జుంబా.... లాభాలు చాలా...

ABN , First Publish Date - 2020-10-05T05:30:00+05:30 IST

జిమ్‌లు తిరిగి తెరచుకున్నా కూడా కరోనా భయంతో ఎక్కువమంది ఇంటివద్దనే ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిపట్టునే ఉండడం వల్ల ఎక్సర్‌సైజ్‌ చేయడానికి బద్ధకంగా అనిపిస్తుంది...

జుంబా.... లాభాలు చాలా...

జిమ్‌లు తిరిగి తెరచుకున్నా కూడా కరోనా భయంతో ఎక్కువమంది ఇంటివద్దనే ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిపట్టునే ఉండడం వల్ల ఎక్సర్‌సైజ్‌ చేయడానికి బద్ధకంగా అనిపిస్తుంది.  అలాంటి వారు తిరిగి ఫిట్‌నెస్‌ ట్రాక్‌లో పడేందుకు జుంబా వ్యాయాయం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు జుంబా మంచి కార్డియో వర్కవుట్‌ కూడా. ఒక్కసారి జుంబా చేయడం మొదలెట్టారంటే మీ జీవనశైలి పూర్తిగా మారిపోతుంది అంటున్నారు జుంబా ట్రైనర్‌ జెనిఫర్‌ కె. శర్మ.


ఉత్సాహం, శక్తి నిండేందుకు, తాజాగా కనిపించేందుకు జుంబా వ్యాయామం చేయాలి. ఇలా చేయాలి, అలా చేయాలి అనే నియమాలేవి ఈ ఎక్సర్‌సైజ్‌లో ఉండవు. అయితే మందులు వాడేవారు డాక్టర్‌ను, జుంబా ట్రైనర్‌ను ముందుగా సంప్రదించి వారు అనుమతి ఇస్తేనే చేరాలి. దాంతో వారు కొన్ని సూచనలు చేస్తారు. వాటిని పాటిస్తే సరి.

  1. ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే జుంబాను చాలామంది వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. నాలుగు రకాల రిథమ్స్‌.... సల్సా, కంబియా, మెరెంగువా, రిగ్గేటొన్‌ ఉంటాయి. జుంబాతో ప్రతి కండరానికి, గుండెకు, మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది. ఒక్క జుంబా సెషన్‌లో 800క్యాలరీలు కరిగించొచ్చు. దీనిలో లాంజెస్‌, స్క్వాట్స్‌, జంపింగ్‌ జాక్స్‌ వంటివి భాగంగా ఉంటాయి. 
  2. జుంబా శిక్షణలో జుంబా టోనింగ్‌, ఆక్వా జుంబా, జుంబినీ వంటివి ఇంటివద్దనే ట్రైనర్‌ సూచనలతో చేసుకోవచ్చు. జుంబా టోనింగ్‌లో తక్కువ బరువున్న డంబెల్స్‌ను ఎత్తడం వల్ల శరీరం మొత్తం టోన్‌ అవుతుంది. చేతులకు చక్కని వ్యాయామం దొరకుతుంది. ఈతకొలనులో చేసే ఆక్వాజుంబాతో కీళ్ల మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. గర్భిణులకు ఆక్వాజుంబాతో ప్రయోజనం ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న తల్లులకు వ్యాయామం చేయడానికి వీలు చిక్కదు. వారికి జుంబినీ అనువైనది.  
  3. జుంబాలో పిల్లలు చేయగలిగే వర్కవుట్స్‌ కూడా ఉన్నాయి. జుంబా కిడ్స్‌, జుంబా కిడ్స్‌ జూనియర్‌... ఇవి ఏడు నుంచి పదకొండు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు సరిపోతాయి. గెంతడం, డాన్స్‌ చేయడం, బాడీ షేక్‌, కాళ్లను స్వింగ్‌ చేయడం వంటివి వారికి ఎంతో ఫన్‌ ఇస్తాయి. వారికి ఫిట్‌నెస్‌ మీద ఆసక్తి పెంచుతాయి. ఈ వ్యాయామంతో వారిలో నాయకత్వ లక్షణాలు, టీమ్‌వర్క్‌, ఆత్మవిశ్వాసం, స్వీయగౌరవం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమన్వయ పరచడం, సాంస్కృతిక విషయాల పట్ల అవగాహన పెరుగుతాయి. అందుచేత పిల్లలచే రోజుకు అరగంటపైగా జుంబా వ్యాయామం చేయించాలి.


జుంబా వల్ల కలిగే లాభాలలో ఒత్తిడి తగ్గడం ముఖ్యమైనది. క్యాలరీలు ఖర్చవడంతో పాటు రక్తపీడనం చక్కగా ఉండి జీవితం సాఫీగా ఉంటుంది. బరువు తగ్గుతారు. బాడీ బ్యాలెన్సింగ్‌ అలవడుతుంది.  జుంబాతో ఉత్సాహం, ఆలోచన నైపుణ్యం పెరుగుతుంది.

Updated Date - 2020-10-05T05:30:00+05:30 IST