బెంగాల్‌ నీలి ఆకాశపు అంచుల్లో...

ABN , First Publish Date - 2020-10-19T06:24:07+05:30 IST

జగతిలోని సకల జీవ శబ్దాల్లో పల్చబడి మౌనంలోకి వొదిగిపోయాక మృత్యు వస్త్రాన్ని సైతం నిలువెల్లా కప్పేసాక కడసారి వీడ్కోలులా...

బెంగాల్‌ నీలి ఆకాశపు అంచుల్లో...

జీబనానంద దాస్‌ మరణించిన తర్వాత వొక ఎక్సర్‌సైజ్‌ నోట్‌ బుక్‌లో ఆయన రాసుకున్న 62 కవితల్ని గుర్తించి ‘రూపసీ బంగ్లా’గా ప్రచురించిన కవితా సంకలనం గొప్ప సంచలనం కలిగించింది. యీ కవితలన్నింటినీ ఆయన మరణించినడానికి 20 యేళ్ళ ముందే అంటే 1934లో రాసినట్లు గుర్తించారు. యీ సంకలనంలోని కవితలు వస్తురీత్యా, ఆధునిక పద సౌందర్యం దృష్ట్యా ఆయన ఆ తర్వాత రాసిన కవితలన్నింటి కన్నా మేలైనవిగా ప్రసంశలందుకున్నాయి. 


‘‘జగతిలోని సకల జీవ శబ్దాల్లో

పల్చబడి మౌనంలోకి వొదిగిపోయాక 

మృత్యు వస్త్రాన్ని సైతం

నిలువెల్లా కప్పేసాక

కడసారి వీడ్కోలులా

గుండెను తడుతూ అడిగింది ‘గుర్తుపట్టావా నన్ను’

అడిగాను చివరి శ్వాసతో... ‘బనలతా సేన్‌వా?’ 

                                జీబనానంద్‌ దాస్‌ 


యీ కవిని చదువుకొన్న క్షణంలో ఆ పద సౌందర్యంలో మునగంగానే అర్ధరాత్రి కలకత్తా వీధుల నిశ్శబ్దంలోనో... బాబీలోనియా వీధుల చెమ్మలోనో... బింబి సారుడు వేసి వెళ్ళిన బాటలోనో తచ్చాడుతోన్న అనుభూతి వుక్కిరిబిక్కిరి చేసేసింది. బెంగాల్‌ వీధుల్లో నన్ను నేను కోల్పోయి అశాంతితో వొక అన్వేషిలా తిరుగాడిన రోజుల నుంచీ యీ కవిత్వాన్ని పలవరిస్తూ కలవరిస్తూ పిచ్చికగూళ్లల్లాంటి కళ్ళున్న బనలతా సేన్‌ని వెతికి పట్టుకొని ఆలింగనం చేసుకొని ఆపాదించుకోవాలనే వెర్రితపనేదో కుదిపేసింది. ఆ దిరిసెన చెట్ల అడివిలానో పొగమంచు నదిలానో యీ కవిత్వంలో నన్ను నేను వెదుకొన్న క్షణాల నుంచీ యీ కవిత్వాన్ని అనువదించి తెలుగు పాఠకుల ముందుకి వో కవితా సంకలనంగా తీసుకురాబోతున్న యీ సమ యంలో, జిబనానంద్‌ దాస్‌ గారి వర్ధంతి సంధర్భంగా వారి కవిత్వం గురించి పంచుకోవాలనిపించింది.


బెంగాలీ సాహిత్యంలో రవీంద్రని తర్వాత.. వారు వేసిపోయిన మార్గాన్ని మరింత ప్రతిభావంతంగా యెత్తిపట్టిన కవి జీబనానంద్‌ దాస్‌ (1899 - 1954). రవీంద్రుని తదనంతరం ఆయన ప్రభావం నుంచి బయటపడేందుకు బెంగాల్‌ కవులు పెద్ద యుద్ధమే చేయా ల్సివచ్చింది. అభ్యుదయ కవులు కొంతవరకు విజయం సాధించి సొంత గొంతుల్ని యెత్తిప ట్టారు. రవీంద్రుని ప్రభావం నుంచి బయటకు రావడా నికి యిష్టపడని జీబనానంద్‌ దాస్‌ రవీంద్రుని సాంప్రదా యాన్ని అధ్బుత కవితా శక్తితో బలమైన భావవ్యక్తీ కరణతో ముందుకు తీసుకు వెళ్ళారు. ఆ యిమేజరీలు... వుక్కిరిబిక్కిరి చేసే కవితా ధార... చిక్కని పదబంధాలు యెప్పటికీ వెంటాడుతూనే వుంటాయి. యిప్పటికీ బెం గాల్‌ కవిత్వం మీద జీబనా నంద్‌ ముద్ర కొనసాగు తూనే ఉంది.


