ఊరికి ఉపకారం

ABN , First Publish Date - 2022-01-22T05:23:32+05:30 IST

జన్మనిచ్చిన ఊరికి ఎంతో కొంత చేయాలని భావించిన ఉస్మానియా విశ్రాంత ఆచార్యుడు తనకు మూడు తరాలుగా వస్తున్న వారసత్వ భూమిని గ్రామానికి అందజేసి ఉదారతను చాటుకున్నారు.

ఊరికి ఉపకారం

 మూడెకరాల భూమిని గ్రామావృద్ధికి ఇచ్చిన విశ్రాంత ఆచార్యుడు

మిరుదొడ్డి, జనవరి 21: జన్మనిచ్చిన ఊరికి ఎంతో కొంత చేయాలని భావించిన  ఉస్మానియా విశ్రాంత ఆచార్యుడు తనకు మూడు తరాలుగా వస్తున్న వారసత్వ భూమిని గ్రామానికి అందజేసి ఉదారతను చాటుకున్నారు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ గ్రామానికి చెందిన గోత్రాల నర్సింహులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అతడికి గ్రామంలో దాదాపు రూ.60లక్షల విలువ చేసే మూడెకరాల వారసత్వ భూమి ఉన్నది. ఇప్పటి వరకు కౌలుకు ఇచ్చి సేద్యం చేయించారు. అయితే సేవాభావం కలిగిన  ప్రొఫెసర్‌ గోత్రాల నర్సింహులు తన భూమిని గ్రామాభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుందని భావించారు. శుక్రవారం తన సతీమణి శైలజతో కలిసి కాసులాబాద్‌ గ్రామానికి వచ్చారు. గ్రామస్థుల సమక్షంలో తన వ్యవసాయ భూమిని గ్రామాభివృద్ధికి దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచు బాలరాజ్‌ వారిని సన్మానించారు. గ్రామంలోని అంజనేయ ఆలయంతోపాటు గ్రామాభివృద్ధికి వ్యవసాయ భూమి కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామని గ్రామస్థులు వెల్లడించారు. 


Updated Date - 2022-01-22T05:23:32+05:30 IST