Airport like Railway Terminal: ఇది ఎయిర్‌పోర్ట్ టెర్మినర్ అనుకునేరు.. కాదు.. కాదు..

ABN , First Publish Date - 2022-06-07T01:31:39+05:30 IST

ఐటీ నగరిగా పేరొందిన బెంగళూరులో రైల్వేస్టేషన్లకు హైటెక్‌ సొబగులు అందుతున్నాయి. బెంగళూరులో రైల్వేస్టేషన్లు ప్రారంభమై 200 సంవత్సరాలు దాటింది. బ్రిటీష్‌ కాలంలో అప్పటి సైనికుల కోసం..

Airport like Railway Terminal: ఇది ఎయిర్‌పోర్ట్ టెర్మినర్ అనుకునేరు.. కాదు.. కాదు..

బెంగళూరు: ఐటీ నగరిగా పేరొందిన బెంగళూరులో రైల్వేస్టేషన్లకు హైటెక్‌ సొబగులు అందుతున్నాయి. బెంగళూరులో రైల్వేస్టేషన్లు ప్రారంభమై 200 సంవత్సరాలు దాటింది. బ్రిటీష్‌ కాలంలో అప్పటి సైనికుల కోసం దక్షిణ భారత్‌లో అనుకూలం కోసం కంటోన్మెంట్‌, మెజస్టిక్‌ రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా నగరం విస్తారమైంది. ఐటీ బీటీ సహా వందలాది ఎంఎన్‌సీ సంస్థలు ఏర్పాటు కావడంతో ఉద్యోగులు, వారి కుటుంబీకులు లక్షల మంది నగరంలో స్థిరపడ్డారు. ఇలా కోటి దాటిన జనాభాకు అనుగుణంగా రవాణాలో భారీ మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి రైల్వే విభాగంలో ప్రయాణికులు మెచ్చేలాంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. మెజస్టిక్‌ రైల్వేస్టేషన్‌ను క్రాంతివీర సంగొళ్లిరాయణ్ణ స్టేషన్‌గా పిలుస్తారు. దేశంలోని ప్రముఖమైన ప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వస్తాయి. పది ప్లాట్‌ఫాంలు ఉండడంతో ఓ వైపు హైదరాబాద్‌ సహా ఉత్తర భారత్‌కు వెళ్లే రైళ్లు, మరోవైపు కర్ణాటకలోని హుబ్బళ్లి-ధార్వాడ మీదుగా మరోవైపు దక్షిణకన్నడ జిల్లాలకు వెళ్లే మార్గాలకు ఇది జంక్షన్‌గా ఉంది. రోజూ వందల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తుండగా లక్షలాదిమంది దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తుంటారు.


రైల్వేస్టేషన్‌కు అనుబంధంగా నగరంలోని నాలుగువైపులకు వెళ్లే మెట్రో రైలు సేవలు, నగర వ్యాప్తంగా వెళ్లేందుకు బీఎంటీసీ బస్సులు, ఆంధ్ర, తెలంగాణతోపాటు కర్ణాటక వ్యాప్తంగా వెళ్లేందుకు అనుబంధంగా బస్సు స్టేషన్లు ఇక్కడే ఉన్నాయి. ప్రయాణికులు సేద తీరేందుకు తగిన విశ్రాంతి గదులు, టికెట్‌ కౌంటర్లు, ఎస్కలేటర్‌లతో పాటు పార్కింగ్‌ స్థలం, ఫుడ్‌కోర్టు అందుబాటులో ఉంది. తాజాగా అక్వేరియం మధ్య ప్లాట్‌ఫాంకు వెళ్లే లా సరికొత్త మార్గాన్ని ఆవిష్కరించారు.


