలోను గలదని మీకు దెలియునా? రాజాధిరాజయినను భోగముల మధ్య నున్నను ప్రపంచవిషయముంలందగులని జనక యోగీంద్రుని మీ రెరుగుదురుగదా. మహమ్మదీయ మతస్తాపకుడును పైగంబర శ్రేష్టుడునునగు మహమ్మదువారి యొక్క వైరాగ్యము ప్రపంచమునందితరుల వైరాగ్యమున కంటె ఘనమయినదియు పవిత్రమయినదియు మీరు కనుగొనజాలరు. వారు పరంపదించినప్పుడు వారు విడిచిపోయిన యాస్తి యెంతో మీరెరుగుదరా. ఒక చింపిచాప ఒక సానిక. ఇస్లాము ప్రభువునకుండిన యాస్తిఅంతుయునిదే.

Updated Date - 2022-03-11T09:26:35+05:30 IST