జీబనానంద్‌ కవిత్వంలో తరుచుగా కనిపించే ‘‘బన లతా సేన్‌’’ కవిత దాదా పుగా రవీంద్రుని గీతాంజలి యెన్ని భాషల్లోకి యెన్ని అనువాదాలకు నోచుకుందో అన్ని అనువాదాలకూ నోచు కుంది. ఆ కవిత నిరంతర ఆకర్షణ. అసలు యెవరీ బన లత అని పరిశోధనలు కూడా చేశారంటే, చివరికి యీ మిస్టిక్‌ కేరెక్టర్‌ వల్ల ఆయన వ్యక్తిగత జీవితం కూడా ధ్వంసం అయిందంటే... బన లత సేన్‌ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. 


చివరకు చాలా విషాదంగా జీబనానంద్‌ దాస్‌ కలకత్తా లోని ట్రామ్‌ కార్‌ కింద పడి 1954 అక్టోబర్‌ 22న తన 55 యేట మరణించారు. ఆంగ్ల అధ్యాపకుడిగా పని చేస్తూ, వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లని యెదుర్కొంటూ ట్రామ్‌ కారు కింద తన జీవితానికి ముగింపు వాక్యం రాసుకున్నారని తన సన్నిహి తులు పేర్కొంటారు. యేది యేమైనా యీ బెంగాల్‌ సౌం దర్యసీమలను వదిలివెళ్లలేనని యెలుగెత్తి చెప్పిన కవి జీబనానంద్‌ దాస్‌.


అన్ని జీవన సామాజిక పార్శ్వాలలో అత్యున్నత స్థాయిని అందుకొన్న బెంగాలీ సాహిత్య ప్రపంచంలో కల్లోల కాలంలో సైతం రవీంద్రుని అడుగుజాడలని వదలని అత్యున్నత సౌందర్యాత్మక ప్రకటన జీబనా నంద దాస్‌ గారిది.


బెంగాలీ గ్రామీణ సౌందర్యంతో పాటు మధ్య తరగతి ఆధునిక మానవుడి జీవన సంవేదనని రవీం ద్రుని కంటే బలంగా వెలుగెత్తినవారు జీబనంద దాస్‌ అని అతని సమకాలీనులైన బుద్దదేవ్‌ బోస్‌, బిష్ణుడేల ప్రశంసించారు. 


1899లో ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బారిసల్‌ గ్రామం లో జన్మించిన జీబనానంద్‌దాస్‌ కుటుంబం కలకత్తాకి తరలి వచ్చి స్థిరపడింది. తన కవిత్వంలో బారిసల్‌ గ్రామీణ ప్రాంత సౌందర్యాన్ని నింపి ‘రూపసీ బంగ్లా’ని వొడిచిపట్టుకొన్నాడు జీబనానందదాస్‌. 


జీబనానంద దాస్‌ మరణించిన తర్వాత వొక ఎక్సర్‌ సైజ్‌ నోట్‌బుక్‌లో ఆయన రాసుకున్న 62 కవితల్ని గుర్తించి ‘రూపసీ బంగ్లా’గా ప్రచురించిన కవితా సంకలనం గొప్ప సంచలనం కలిగించింది. యీ కవిత లన్నింటినీ ఆయన మరణించడానికి 20యేళ్ళ ముందే అంటే 1934లో రాసినట్లు గుర్తించారు. యీ సంకలనం లోని కవితలు వస్తురీత్యా, ఆధునిక పద సౌందర్యం దృష్ట్యా ఆయన ఆ తర్వాత రాసిన కవితలన్నింటి కన్నా మేలైనవిగా ప్రసంశలందుకున్నాయి. 


యీ కవితల్ని తొలుత జీబననాంద్‌ ‘బంగ్లార్‌ త్రష్ట నీలిమ’ (బెంగాలీ నీలి ఆకాశపు అంచుల్లో) పేరిట ప్రచురణకు పంపగా... కవితా ఖండికలకు పేరుపెట్ట కుండా ‘సానెట్‌’ ల్లాగా రాసిన వాటిని సంకలనంగా ప్రచురించడానికి ప్రచురణకర్తలు నిరాకరించటంతో ఆయన తన జీవితకాలంలో ఆ కవితల్ని ప్రచురించ కుండానే వదిలివేసారు. 1947లో ఆయన రచించిన ‘రూపసీ బంగ్లా’ ప్రసిద్ధ కవితని శీర్షికగా పెట్టి ఆయన మరణానంతరం యీ కవితల్ని సంకలనంగా ప్రచు రించారు.