బయ్యప్పనహళ్లిలో ఏసీ రైల్వేస్టేషన్‌

రైల్వే విభాగం మరిన్ని ఆవిష్కరణలకు తెర లేపింది. బెంగళూరు పరిధిలోని బయ్యప్పనహళ్లిలో తొలి ఏసీ రైల్వేస్టేషన్‌ను రూపొందించింది. ఈ టర్మినల్‌కు భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టేషన్‌గా నామకరణం చేశారు. స్టేషన్‌లో అద్భుతం అనిపించే ఫౌంటైన్లు, ఉద్యానవనాన్ని తలపించేలా పచ్చదనం ఏర్పాటు చేశారు. విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌లో పూర్తిగా ఏసీ సౌలభ్యం ఉంటుంది. ఇందుకు పూర్తిగా సౌర విద్యుత్‌ను వినియోగించనున్నారు. స్టేషన్‌లో 15 ట్రాక్‌లు ఉండగా 8 ట్రాక్‌లపై ప్రస్తుతానికి రాకపోకలకు అనుకూలంగా ఉంది. ప్లాట్‌ఫాంల మధ్య ఎస్కలేటర్‌ సౌలభ్యంతోపాటు వర్షపునీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్యాంకర్లను నిర్మించారు. ఈ టెర్మినల్‌ ద్వారా 549 రైళ్లు సంచరించేందుకు అనుకూలం చేశారు. కేంద్ర రైల్వేమంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి సహా ప్రముఖులు పాల్గొననున్నారు. రైల్వేస్టేషన్‌ నిర్మాణం కోసం రూ.240 కోట్లు ఖర్చు చేశారు.



మరింత హైటెక్‌గా కంటోన్మెంట్‌ స్టేషన్‌

నగర పరిధిలోని మెజస్టిక్‌, బయ్యప్పనహళ్లి రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పూర్తి కావడంతో మరో చారిత్రాత్మకమైన కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ను మరింత హైటెక్‌గా తీర్చిదిద్దేందుకు నైరుతి రైల్వే సిద్ధమైంది. ఇందు కోసం రూ.442 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ బ్రిటీష్‌ సైనికుల కోసం ఏర్పాటు చేసింది. ఆ స్టేషన్‌కు సంబంధించిన చారిత్రాత్మక శైలికి ఏమాత్రం భంగం లేకుండా ఆధునికీకరిస్తారు. రైల్వేస్టేషన్‌లో బహుళ అంతస్తుల భవనాలు, పార్కింగ్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వర్షపునీరు సద్వినియోగం ప్లాంట్‌, సౌరశక్తి సౌలభ్యాలను అనుసంధానం చేస్తారు.


కొత్త భవనాలకు వసంతనగర్‌ వైపు ఓ ప్రవేశం, మరోవైపు మిల్లర్స్‌రోడ్డుకు అనుకూలం చేయాలని నిర్ణయించారు. టికెట్‌ కౌంటర్లను మరోచోటుకు మార్పు చేసే ఆలోచనలో ఉన్నారు. రెండు ప్రవేశ ద్వారాలలోనూ రెండు అంతస్తుల అండర్‌గ్రౌండ్‌లో పార్కింగ్‌ కల్పిస్తారు. ప్రతిరోజూ వంద రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా వెళ్లేందుకు వీలు కల్పించి కనీసం 50 వేల మందికి అనుకూలం చేస్తారు. సబ్‌ అర్బన్‌ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తారు. ఇదే ప్రాంతానికి మెట్రో స్టేషన్‌కు వస్తుండడం మరింత అనుకూలం కానుంది. కంటోన్మెంట్‌ స్టేషన్‌కు చేరుకుంటే అక్కడి నుంచి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా నగరంలోని ఏ ప్రాంతానికైనా మెట్రో రైలులో చేరేందుకు వీలుంది. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలెప్‌మెంట్‌ కంపెనీ కర్ణాటక లిమిటెడ్‌ (కే రైడ్‌) కంటోన్మెంట్‌ నుంచి కెంగేరి-వైట్‌ఫీల్డ్‌కు సబ్‌ అర్బన్‌ రైలు ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఈ కారిడార్‌కు కే రైడ్‌ టెండర్‌లను ఆహ్వానించాల్సి ఉంది. మెట్రో రెండో విడతలో భాగంగా డైరీ సర్కిల్‌ నుంచి నాగవారకు అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణాలు సాగుతున్న తరుణంలోనే కంటోన్మెంట్‌ స్టేషన్‌ను ఆధునికీకరించే ప్రాజెక్టు రావడంతో రూపురేఖలు మారిపోనున్నాయి.

Updated Date - 2022-06-07T01:31:39+05:30 IST