
కోల్‌కతా: మాస్క్ లేకుండా రోడ్డు మీదకు ధైర్యంగా వెళ్లే రోజులు మళ్లీ వస్తున్నాయి. బెంగాల్లో ఈరోజు నుంచి కొవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మహారాష్ట్రలో కూడా కొవిడ్ నిబంధనలకు సెలవు చెప్పనున్నట్లు ఉద్ధవ్ ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్-19 కేసుల తరుగుదల ఒక కారణం కాగా, విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం మరొక కారణం. దీంతో రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కొవిడ్ నిబంధనలను ఎత్తివేస్తున్నాయి. బెంగాల్లో ఇప్పటి వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉన్న నిబంధనలను కూడా పూర్తిగా ఎత్తివేశారు. మాస్క్‌లు ధరించడమైనా, ఇతర కొవిడ్ నియమాలైనా ప్రజలు స్వచ్ఛందంగా పాటించవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొవిడ్-19 నిబంధనల అమలు నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేస్తున్నట్లు మార్చి 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరొన వైరస్‌పై పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలను అమలు చేయడం, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం లాంటి అంశాలను నొక్కి చెబుతూ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి