బెంజ్‌-2 ఫ్లై ‘ఓవర్‌’

ABN , First Publish Date - 2021-11-06T05:29:19+05:30 IST

బెంజ్‌-2 ఫ్లై ‘ఓవర్‌’

బెంజ్‌-2 ఫ్లై ‘ఓవర్‌’

నేడు ట్రయల్‌ రన్‌

నేటి నుంచే వాహనాల రాకపోకలకు అనుమతిల

14న కేంద్రమంత్రి గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభోత్సవం

16 నెలల్లోనే పూర్తిచేసిన కాంట్రాక్టు సంస్థ 

నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

నగరవాసులకు శుభవార్త. బెంజిసర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెడుతూ బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. చాలా తక్కువ వ్యవధిలో పూర్తయిన ఈ ఫ్లై ఓవర్‌పై శనివారం నుంచి రాకపోకలకు అనుమతినిస్తుండగా, ఈనెల 14వ తేదీన అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీలకమైన ఫ్లై ఓవర్‌ పూర్తికావడంతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌కు ఇక చెక్‌ పెట్టినట్టే.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెంజిసర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయింది. కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా శుక్రవారం ఫ్లై ఓవర్‌ను జాతీయ రహదారుల సంస్థకు అప్పగించింది. దీంతో బెంజ్‌-2 ప్రారంభోత్సవానికి ముస్తాబైనట్టే. ఫ్లై ఓవర్‌పై శనివారం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి రాకపోకలకు అనుమతి ఇస్తారు. వారం పాటు రాకపోకలకు అనుమతులు ఇచ్చాక ఈనెల 14వ తేదీన అధికారికంగా ప్రారంభిస్తారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ కూడా పాల్గొనే అవకాశముంది. ఈ మేరకు ఫ్లై ఓవర్‌ను అందంగా తీర్చిదిద్దారు. లైటింగ్‌, వైట్‌ మార్కింగ్‌ పనులు చేపట్టారు. దీంతో పాటు ఫ్లై ఓవర్‌ ల్యాండింగ్‌ ప్రాంతంలో జాతీయ రహదారిని విస్తరించారు. సెంట్రల్‌ డివైడర్‌ పనులు కూడా మార్పు చేశారు.

ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం

బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌పై రాకపోకలకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తగ్గనుంది. ఇప్పటివరకు ఒక వరసలోనే ఫ్లై ఓవర్‌ ఉండటం వల్ల పెద్దగా తేడా తెలియలేదు. రెండో వరస కూడా అందుబాటులోకి రావడంతో భారీ వాహనాలు పూర్తిస్థాయిలో ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్తాయి. ఈ రెండు ఫ్లై ఓవర్ల కారణంగా ఇక మీదట బెంజిసర్కిల్‌, నిర్మల కాన్వెంట్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ పెద్దగా కనిపించదనే చెప్పాలి. 

బెంజ్‌-2 ఘనత

బెంజిసర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ శరవేగంగా రూపుదిద్దుకుని రికార్డు సృష్టించింది. రెండేళ్ల గడువుకు గానూ 16 నెలల్లోనే కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయటం విశేషం. మొత్తం 224 భూగర్భ పిల్లర్లు, 56 పిల్లర్లు, 220 గడ్డర్లు, 56 స్పాన్లు, 56 శ్లాబులతో రూపుదిద్దుకుంది. నిడివి 1.4 కిలోమీటర్లు. నగరంలో జనావాసాలకు ధ్వని కాలుష్యం లేకుండా దీనిని నిర్మించారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థకు బోనస్‌తో పాటు అవార్డు కూడా లభించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-11-06T05:29:19+05:30 IST