బెంగాలీ భద్రలోక్ దర్శకుడు

Published: Thu, 07 Jul 2022 01:22:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బెంగాలీ భద్రలోక్ దర్శకుడు

ఆలోచనాత్మక ఫీల్‌ గుడ్ సినిమాలతో బెంగాలీ సినిమా రంగంలో విలక్షణతను చాటుకున్న దర్శకుడు ‘పద్మశ్రీ’ తరుణ్ మజుందార్. ఆయన ఈ జూలై నాలుగున తన 92 ఏళ్ల వయసులో పరమపదించారు. ఆయన మరణంతో బెంగాలీ ప్రధాన స్రవంతి సినిమా రంగం ఒక మాస్టర్ డైరెక్టరుని కోల్పోయింది. సాధారణంగా బెంగాలీ సినిమా అనగానే ప్రపంచ విఖ్యాతులయిన సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ గుర్తుకు వస్తారు. వారితో పాటు బెంగాల్ నుంచి వెళ్లి ముంబాయి హిందీ సినిమా రంగంలో విలక్షణ దర్శకులుగా పేరొందిన బిమల్ రాయ్, అసిత్ సేన్, హృషికేష్ ముఖర్జీ, బాసు చట్టర్జీ, బాసు భట్టాచార్యలు గుర్తొస్తారు. అంతేకాదు తపన్ సిన్హా, శక్తీ సామంత, హేమంత్ కుమార్  స్ఫురణకు వస్తారు. కానీ వీరందరికీ సమాంతరంగా బెంగాలీ ‘భద్రలోక్’ దర్శకుడిగా విజయవంతమైన సినిమాల్ని రూపొందించినవాడు తరుణ్ మజుందార్. ఆయన తన సినిమాల్లో ప్రధానంగా ఉమ్మడి కుటుంబం, ఉన్నత మానవీయ విలువలకు ప్రధాన భూమికను ఇచ్చారు. అంతేకాదు సాహిత్యంలో అనేక ఉత్తమ నవలల్ని సినిమాలుగా తీశారు. ‘రవీంద్ర సంగీత్’ను తన సినిమాల్లో విస్తృతంగానూ విశేషంగానూ ఉపయోగించి గొప్ప పాటల్ని బెంగాలీలకు అందించారు. తన అరవై ఏళ్ళ సినీ జీవితంలో ఆయన దాదాపు 40 సినిమాల్ని తీశారు. 


తరుణ్ మజుందార్ జనవరి 8, 1931న భొగ్రాలో జన్మించారు. అదిప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చ్ కాలేజీలో చదువుకున్నారు. తరుణ్ మజుందార్‌ తన మొదటి సినిమాకు మరో ఇద్దరు మిత్రులు సచిన్ ముఖర్జీ, దిలీప్ ముఖర్జీలతో కలిసి ‘యాత్రిక్’ పేరుతో సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఆ సినిమా ‘చావ్వో పవ్వా’. ఇందులో ఉత్తమ కుమార్, సుచిత్రా సేన్‌లు ప్రధాన భూమికల్ని పోషించారు. అదే ‘యాత్రిక్’ గ్రూపుతో ‘కంచెర్ స్వర్గో’, ‘పలటక్ ’ అనే మరో రెండు సినిమాల్నీ తీశారు. తర్వాత నుంచి తను ఒక్కరే దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించటం మొదలుపెట్టారు. 1962లో ఆయన తీసిన ‘కంచెర్ స్వర్గో’ సినిమాకు తొలి జాతీయ అవార్డును అందుకున్నారు. తర్వాత 1972లో రూపొందించిన ‘గణదేవత’ సినిమాకు రెండోసారి జాతీయ అవార్డును అందుకున్నారు. ‘గణదేవత’ సినిమాను సుప్రసిద్ధ రచయిత తారాశంకర్ బందోపాధ్యాయ్ రాసిన కథ ఆధారంగా నిర్మించారు. ఇంకా బిమల్‌కర్ కథ ఆధారంగా తరుణ్ మజుందార్‌ ‘బాలికా బధు’, శరదిందు బందోపాధ్యాయ్ కథ ఆధారంగా ‘దాదర్’ తీశారు. ఇలా సాహిత్య రూపాంతరీకరణలో ఆయన ముందున్నారు. తరుణ్‌ మజుందార్‌ మొత్తంగా నాలుగు జాతీయ అవార్డులు, 7 బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ అవార్డులు, ఒక జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 1990లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఆయన రూపొందించిన కొన్ని సినిమాల వివరాల్లోకి వస్తే ‘పలటక్’ మనోజ్ బసు రాసిన కథ ఆధారంగా తీశారు. ఇందులో ప్రధానంగా ఒక యువకుడికి పెళ్లి తర్వాత సాంప్రదాయాలకు భిన్నంగా కలిగిన ప్రపంచ అవగాహన, ప్రాపంచిక దృష్టి తదితర అంశాల్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇది ఇప్పుడు జీ5లో అందుబాటులో ఉంది. ‘బాలికా బధు’ చిత్రాన్ని బాల్య వివాహ సమస్యను ఆధారం చేసుకుని తీశారు. బిమల్‌కర్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో మౌసమీ చటర్జీ బాలిక పాత్రలో గొప్పగా కనిపిస్తుంది. దీనినే తర్వాత హిందీలో రీమేక్ చేశారు. అది బెంగాలీ సినిమా అంత విజయవంతం కాలేదు. కానీ ‘బడే అచ్చే లగ్ తే హైన్..’ లాంటి పాటతో ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకుముందే ఆయన మిత్రుడు హేమంత్‌ కుమార్ చొరవతో ‘రహ్గిర్’ అన్న సినిమా తీశారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అందులో గుల్జార్ రాసిన ‘జనమ్ సే బంజారా హూన్ బంధు..’, ‘మిత్వారే భూల్ గయే..’ లాంటి మంచి పాటలున్నప్పటికీ ఆ సినిమా ఆడలేదు. అ తర్వాత తరుణ్ మజుందార్‌ హిందీ సినిమాలు తీయడానికి ఆసక్తి చూపలేదు. అట్లా తన సినీ జీవితంలో ప్రధాన స్రవంతి చలన చిత్రకారుడిగా అర్థవంతమయిన సినిమాల్ని రూపొందించి తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న తరుణ్ మజుందార్ లేని లోటు బెంగాలీ సినిమాకే కాక మొత్తం భారతీయ సినిమాకు పూడ్చలేనిది. ఆయనకు బాధాతప్త హృదయపూర్వక నివాళి.

వారాల ఆనంద్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.