Advertisement

బెంగళూరు టాప్‌ గేర్‌

Apr 23 2021 @ 01:32AM

  • శతక్కొట్టిన పడిక్కళ్‌ 
  • అదరగొట్టిన కోహ్లీ  
  • రాజస్థాన్‌పై భారీ విజయం


ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దుమ్మురేపుతోంది. మరోసారి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన కోహ్లీ సేన టోర్నీలో  వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ సెంచరీతో పాటు కెప్టెన్‌ విరాట్‌ సమయోచిత బ్యాటింగ్‌తో బెంగళూరు మరో సునాయాస విజయంతో లీగ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 


ముంబై: ఐపీఎల్‌-14లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 నాటౌట్‌) శతకంతో పాటు విరాట్‌ కోహ్లీ (47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో విజృంభించడంతో బెంగళూరు 10 వికెట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 16.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 181 స్కోరు చేసి అలవోకగా ఛేదించింది. పడిక్కళ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. తొలుత శివమ్‌ దూబే (46), రాహుల్‌ తెవాటియా (40) రాణించడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (25), కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (21) పర్వాలేదనిపించారు. మహ్మద్‌ సిరాజ్‌ (3/27), హర్షల్‌ పటేల్‌ (3/47) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. జేమిసన్‌, రిచర్డ్‌సన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ తీశారు. 


పడిక్కళ్‌ జోరు: భారీ ఛేదనలో ఓపెనర్లు పడిక్కళ్‌-కోహ్లీ అద్భుత ఆరంభాన్నిచ్చారు. పడిక్కళ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచే వీరిద్దరూ జోరు ప్రదర్శించడంతో రాజస్థాన్‌ బౌలింగ్‌ కకావికలైంది. గోపాల్‌ వేసిన తొలి ఓవర్‌లో నాలుగో బంతిని కోహ్లీ సిక్సర్‌ బాదాడు. సకారియా వేసిన రెండో ఓవర్‌లో ఫోర్‌తో దేవ్‌దత్‌ భారీ ఇన్సింగ్స్‌కు తెరలేపాడు. అతని దెబ్బకు బంతి మైదానంలోకంటే బౌండ్రీలైన్‌ బయటే ఎక్కువ ఉంది. ఈ క్రమంలో పడిక్కళ్‌ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు విరాట్‌ 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. వీరి విజృంభణతో బెంగళూరు 10 ఓవర్లలో వంద పరుగుల మార్క్‌ను దాటింది. అర్ధ సెంచరీ తర్వాత దేవ్‌దత్‌ మరింత వేగం పెంచడంతో లక్ష్యం తరుగుతూ వచ్చింది. 17వ ఓవర్‌లో పడిక్కల్‌ కెరీర్‌లో తొలి ఐపీఎల్‌ శతకం నమోదు చేశాడు. అదే ఓవర్‌లో బెంగళూరు విజయం సాధించింది. 


చెలరేగిన సిరాజ్‌: తొలి పది ఓవర్లలో బెంగళూరు బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్టు పెవిలియన్‌కు చేరడంతో విలువైన భాగస్వామ్యాలు నమోదు కాలేదు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్న కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయానికి న్యాయం చేస్తూ సిరాజ్‌ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. తన రెండో ఓవర్‌లో తొలి బంతికే బట్లర్‌ (8)ను సిరాజ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసి రాజస్థాన్‌కు షాకిచ్చాడు. మరో ఓపెనర్‌ వోహ్రా (7) కూడా జేమిసన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించగా మిడ్‌ఆన్‌లో రిచర్డ్‌సన్‌కు చిక్కాడు. భారీ అంచనాలున్న డేవిడ్‌ మిల్లర్‌ (0)ను సిరాజ్‌ అద్భుతమైన యార్కర్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌-శివమ్‌ దూబే జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఎనిమిదో ఓవర్‌లో జోరుమీదున్న శాంసన్‌ను వాషింగ్టన్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు.


ఆదుకొన్న దూబే: ఒకవైపు వికెట్లు పడుతున్నా దూబే ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశాడు. పరాగ్‌ సహకారంతో దూబే స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. చాహల్‌ వేసిన 9వ ఓవర్‌లో శివమ్‌ రెండు భారీ సిక్సర్లతో ఆత్మవిశ్వాసం కూడదీసుకొన్నాడు.. మరో ఎండ్‌లో పరాగ్‌ కూడా భారీ షాట్లతో చెలరేగాడు. చివరికి హర్షల్‌ బౌలింగ్‌లోనే పరాగ్‌ క్యాచ్‌ అవుట్‌ కావడంతో ఐదో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 


తెవాటియా మెరుపులు: పరాగ్‌ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తెవాటియా మెరుపు బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఇక్కడి నుంచి తెవాటియా వేగంగా బ్యాటింగ్‌ చేయడంతో బెంగళూరు బౌలింగ్‌ గాడి తప్పింది. 
 

కోహ్లీ అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో ఆరువేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ (196 మ్యాచ్‌ల్లో 6021 పరుగులు) రికార్డు సాధించాడు. సురేశ్‌ రైనా (197 మ్యాచుల్లో 5448 రన్స్‌), ధవన్‌ (180 మ్యాచుల్లో 5428 రన్స్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్కోరు బోర్డు


రాజస్థాన్‌: బట్లర్‌ (బి) సిరాజ్‌ 8; మనన్‌ వోహ్రా (సి) రిచర్డ్‌సన్‌ (బి) జేమిసన్‌ 7; శాంసన్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) సుందర్‌ 21; మిల్లర్‌ (ఎల్బీ) సిరాజ్‌ 0; శివమ్‌ దూబే (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) రిచర్డ్‌సన్‌ 46; రియాన్‌ పరాగ్‌ (సి) చాహల్‌ (బి) హర్షల్‌ 25; రాహుల్‌ తెవాటియా (సి) షాబాజ్‌ (బి) సిరాజ్‌ 40; మోరిస్‌ (సి) చాహల్‌ (బి) హర్షల్‌ 10; గోపాల్‌ (నాటౌట్‌) 7; చేతన్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) హర్షల్‌ 0; ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 177/9; వికెట్ల పతనం: 1-14, 2-16, 3-18, 4-43, 5-109, 6-133, 7-170, 8-170, 9-170; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-27-3; జేమిసన్‌ 4-0-28-1; రిచర్డ్‌సన్‌ 3-0-29-1; చాహల్‌ 2-0-18-0; వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-23-1; హర్షల్‌ పటేల్‌ 4-0-47-3. 

బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (నాటౌట్‌) 72, దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (నాటౌట్‌) 101, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం 16.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181; బౌలింగ్‌:  శ్రేయాస్‌ గోపాల్‌ 3-0-35-0, చేతన్‌ సకారియా 4-0-35-0, క్రిస్‌ మోరిస్‌ 3-0-38-0, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ 3.3-0-34-0, రాహుల్‌ తెవాటియా 2-0-23-0, రియాన్‌ పరాగ్‌ 1-0-14-0.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.