తాను జీవించిన కాలంలో ముప్పిరిగొన్న సామా జిక సంక్షోభ పరిస్థితుల మధ్య కలకత్తా వీధుల్లో సంచరిస్తూ, తాను పుట్టి పెరిగిన బంగ్లాదేశీ సరిహద్దు గ్రామాల్లో తిరగాడుతున్నట్టు భావిస్తూ రాసిన యీ కవిత్వంల్లో జీవన మరణ వేదనల తోపాటు గత వర్తమాన భవిష్యత్‌ కాలాల హృదయ స్పందనల్ని జీబనానంద్‌ నింపారు. ప్రేమ వైఫల్యంతో చేజార్చు కొన్న స్త్రీని ప్రకృతిగా భావిస్తూ ఆమెను తన కవితల్లో బలంగా నింపిన తీరు అబ్బురపరుస్తుంది. విలక్షణ మైన గొంతుతో నిండిన యీ కవితా సంకలనం వెలువడిన వెంటనే బెంగాలీ సాహిత్యంలో రవీంద్రుడి సరసన జీబనానంద్‌ని నిలిపింది.


జీబనానంద్‌ పోయినప్పుడు ఆయన స్మృతిలో యువ కవి సమర రే ‘‘కలకత్తా...! పాలిపోయిన నీ మురికి వీధుల గుండా జీవనానందుడి అంతిమయాత్ర తరలి పోతోంది... ఆ స్వాప్నికునికి నివాళులు అర్పించడానికి నీ దగ్గరున్న పువ్వులు చాలవు. అంతకు మించిన తురాయిలు కావాలి...’’ అని పరితపించటం బెంగాలీ సాహిత్యం మీద జీవనానందుని ప్రభావాన్ని బలంగా యెత్తి చూపుతుంది. జీవనానందుని చదివిన ఆ అను భూతి గాఢత నుంచి వొకంతట బయట పడలేం. ఆ అనుభూతి సుదీర్ఘ కాలం పాటు పట్టి కుదిపేస్తుంది. జీవనానంద్‌ యే వేదననైతే మోసుకొని తిరిగాడో అదే వేదన ఆ కవిత్వాన్ని చదివిన ప్రతి వొక్కరి నెత్తుటి కొమ్మల్లో జాబిలై విరుస్తుంది. 


నగరాలకి వలస వచ్చి జన్మభూమి కోసం తపించే నాగరీకుల గాయపడ్డ ఆత్మగానాలని జీబనానంద కవిత్వం యెలుగెత్తి వినిపిస్తుంది. ఆ పదాల రహదారుల సవ్వడుల మీదుగా, గుండెల్ని గ్రామసీమలకు పరి తపిస్తూ పరుగులెత్తేలా చేస్తుంది.

కుప్పిలి పద్మ


మళ్ళీ తిరిగి వస్తాను... యీ బెంగాల్‌ తీరానికి

యెప్పుడో వొకప్పుడు మళ్లీ యిక్కడకు తిరిగి వస్తాను.

యీ దనశిరీ నదీ తీరాన విశ్రమిస్తాను.

బహుశా మనిషిలా రానేమో.

కాకిలానో గుండెల మీద తెల్లని మరకున్న గద్దలానో 

ప్రభాతాన్ని చీల్చుకొంటూ యెగిరే గోరువంకలానో

వరికంకులు బరువుగా వొంగే వేళ నిగూఢంగా యెగిరే పక్షిలానో వస్తానేమో.

యీ కార్తీకపు రోజుల్లో పనసచెట్టు నీడల్లో వాలిన గద్దలానో 

వో చిన్నబాలిక చిరుగజ్జలు కట్టి మురిపెంగా పెంచుకొంటూన్న యెర్రకాళ్ళ బాతులానో 

యెప్పుడో వొకప్పుడు మళ్లీ యిక్కడకు తిరిగి వస్తాను.

పొలాలు, నదులు కలగలిసిపోయి ముదురాకుపచ్చని చీరని కట్టుకొన్నట్టున్న 

యీ భూమి మీదకి మళ్ళీ తిరిగి వస్తాను.

బహుశా నువ్వు చూస్తావు.

వొక పురుగు తన రెక్కలకంటిన పొగమంచుని దులుపుకొంటున్నప్పుడో

లేదా వొక తెల్లని గుడ్లగూబ పిలుపులో నిండిన వృక్షసీమని నువ్వు వింటున్నప్పుడో

వో పసిపాప భయపడి గుక్కపట్టిన సవ్వడిలోనో

లేదా వో పడవ అలా పొగమంచు తెలుపులోకి మాయమైనప్పుడో

రూపసా నది మురికిలో తెల్లని పొగమంచు యీదులాడి 

తన కాళ్లని కడుక్కుంటున్నప్పుడో 

యెర్రటి మేఘం దట్టమైన నలుపు వర్ణంలోకి సమ్మిళితమవుతోన్న క్షణాన్నో

ఖచ్చితంగా నువ్వు నన్ను గుర్తుపడతావు వీటన్నిట్లోనూ... 

Updated Date - 2020-10-19T06:24:07+05:30 IST