బెంగాల్ ఒప్పందం

ABN , First Publish Date - 2022-05-20T10:21:24+05:30 IST

బ్రిటిష్ పాలకులు 1919 ఏప్రిల్‌లో పాల్పడిన జలియన్ వాలాబాగ్ దురాగతాలు, దరిమిలా ఇతర అణచివేత చర్యలకు నిరసనగా మహాత్మా గాంధీ 1920 ఆగస్టులో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు.

బెంగాల్ ఒప్పందం

బ్రిటిష్ పాలకులు 1919 ఏప్రిల్‌లో పాల్పడిన జలియన్ వాలాబాగ్ దురాగతాలు, దరిమిలా ఇతర అణచివేత చర్యలకు నిరసనగా మహాత్మా గాంధీ 1920 ఆగస్టులో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ అవార్డులు, బిరుదులు వాపస్ చేయాలని, ప్రభుత్వోద్యోగాల నుంచి వైదొలగాలని, బ్రిటిష్ సరుకులను బాయ్‌కాట్ చేయాలని, స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్‌ నాయకత్వాన సహాయ నిరాకరణోద్యమంలో మహోత్సాహంతో పాల్గొన్నారు.


బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్ తొలుత గాంధీజీ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అయితే మహాత్ముడితో సమావేశమయిన అనంతరం ఆయన తన అభిప్రాయాలను మార్చుకుని ఆ ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చారు. నాడు యాభై వేల రూపాయల నెలసరి ఆదాయాన్నిస్తున్న న్యాయవాద వృత్తిని త్యజించి ఆయన ఉద్యమంలోకి ప్రవేశించారు. అయితే 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరా గ్రామంలో ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడడం అహింసావాద ప్రవక్త గాంధీజీకి తీవ్ర మనస్తాపం కలిగించింది. వెన్వెంటనే సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు. దేశ ప్రజలు అన్ని అంతరాలకు అతీతంగా అపూర్వ సంఘీభావంతో ఉద్యమంలో పాల్గొంటున్న తరుణంలో ఉద్యమాన్ని నిలిపివేయడం పట్ల జైలులో ఉన్న దాస్, మోతీలాల్ నెహ్రూ మొదలైన కాంగ్రెస్ నాయకులు అందరూ తీవ్ర అసంతృప్తి చెందారు.


చట్ట సభలలోకి ప్రవేశించి ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడం ద్వారా సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించాలని దాస్ ప్రతిపాదించారు. మోతీలాల్ ప్రభృతులు ఈ ప్రతిపాదనను బలపరిచారు. అయితే రాజాజీ, రాజేంద్రప్రసాద్ మొదలైన వారు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారు నో ఛేంజర్స్‌గా, ఆమోదించిన వారు ప్రో ఛేంజర్స్‌గా విడివిడి వర్గాలుగా కాంగ్రెస్‌లో పనిచేయసాగారు. ప్రో ఛేంజర్స్ 1923 జనవరి 1న కాంగ్రెస్‌లో అంతర్భాగంగా స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. దాస్ ఈ పార్టీకి అధ్యక్షుడు కాగా మోతీలాల్ కార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికలలో పోటీ చేసి శాసనసభలలో ప్రవేశించడం, ప్రజలకు శ్రేయస్కరం కాని శాసనాలను ప్రతిఘటించి ప్రభుత్వాన్ని స్తంభింపచేయడం స్వరాజ్ పార్టీ ప్రధాన లక్ష్యం. చట్ట సభలలోకి ప్రవేశించేందుకు ముస్లింల మద్దతు తప్పనిసరి. హిందూ–ముస్లింల మధ్య సుదృఢ సహకారానికి ఆయన ఒక ప్రణాళికను రూపొందించారు. ఇదే ‘బెంగాల్ ఒప్పందం’గా సుప్రసిద్ధమయింది. 1923 డిసెంబర్‌లో స్వరాజ్ పార్టీ ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. ‘స్వపరి పాలనకు నిజమైన పునాదులు నిర్మించేందుకు హిందువుల, ముస్లింల హక్కులను పరిరక్షిస్తూ ఇరు వర్గాల మధ్య ఒక ఒప్పందాన్ని కుదర్చడం తప్పనిసరి’ ఆ ఒడంబడిక మున్నుడి పేర్కొంది. బెంగాల్ కాంగ్రెస్ కమిటీ ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. సంప్రదాయ హిందువులు, ముస్లింలు ఈ ఒప్పందం పట్ల నిరసనలు, అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ సామాన్య ప్రజలు దానికి పూర్తి మద్దతునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో స్వరాజ్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులనే అత్యధికంగా గెలిపించారు. కొత్తగా విస్తృతపరిచిన కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో స్వరాజ్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హిందూ– ముస్లింల మధ్య సమైక్యతను మరింత సుదృఢం చేసేందుకు ప్రభుత్వోద్యోగాలలో ముస్లింలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తద్వారా స్వాతంత్ర్య పోరాటానికి ముస్లింల మద్దతును పటిష్ఠపరిచారు. ‘ప్రతి ఒక్కరూ ఇతరులకు అనుకూలంగా త్యాగం చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని’ ఆ సందర్భంగా దాస్ చేసిన ఉద్బోధ బెంగాల్ ప్రజలు శిరసావహించారు. బెంగాల్ ఒడంబడిక స్ఫూర్తితో ఆయన తీసుకున్న వివిధ నిర్ణయాలు మత సామరస్యానికి విశేషంగా దోహదం చేశాయి. 1920వ దశకం తొలి సంవత్సరాలలో బెంగాల్ యేతర రాష్ట్రాలలో హిందూ ముస్లింల ఘర్షణలు తీవ్రమైన తరుణంలో బెంగాల్లో సంపూర్ణ సామరస్యం నెలకొనడం దాస్ రాజనీతిజ్ఞత వల్లే సాధ్యమయింది. ‘బెంగాల్లో మత సమస్యను దాస్ పరిష్కరించిన పద్ధతి చిరస్మరణీయమైనది. ఈనాటికీ కూడా అది మనకు మార్గదర్శకమే’ అని మౌలానా అబుల్ కలాం అజాద్ తన ఆత్మకథలో వ్యాఖ్యానించారు. ‘బెంగాల్ ఒప్పందాన్ని దేశవ్యాప్తంగా అమలుపరిచి ఉన్నట్టయితే దేశ విభజన అవసరమయి ఉండేది కాదని’ ప్రణబ్ ముఖర్జీ తన అంతిమ దినాలలో అభిప్రాయపడడం గమనార్హం.

Updated Date - 2022-05-20T10:21:24+05:30 IST