Partha Chatterjee: రూ.20 కోట్ల నోట్ల కట్టల కేసులో మరో కీలక పరిణామం..

ABN , First Publish Date - 2022-07-24T01:23:40+05:30 IST

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణం విషయమై పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు జరిపింది. బెంగాల్ రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ..

Partha Chatterjee: రూ.20 కోట్ల నోట్ల కట్టల కేసులో మరో కీలక పరిణామం..

కోల్‌కత్తా: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణం విషయమై పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు జరిపింది. బెంగాల్ రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) సహాయకురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో సోదాలు చేసి రూ.20 కోట్ల (20 Crores) నగదును స్వాధీనం చేసుకొంది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో (Teachers Recruitment Scam) బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నాడు అరెస్ట్ చేసి రెండు రోజుల కస్టడీలోకి తీసుకుంది. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ పార్థా ఛటర్జీని 14 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరాలని నిర్ణయించింది. సోమవారం నాడు ఈ బెంగాల్ మంత్రిని PMLA Court లో హాజరుపర్చనున్నారు.



ఈ కేసు గురించి పార్థా ఛటర్జీ తరపు న్యాయవాది సోమ్‌నాథ్ ముఖర్జీ మాట్లాడుతూ.. పార్థా ఛటర్జీ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కోల్‌కత్తాలోని (Kolkata) ఎస్‌ఎస్‌కేఎమ్ హాస్పిటల్‌కు వైద్య చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నక్తాలాలోని ఛటర్జీ నివాసంలో డజన్ల కొద్దీ ఉన్న డాక్యుమెంటన్లు ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కుంభకోణం కేసులో మంత్రితో పాటు ఆయన సహాయకురాలైన అర్పిత ముఖర్జీని కూడా శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కోల్‌కత్తాలోని అర్పిత నివాసంలో లెక్కల్లోకి రాని రూ.20 కోట్ల రూపాయలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఈ నగదును కౌంటింగ్‌ మిషన్ల ద్వారా లెక్కించడానికి బ్యాంకు సిబ్బంది సాయం తీసుకొంది.



ప్రస్తుతం పార్థా ఛటర్జీ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామంపై టీఎంసీ నేతలు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ పార్థా ఛటర్జీ అరెస్ట్‌పై స్పందించారు. ఇవాళ పరిస్థితి ఎలా తయారైందంటే.. ఈడీని బీజేపీ నడుపుతోందన్నట్టుగా ఉందని మంత్రి ఫిర్హాద్ ఆరోపించారు. ఈడీని బీజేపీ రాజకీయంగా ప్రభావితం చేస్తోందని ఫిర్హాద్ హకీమ్ తీవ్ర ఆరోపణ చేశారు. పార్థా ఛటర్జీ అరెస్ట్‌పై ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్ (Sagarika Ghose) స్పందిస్తూ.. భారతదేశం ఇప్పుడు  బీజేపీ పాలిత, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలుగా చీలిపోయినట్లు అనిపిస్తోందని ట్విట్టర్ వేదికగా చురకలు వేశారు. విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంతో హైపర్‌యాక్టివ్‌గా పనిచేస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  అయితే, ఈడీ అసలు ఉన్నట్టు కూడా అనిపించడం లేదని ఆమె వ్యంగ్యాస్త్రం సంధించారు.

Updated Date - 2022-07-24T01:23:40+05:30 IST