బెంగాల్ ఘోరం

Published: Tue, 29 Mar 2022 00:48:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon

బెంగాల్ పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతున్నది. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం కావాలని కలలు కంటున్న నాయకురాలి పాలనలో, ఆ రాష్ట్రం హింసాగ్నిగుండంగా మారిపోతున్నది. వారం రోజుల కింద నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని బిర్భూమ్ హత్యాకాండ కుదిపివేస్తున్నప్పటికీ, ఆ పరిస్థితితో హుందాగా వ్యవహరించే రాజకీయ వాతావరణం బెంగాల్‌లో ఏర్పడలేదు. హత్యాకాండ అంశంపై చర్చించవలసిన ప్రజాప్రతినిధులు సోమవారం నాడు బాహాబాహీ ముష్టియుద్ధానికి దిగారు. పోయిన పది అభాగ్య ప్రాణాల గురించి ఎవరికీ లెక్కలేదు. ఇదే అదనుగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై నాలుగు రాళ్లు రువ్వాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తున్నది. గెలవలేకపోయినప్పటికీ, బలం పెంచుకుని పుంజుకుని ఉన్న ఆ పార్టీ, అధికారపార్టీ మీద ఒంటికాలితో లేస్తున్నది. సహజంగానే, గవర్నర్ తీరు కూడా ప్రతిపక్ష స్వభావంతోనే ఉంటున్నది. ఎటువంటి బెంగాల్ ఇట్లా అయిపోయిందేమిటని, వామపక్ష ఉదారవాద మేధావులు, రచయితలు వాపోతున్నారు. మార్క్సిస్టు పార్టీ పాలించిన కాలంలోనే ఈ హింసా సంస్కృతి మొదలయిందని, దానినే తృణమూల్ కాంగ్రెస్ వారసత్వంగా స్వీకరించిందని చెబుతూ, ఆనాడు ఈ కవులు, కళాకారులు నోరువిప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు పెద్ద మనుషులు తమ సమీక్షలలో చెబుతున్నారు.


ఒక హత్యకు ప్రతీకారంగా పదిహత్యలు. హతులు, హంతకులు అధికారపార్టీ వారే. రెండు ముఠాల మధ్య పంపకాల ఘర్షణ. పార్టీ జిల్లా స్థాయి నాయకుల దగ్గర నుంచి ఎందరో ఈ దుర్మార్గంలో భాగస్వాములుగా ఉన్నారు. హైకోర్టు ఆదేశంతో హత్యాకాండపై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇప్పటికి 22 మంది నిందితులను గుర్తించింది, అందరూ అధికారపార్టీ సభ్యులే. హత్యలు జరిగిన వెంటనే, బుకాయించడానికి, మభ్య పెట్టడానికి మమతా పార్టీ ప్రయత్నించింది. సంఘటనా స్థలాన్ని సందర్శించినా, చర్యలు తీసుకుంటామని చెప్పినా, రాష్ట్రంలో విశ్వాస వాతావరణం ఏర్పడలేదు. హైకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ విచారణకు ఆదేశించడం అంటే, అది రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అభిశంసన వంటిదే కదా? అయినా మమతా బెనర్జీ తన దూకుడు సరళి మీదనే ఆధారపడడం కొనసాగించారు. టిఎంసి సభ్యులు పార్లమెంటులో వ్యవహరించే తీరు కూడా అట్లాగే ఉండింది. ఈ గందరగోళం నడుమ గవర్నర్ బర్తరఫ్ కోసం కేంద్ర హోంమంత్రిని అడగడం అవసరమా? ఈ సందర్భంలో కూడా ప్రశాంత్ కిశోర్ సారథ్యమే పనిచేస్తున్నదేమో తెలియదు.


భారతదేశంలో వలసపాలనకు ముఖద్వారంగా ఉండిన, సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనాలకు తొలిఅడుగులు వేసిన బెంగాల్‌లో రాజకీయ, సామాజిక వాతావరణం ఈ తీరుగా ఉండడం సహజంగానే భారతీయులందరినీ బాధిస్తుంది. మూడున్నర దశాబ్దాల పాటు మార్క్సిస్టుల పాలనలో ఉండి, అక్కడ ఏమి మార్పు వచ్చింది? వారు కూడా గ్రామీణ బెంగాల్‌లో తమ ఆధిపత్యం కోసం హింసాదౌర్జన్యాల మీదనే ఆధారపడడం ఎంత అన్యాయం? 2000 సంవత్సరంలో ఇదే బీర్భూమ్‌లో 20 మంది వ్యవసాయ కూలీల ఊచకోత జరిగింది. 2008 పంచాయతి ఎన్నికలలో రాజకీయ హింసకు 20 మంది బలిఅయ్యారు. ఈ సంఘటనలన్నిటిలో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు కూడా ఒక పక్షంగా ఉన్నారని వేరే చెప్పనక్కరలేదు. ఒకపక్కన మార్క్సిస్టుల పాలనలో కార్మికసంఘాల ప్రాబల్యం పెరిగి, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ప్రవేశం లేకుండా అయిందని, అందుకనే, ఆర్థికంగా పారిశ్రామికంగా ఆ రాష్ట్రం అంతగా వెనుకబడిపోయిందని కమ్యూనిస్టు వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. అదే గనుక నిజమైతే, పరిపాలనకు లభించిన అవకాశాన్ని మార్క్సిస్టులు సద్వినియోగం చేసుకోనట్టే. పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు జరిగిన సందర్భాలలో, రైతాంగం నుంచి వచ్చిన ప్రతిఘటనను కూడా అర్థం చేసుకోలేక, దానితో సవ్యంగా వ్యవహరించలేక ప్రజావ్యతిరేకతను ఆ ప్రభుత్వం మూటగట్టుకున్నది. చివరకు, కమ్యూనిస్టులు బలంగా ప్రభావం వేస్తారని పేరున్న సాంస్కృతిక రంగంలో కూడా బలహీనపడిపోయి, మతతత్వ ధోరణుల ప్రాబల్యం పెరిగే పరిస్థితి వచ్చింది. ఒకనాడు మార్క్సిస్టు పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నదో ఇప్పుడు అదే స్థితిలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. మార్క్సిస్టు పార్టీ అనుభవమే తృణమూల్‌కు కూడా త్వరలోనే ఎదురుకాకతప్పదు.


ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలనుకునే రాజకీయవాదికి, అందుకు తగ్గ లక్షణాలుండాలి. ప్రజాస్వామిక స్వభావముండాలి. నలుగురిని కలుపుకునిపోవాలి. విమర్శలను పరిగణనలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. పోయిన నెలలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త అనీస్ ఖాన్ అనుమానాస్పద మృతికి కారణం పోలీసులే అని లోకమంతా నమ్ముతున్నది. 1970ల మొదట్లో, నక్సలైట్ల ఉధృత కాలంలో, జరిగినట్లుగా, ఇండ్ల మీదకు అనుమానాస్పద వ్యక్తులు, కొందరు పోలీసులు కలసికట్టుగా దాడులు చేసి మనుషులను చంపినట్టుగా, అనీస్ ఖాన్ హత్య జరిగింది. ఈ ధోరణి తప్పు అని మమతకు, ఆమె పార్టీకి ఎవరు చెప్పగలరు?

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.