
- పోలీసుల గ్రీన్‌సిగ్నల్
బెంగళూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఐటీ నగరి బెంగళూరులో రాత్రంతా హోటళ్లు కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నగర పోలీసులు నివేదిక సమర్పించారు. దీనిని బట్టి బెంగళూరు నగరంలోని కీలక ప్రాంతాలలో 24/7 హోటళ్లు పనిచేసేలా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాలలో రాత్రంతా ఆహారపదార్థాలు లభించనున్నాయి. నగరవ్యాప్తంగా హోటళ్ళు తెరిచేలాంటి ప్రతిపాదనలు వచ్చినా శాంతిభద్రతల సమస్య తలెత్తనుందనే కారణంతో కేవలం రద్దీ ప్రాంతాలకు మాత్రమే అమలు చేయవచ్చునని నగర పోలీసుల నివేదికలో స్పష్టం చేశారు. ఇదే విషయమై నగర హోటళ్ళ సంఘం అధ్యక్షుడు పీసీ రావ్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో హోటళ్ళు పనిచేసేలా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితంగా నగర పోలీసులు నివేదికలు సిద్ధం చేయడం సరికాదన్నారు. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలలో రాత్రంతా హోటళ్ళు నడిపేందుకు అనుమతులు ఇచ్చారని అదే తరహాలోనే బెంగళూరులోను అమలు చేయడం సముచితమని పేర్కొన్నారు. త్వరలోనే సంఘం ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి