
బెంగళూరు : కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru) నగరంలోని క్యూబన్ పార్క్(Cubbon Park)లోకి పెంపుడు జంతువుల(Pet animals) ప్రవేశంపై నిషేధం(Ban) విధించాలని ఆ రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధనను ఆచరణలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. శ్రీ చమరాజేంద్ర పార్క్(Sri Chamarajendra Park)గా కూడా పేరున్న ఈ పార్క్ వెలుపల బోర్డులు కూడా పెట్టాలనుకుంటున్నారు. పార్క్‌లు, గార్డెన్ల మార్గదర్శకాల ఉల్లంఘన జరుగుతుందంటూ, కుక్కలను ఫ్రీగా వదిలేయడంతో తమకు ప్రమాదకరంగా మారుతున్నాయంటూ వాకర్ల నుంచి 300లకుపైగా ఫిర్యాదులు అందిన తర్వాత అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. చేంజ్.ఓఆర్‌జీ పేరిట ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ 5,250 మంది పిటిషన్‌ను బలపరిచారు. ఈ పిటిషన్‌ను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సీజీ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించింది. జులై 1 నుంచి పార్క్‌లో పెంపుడు కుక్కలపై నిషేధం విధించబోతున్నారని తెలుసుకుని షాక్‌కు గురయ్యామని పేర్కొంది. కొంతమంది కుక్కలను వదిలేస్తున్నారని అంటున్నారు. కానీ మంచిగా నడుచుకునే కుక్కల సంరక్షకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాళ్లంతా ఎక్కడికి వెళ్తారని అంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కుక్కల యాజమానుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలోచించాలని సూచించారు. ఈ మేరకు హార్టీకల్చర్ అండ్ సెరీకల్చర్ డిపార్ట్‌మెంట్ ప్రన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి