Modi కోసం BBMP ఆర్భాటం.. 2 రోజుల్లోనే ఎగిరిపోయిన Road

ABN , First Publish Date - 2022-06-24T21:13:34+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్ణాటకకు వచ్చారు. అయితే ప్రధాని పర్యటనను దృష్టిలో పెట్టుకుని బెంగళూరులోని పలు రోడ్లను తళుక్కుమనేలా తయారు చేయాలని బీబీఎంపీ నిర్ణయించింది. ఇందుకు 24 కోట్ల రూపాయలు

Modi కోసం BBMP ఆర్భాటం.. 2 రోజుల్లోనే ఎగిరిపోయిన Road

బెంగళూరు: పాలకుల మన్నన పొందడంలో ఉండే ఆరాటం.. ప్రజల సౌకర్యాలను తీర్చడంలో అధికార యంత్రానికి ఉండదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో నిర్మించిన ఒక రోడ్డు రెండంటే రెండే రోజుల్లో ఎగిరిపోయింది. ప్రధాని కాన్వాయ్ బాగానే వెళ్లింది కానీ.. మిగతా వాహనాలే నడిచేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. బృహత్ బెంగళూరు మహానరగ పాలిక అధికారుల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రధానమంత్రి కార్యాలయం అలర్ట్ అయింది. ఈ విషయమై సమాధానం ఇవ్వాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నిమిత్తం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. బీబీఎంసీ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ ఘటనపై వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించడంతో పాటు నాణ్యతారాహిత్యంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్ణాటకకు వచ్చారు. అయితే ప్రధాని పర్యటనను దృష్టిలో పెట్టుకుని బెంగళూరులోని పలు రోడ్లను తళుక్కుమనేలా తయారు చేయాలని బీబీఎంపీ నిర్ణయించింది. ఇందుకు 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడు రోడ్లను నిర్మించింది. ఇందులో కెంగెరి నుంచి కొమ్మఘట్ట వరకు ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఒకటి. దీనికి సుమారు ఆరు కోట్ల రూపాయల ఖర్చు అయ్యాయి. అయితే ఈ రోడ్డు వేసిన రెండు రోజులకే పెచ్చులు ఊడడం, రంగు ఎగిరిపోవడం, రోడ్డు గుంతలు పడటం లాంటివి కనిపించాయి. దీంతో ఈ రోడ్డును తమ ఫోన్లలో బంధించుకున్న ప్రయాణికులు నెట్టింట్లో షేర్ చేశారు. దీంతో ప్రభుత్వంపై అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపున నగరంలో ప్రధాని మోదీ.. ఐటీ ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే మరొక వైపు నగరంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉందంటూ వివర్శల వర్షం కురిపించారు. దీనికి తోడు మరి కొద్ది రోజుల్లో బీబీఎంపీకి ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం వెంటవెంటనే స్పందించింది.

Updated Date - 2022-06-24T21:13:34+05:30 IST