మార్చ్యురీలో బెంగాల్‌ వాన

ABN , First Publish Date - 2022-08-08T05:52:23+05:30 IST

ఇంకా... ఆమెను మూడు రోజులుంచుతారు మంచు తలుపులను దిగ్గొట్టి శిలువ మీద...

మార్చ్యురీలో బెంగాల్‌ వాన

ఇంకా...

ఆమెను మూడు రోజులుంచుతారు

మంచు తలుపులను దిగ్గొట్టి

శిలువ మీద పడుకోబెడతారు

కోల్‌కతా మన్ను నుంచి తెచ్చిన

మైదానపు కొస ఆమె

అచ్ఛంగా... వెన్నెల శిల్పం

నడిచే నిద్ర గన్నేరు పువ్వు

ఆమెను అక్కడ్నే మూడు రోజులుంచుతారు

సాంచబోసిన రైలు శ్శబ్దం

రేణుకెల్లమ్మ ముక్కుపుల్ల

లాడ్‌ బజార్‌కు నడిచొచ్చిన ప్రేమ పావురం

సతాయించే చింతకు

వెన్నుగ నిలిచే పంచలోహ విగ్రహం

                         ఆగ్రహం


వుత్త ఖాళీ జలపాతం

తన కోపం... అమ్మతనం

రూపసారం... జీవభారం

జారుడు బండలమీది వేకువ

జారిపోయింది... ఎపుడూ...

దసర పండుగలాగ... పీర్ల దట్టీలాగ

                   ఆర్ద్రతవుతుంది


దేహమూ... దూపా పట్టించుకోని 

                    బడదీదీ...

ఆమెను అమ్మా అనే అంటారు...

సరిపాడలేని రాత్రి... ఆమె

వాక్యమూ కూడ

ప్రవాహాలను ప్రేమించే వంతెన కూడ

గంగానదిపై ముచ్చట్లు చెబ్తూ వచ్చే

                   మట్టిదీపం కూడ


ఆమెను

పసుపు వెల్తురు ముద్దను చేసి

మూడు రోజులుంచుతారు

కొన్ని జ్నాపకాల యాపకొమ్మలతో

              దడికట్టి ఆపుతారు

పాతబస్తీకి తడిచొచ్చిన కోల్‌కతా గల్లీ కద

మూడు రోజులు... మార్చ్యురీలో

పిల్లల కోసం ఆమె ఎదురుకాస్తూనే

                     వుంటుంది...

ముక్తివాహిని.

(మా అత్తమ్మ దీపాలీదాస్‌ స్మృతిలో)

సిద్ధార్థ

73306 21563


Updated Date - 2022-08-08T05:52:23+05:30 IST